ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు-2021 విడుదల

మధ్యవర్తిత్వ మార్గదర్శక సూత్రాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళిపై ప్రభుత్వ నోటిఫికేషన్
సామాజిక మాధ్యమాలు భారతదేశంలో కార్యకలాపాలు సాగించవచ్చు
కానీ, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించాలి
ప్రశ్నలు సంధించడానికి, విమర్శలకు సామాజిక మాధ్యమ వేదికను తప్పకుండా వినియోగించవచ్చు
సామాజిక మాధ్యమ వేదికల ద్వారా సాధారణ వినియోగదారులకు సాధికారత
అయితే ఎలాంటి దుర్వినియోగం జరక్కుండా చూసేందుకు వాటికి జవాబ్దారీతనం అవసరం
కొత్త నిబంధనావళి ద్వారా సామాజిక మీడియా వినియోదదార్లకు సాధికారత, సకాలంలో ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థ

స్వీయనియంత్రణ వ్యవస్థ ఏర్పాటుపైనే డిజిటల్ మీడియా, ఒ.టి.టి. నిబంధనల దృష్టి కేంద్రీకరణ.,
పాత్రికేయ, సృజనాత్మక స్వేచ్ఛను బలపరుస్తూనే ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్ట యంత్రాంగం

ప్రతిపాదిత వ్యవస్థ ప్రగతిస్ఫోరకం, స్వేచ్ఛాయుతం, సమకాలీనం

ప్రజాందోళలను తొలగించడం, సృజనాత్మక, వాక్సాతంత్ర్యం, భావ స్వేచ్ఛ అణచివేతపై అపోహలను పోగొట్టడం కొత్త వ్యవస్థ లక్ష్యం

థియేటర్లలో, టెలివిజన్ తెరపై వీక్షణం, ఇంటర్నెట్.పై చూడటం మధ్య తేడాను దృష్టిలో పెట్టుకుని మార్గదర్శకాల రూపకల్పన

Posted On: 25 FEB 2021 2:44PM by PIB Hyderabad

డిజిటల్ మీడియాకు సంబంధించి వినియోగదారుల పారదర్శకత, జవాబ్దారీతనం, హక్కుల గురించి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో 2021వ సంవత్సరపు ఇన్ఫర్మేష్ టెక్నాలజీ నియమ నిబంధనలను, మధ్యవర్తిత్వ మార్గదర్శక సూత్రాలను, డిజిటల్ మీడియా నైతిక సూత్రాల నియమావళిని ప్రభుత్వం నోటిఫై చేసింది. వివిధ వర్గాల ప్రజలతో, భాగస్వామ్యవర్గాలవారితో విస్తృత స్థాయి సంప్రదింపుల అనంతరం ఈ నిబంధనలను తయారు చేశారు. 2000వ సంవత్సరపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 87 (2)వ సెక్షన్ కింద దఖలు పడిన అధికారాలతో, 2011వ సంవత్సరపు మధ్యవర్తిత్వ మార్గదర్శకత్వ నిబంధనల ప్రకారం తాజా నియమ, నిబంధనలకు రూపకల్పన చేశారు.

 

ఈ నిబంధనలను ఖరారు చేస్తున్నదశలో,.. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు పరస్పరం విస్తృతమైన చర్చలు జరిపాయి. సామాజిక మాధ్యమ వేదికతోపాటుగా, డిజిటల్ మీడియా,  ఓవర్ ది టాప్ (ఒ.టి.టి.), తదితర వేదికలపై పర్యవేక్షణకు సామరస్యపూర్వక యంత్రాంగాన్ని కలిగి ఉండాలనే అంశంపై ఈ  చర్చలు జరిపారు.

 

 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన రెండవ భాగం (పార్ట్-2) నిబంధనలను ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది.  డిజిటల్ మీడియా నైతిక సూత్రాల నియమావళికి సంబంధించిన 3వ భాగం (పార్ట్-3) నిబంధనలను, డిజిటల్ మీడియాకు సంబంధించిన రక్షణ, భద్రతా ప్రక్రియలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది.

