వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
15 రాష్ట్రాలు/యూటీల్లో అందుబాటులోకి వినియోగదారుల ఫిర్యాదుల ఆన్‌లైన్ పరిష్కార వేదిక 'ఇ-దాఖిల్ పోర్టల్'; గతేడాది సెప్టెంబర్ 7న ప్రారంభించిన 'జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్' (ఎన్‌సీడీఆర్‌సీ)
ఎన్‌సీడీఆర్‌సీ, రాష్ట్ర, జిల్లా కమిషన్లు సహా మొత్తం 444 ప్రాంతాల ద్వారా సేవలు
ఇ-దాఖిల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేయడం సులభం, సరళతరం
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్న డిజిటల్ పోర్టల్
గ్రామీణ ప్రాంత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేలా, సాధారణ సేవ కేంద్రాలతో ఇ-దాఖిల్ పోర్టల్ అనుసంధానం
ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు/యూటీలతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం సంప్రదింపులు
Posted On:
26 FEB 2021 1:38PM by PIB Hyderabad
వినియోగదారులు తమ వివాదాలను ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసి, పరిష్కరించుకునేందుకు తీసుకొచ్చిన ఇ-దాఖిల్ పోర్టల్ ప్రస్తుతం 15 రాష్ట్రాలు/యూటీల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా అన్ని
రాష్ట్రాలు/యూటీలతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.
వినియోగదారుల కమిషన్లలో ఫిర్యాదులను ఇ-ఫైల్ చేసేందుకు, ఫిర్యాదు నమోదు చేసేందుకు ఆన్‌లైన్ రుసుము కట్టేలా గతేడాది జులై 20 నుంచి అమల్లోకి వచ్చిన 'వినియోగదారుల రక్షణ చట్టం-2019'లో నిబంధన ఉంది. వినియోగదారుల ఫిర్యాదులను ఇ-ఫైల్ చేయడానికి Edaakhil.nic.in పేరిట వెబ్ అప్లికేషన్‌ను ఎన్‌ఐసీ రూపొందించింది. ఇందులో ఇ-నోటీసు, కేసు పత్రాల డౌన్‌లోడ్ లింక్, వీసీ విచారణ లింక్, అవతలి పక్షం ద్వారా రాతపూర్వక స్పందన దాఖలు, వారికి రాతపూర్వక సమాధానం పంపడం, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సందేశాలు అందుకోవడం వంటి సౌకర్యాలు ఈ పోర్టల్‌లో ఉన్నాయి.
ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేయడానికి, రుసుము చెల్లించడానికి వినియోగదారులకు, వారి న్యాయవాదులకు ఇ-దాఖిల్ వీలు కల్పిస్తుంది. ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదులను పరిశీలించి, వాటిని స్వీకరించడానికి లేదా తిరస్కరించడానికి లేదా మిగిలిన ప్రక్రియ కోసం సంబంధిత కమిషన్లకు పంపడానికి వినియోగదారుల కమిషన్లకు కూడా వీలుంటుంది.
గ్రామీణ ప్రాంత వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండేలా, సాధారణ సేవ కేంద్రాలతో (సీఎస్‌సీ) ఇ-దాఖిల్ పోర్టల్‌ను అనుసంధానించాలని నిర్ణయించారు. ఎలక్ట్రానిక్ వ్యవస్థలు అందుబాటులోలేని, ఉన్నా వినియోగించుకోవడం తెలీని గ్రామ స్థాయి వినియోగదారులు సీఎస్‌సీల ద్వారా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ అనుసంధాన ప్రక్రియ ఇంకా నిర్మాణ దశలో ఉంది.
గతేడాది సెప్టెంబర్ 7న, 'జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్' (ఎన్‌సీడీఆర్‌సీ) ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఆ తర్వాతి రోజే దీనిని అమల్లోకి తెచ్చిన దిల్లీ, తొలి రాష్ట్రంగా నిలిచింది. తర్వాత, మహారాష్ట్ర, అండమాన్&నికోబార్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, గుజరాత్, ఛండీఘర్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, హరియాణాలు కూడా ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఎన్‌సీడీఆర్‌సీ, రాష్ట్ర, జిల్లా కమిషన్లు సహా మొత్తం 444 ప్రాంతాలు పోర్టల్ పరిధిలోకి వచ్చాయి.
***
(Release ID: 1701225)
Visitor Counter : 252