 

నేపథ్యం:

  సాంకేతిక పరిజ్ఞాన శక్తితో సామాన్య భారతీయులను మరింత బలోపేతం చేసిన డిజిటల్ ఇండియా కార్యక్రమం ఇపుడు ఒక భారీ ఉద్యమంగా రూపుదాల్చింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటివి విస్తృత స్థాయిలో విస్తరించడం,.. భారతదేశంలో అనేక రకాల సామాజిక మాధ్యమ వేదికలు విస్తరణకు దోహదపడింది. సామాన్య ప్రజలు కూడా ఈ వేదికలను గణనీయమైన స్థాయిలో వినియోగిస్తున్నారు.  సామాజిక మాధ్యమాల విస్తృతిపై కొన్ని ఇంటర్నెట్ పోర్టల్స్ ఎలాంటి వివాదాలకు తావులేని విశ్లేషణను అందించాయి. సామాజిక మాధ్యమాలకు సంబంధించి దేశంలో క్రియాశీలకంగా ఉన్న వేదికల పరిస్థితి ఈ కింది విధంగా ఉన్నట్టు అవి పేర్కొన్నాయి.:

  • వాట్సాప్ వినియోగించే వారు: 53 కోట్ల మంది
  • యూట్యూబ్ వినియోగించే వారు: 44.8 కోట్ల మంది
  • ఫేస్ బుక్ వినియోగించే వారు: 41 కోట్ల మంది
  • ఇన్.స్టాగ్రామ్ వినియోగదారులు: 21 కోట్ల మంది
  • ట్విట్టర్ వినియోగదార్లు: కోటీ 75లక్షల మంది

 

     దేశంలోని సామాన్య పౌరులు తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు, ప్రశ్నలు సంధించడానికి, సమాచారం తెలుసుకోవడానికి, తమ అభిప్రాయనలను ఇతరులతో పంచుకునేందుకు సామాజిక మాధ్యమ వేదికలు దోహదపడుతున్నాయి. వారు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను విమర్శించేందుకు కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. దేన్నయినా విమర్శించడం, విభేధించడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ఆవశ్యకమైన అంశంగా ప్రభుత్వం గుర్తించింది. ఆ హక్కును గౌరవిస్తోంది. భారతదేశం ప్రపంచంలోనే విశాలమైన ఇంటర్నెట్ సమాజం. దేశంలో సామాజిక మాధ్యమ కంపెనీలు పనిచేయడం, వారు కార్యకలాపాలు, వాణిజ్యం సాగించడం, లాభాలు ఆర్జించడం వంటి అంశాలను కూడా ప్రభుత్వం స్వాగతిస్తోంది. అయితే, భారత రాజ్యాంగానికి, చట్టాలకు, నిబంధనలకు సదరు కంపెనీలు జవాబ్దారీగా వ్యవహరించవలసి ఉంటుంది.

సామాజిక మాధ్యమాలు విపరీత స్థాయిలో పెరగడం ఒకవైపు పౌరులకు సాధికారత కల్పించినప్పటికీ, దాని పర్యవసానాలు ఇటీవలి కాలంలో అనేక ఆందోళనలను రేకెతిస్తున్నాయి. పార్లమెంటు, పార్లమెంటు కమిటీలు, కోర్టు ఉత్తర్వులు, పలు ప్రాంతాల్లో జరిగిన పౌర సమాజం చర్చలతో సహా పలురకాల వేదికల్లో ఈ ఆందోళన తీవ్రస్థాయిలో వ్యక్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన వ్యక్తమైంది. సమస్య చివరకు ఒక అంతర్జాతీయ అంశంగా రూపుదాల్చింది.

  సామాజిక మాధ్యమ వేదికల్లో ఇటీవల చాలా ఆందోళనకరమైన పరిణామాలు తలెత్తాయి. నకిలీ వార్తల వ్యాప్తి పెరగడంతో అనేక సమాచార సంస్థలు వాస్తవాలను బేరీజు వేసుకునేందుకు ప్రత్యేక యంత్రాగాలను ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. మార్ఫింగ్ చేసిన మహిళల ఫొటోలను షేర్ చేయడానికి, నీలి చిత్రాల, అసభ్య చిత్రాలతో మహిళలపై ప్రతీకారం తీర్చుకోవడానికి  సామాజిక మాధ్యమాలను విపరీత స్థాయిలో వాడటం,  మహిళల గౌరవ మర్యాదలకు ముప్పుగా పరిణమించింది. కార్పొరేట్ సంబంధమైన వైరుధ్యాలను, కక్షను తీర్చుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడం వాణిజ్య కార్యకలాపాల తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోంది. అసభ్య పదజాలం, కించపరిచే భాష, అసభ్యతతో కూడిన అంశాలతో ఈ వేదికల ద్వారా మత పరమైన మనోభావాలను అగౌరవపరచడం క్రమంగా పెరుగుతోంది.

  గత కొన్నేళ్లుగా, నేరస్తులు, జాతి విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడం పోలీసులకు, ఇతర చట్ట సంరక్షణ సంస్థలకు కొత్త సవాలుగా మారింది. ఉగ్రవాదులుగా చేర్చుకునేందుకు ప్రేరేపించడం, అసభ్య పదజాలంతో కూడిన సందేశాలను వ్యాప్తి చేయడం, సమాజ సామరస్యతను దెబ్బతీయడం, ఆర్థిక నేరాలు, హింసాకాండను రెచ్చగొట్టడం, శాంతి భద్రతలను దెబ్బతీయడం వంటివి ఈ కోవలోకే వస్తాయి.

   సామాజిక మాధ్యమాలను, ఒ.టి.టి. వేదికలను సాధారణంగా వినియోగించేవారు ఇలాంటి అంశాలపై ఫిర్యాదు చేసి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించుకునేందుకు ప్రస్తుతం తగిన యంత్రాగం అందుబాటులో లేదని పరిశీలనలో తేలింది. పారదర్శకత లోపించడం, ఫిర్యాదుల పరిష్కారానికి బలమైన వేదిక లోపించడం కారణంగా, వినియోగదారులు మీడియా వేదికల ఇష్టా ఇష్టాలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది.

సామాజిక మాధ్యమ పరిణామ క్రమం, నిబంధనలు:

  • సామాజిక మీడియా సంస్థలు తరచుగా ప్రచురణ కర్తలుగా కూడా తయారవుతున్నారు. ఆయా సంస్థలకు స్వీయ నియంత్రణ ప్రాతిపదికగా నిబంధనలను రూపొందించారు. దేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రాతిపదికగానే రూపొందిన ఈ నియమాలు ఆన్ లైన్.లో ప్రచురితమయ్యే అంశాలకే కాక, ఇతరత్రా ప్రచురితమయ్యే అంశాలకు కూడా వర్తిస్తాయి. వార్తలు, వర్తమాన వ్యవహారాలకు సంబంధించి ప్రచురణ కర్తలే ప్రెస్ కౌన్సిల్ పాత్రికేయ నియమావళిని అనుసరించవలసి ఉంటుంది. అలాగే, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ చట్టం నియమావళిని కూడా పాటించవలసి ఉంటుంది.

 

 

కొత్త మార్గదర్శక సూత్రాల హేతుబద్ధత:

డిజిటల్ మీడియా వేదికల సాధారణ వినియోగదారులు తమ హక్కులకు భంగం కలిగిందని భావించినపుడు  వారు తమ ఫిర్యాదుల పరిష్కారానికి తగిన యంత్రాంగాన్ని కొత్త నిబంధనలు, మార్గదర్శక సూత్రాలు కల్పిస్తాయి. వివిధ సందర్భాల్లో, పలు కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు, పార్లమెంటులో జరిగిన చర్చలకు, పార్లమెంటు కమిటీల తీర్మానాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం తగిన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది.

 

సంప్రదింపులు:

  • వివిధ వర్గాల ప్రజలు, పౌర సమాజ సంస్థలు, వ్యక్తులు, పారిశ్రామిక సంస్థల సంఘాలనుంచి అందిన సూచనలు, సలహాలను విశ్లేషించిన అనంతరం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శక సూత్రాలను, నిబంధనలను రూపొందించింది. వివిధ వర్గాలనుంచి అందిన సూచనలను, అభిప్రాయాలను వివిధ మంత్రిత్వ శాఖల చర్చల్లో విశ్లేషించుకున్న అనంతరం ఈ కొత్త నిబంధనలను ఖరారు చేశారు.

 

ముఖ్యాంశాలు

సామాజిక మాధ్యమాలకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలు పరచవలసిన మార్దదర్శక సూత్రాలు:

  • మధ్యవర్తిత్వ సంస్థలు పాటించవలసిన జాగరూకత: సామాజిక మాధ్యమ సంస్థలు, సంబంధింత మధ్యవర్తిత్వ సంస్థలు తగిన జాగరూకతను నిబంధనలను నిర్దేశిస్తాయి. ఈ జాగ్రత్తలను సదరు సంస్థలు పాటించని పక్షంలో వారికి భద్రతా నిబంధనలను వర్తింపజేయరు.
  • ఫిర్యాదుల పరిష్కార యంత్రాగం: సామాజిక మాధ్యమ సంస్థలు, మధ్యవర్తిత్వ సంస్థలు ఫిర్యాదుల పరిష్కార యంత్రాగం ఏర్పాటు చేయడాన్ని నిర్బంధం చేస్తూ నూతన నిబంధనలను రూపొందించారు. తద్వారా వినియోగదారులకు, బాధితులకు  తగిన సాధికారత కలుగుతుంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక అధికారిని మధ్యవర్తిత్వ సంస్థలు నియమిస్తాయి. సదరు అధికారి పేరును, ఇతర వివరాలను ఆ సంస్థలు వెల్లడి చేస్తాయి. సదరు అధికారి కూడా 24గంటల్లోగా ఫిర్యాదును గుర్తించడంతోపాటుగా, అందిన 15రోజుల్లోగా ఫిర్యాదు పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
  • ఆన్ లైన్ భద్రతకు హామీ. ప్రత్యేకించి మహిళా నినియోగదారుల గౌరవ మర్యాదల రక్షణకు చర్యలు: ఏదైనా సామాజిక మాధ్యమ సంస్థ ఎలాంటి అసభ్యతకు పాల్పడినా సదరు సంస్థ ఇంటర్నెట్ అనుసంధానాన్ని మధ్యవర్తిత్వ సంస్థ 24 గంటల్లోగా తొలగిస్తుంది. ఆన్ లైన్లో వ్యక్తుల మర్మ అవయవాలను ప్రదర్శించడం, పూర్తిగా లేదా పాక్షికంగా నగ్నత్వాన్ని ప్రదర్శించడం, మార్ఫింగ్ ఫొటోలను ప్రదర్శించడం వంటివాటికి పాల్పడినపుడు మధ్యవర్తిత్వ సంస్థ ఈ చర్య తీసుకుంటుంది ఇందుకు సంపబంధించి ఎవరైనా వ్యక్తిగానీ, అతను లేదా ఆమె తరఫున మరొకరు గానీ ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పంచారు.
  • రెండు రకాల సామాజిక మాద్యమ మధ్యవర్తిత్వ సంస్థలు: సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలను రెండు రకాలుగా కొత్త నిబంధనలను వర్గీకరించాయి. సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలు, ప్రముఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలుగా వాటిని వర్గీకరించారు. సామాజిక మాధ్యమ వేదికపై వాటిని వినియోగించే వారి సంఖ్య ప్రాతిపదికగా ఈ విధంగా వర్గీకరించారు. రెండు రకాల సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలకు ఉన్న వినియోగదారుల బలాన్ని గుర్తించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. తద్వారా ప్రముఖ సామాజిక మాద్యమ మధ్యవర్తిత్వ సంస్థలు అదనంగా పాటించవలసిన జాగరూకతలను కూడా కొత్త నిబంధనలు సూచించాయి.
  • ప్రముఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థ పాటించవలసిన అదనపు జాగ్రత్తలు:
    • చట్టంలోని నిబంధనలను సక్రమంగా అనుసరించేలా చూసేందుకు చీఫ్ కంప్లయిన్స్ ఆఫీసర్ ను నియమించడం. సదరు వ్యక్తి భారతదేశం నివాసి అయి ఉండాలి.
    • పోలీసు యంత్రాంగం వంటి చట్టాల అమలు యంత్రాంగాలతో నిర్విరామంగా సమన్వయం నెరిపేందుకు నోడల్ కాంటాక్ట్ పర్సన్ ను నియమించడం. సదరు వ్యక్తి భారతదేశ నివాసి అయి ఉండాలి.
    • ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం పరిధిలో విధి నిర్వహణకోసం రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించడం. సదరు వ్యక్తి భారతదేశ నివాసి అయి ఉండాలి.
    • అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలను, ప్రముఖ సామాజక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థ తొలగించిన అంశాలపై నెలవారీగా ఒక నివేదికను ప్రచురించాలి.
    • దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు, విదేశాలతో మైత్రీ సంబంధాలకు, శాంతి భద్రతలకు భంగం కలిగించారన్న నేరానికి సంబంధించి అంశాలను నివారించేందుకు, గుర్తించేందుకు, దానిపై దర్యాప్తు చేసేందుకు, శిక్ష విధించేందుకు వీలుగా, తొట్టతొలుత సదరు సమాచారం ఎక్కడ ఆవిర్భవించిందన్న విషయాన్ని పసిగట్టేందుకు ప్రమఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థలు తగిన సేవలందిస్తాయి.  మానభంగం, అసభ్య అంశాల ప్రచురణ, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు వంటి అంశాల విషయంలో కూడా మధ్యవర్తిత్వ సంస్థలు సేవలందిస్తాయి. ఈ నేరాలకు ఐదేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష ఉంటుంది. ఇందుకు సంబంధించిన తన సందేశాల్లోని అంశాలనుగానీ, సమాచారం తొలుత ఎక్కడ ఆవిర్భించిందన్న అంశాన్ని గానీ మద్యవర్తిత్వ సంస్థలు ఎక్కడా వెల్లడి చేయాల్సిన అవసరం లేదు,
    • యూజర్ వెరిపికేషన్ కు స్వచ్ఛంద యంత్రాగం: వినియోగదారులు తమ సామాజిక మీడియా ఖాతాలను స్వచ్ఛందంగా సరిచూసుకునేందుకు తగిన యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచేందుకు కొత్త నిబంధనలు దోహదపడతాయి.
  • చట్టవ్యతిరేక సమాచారం తొలగింపు: భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతి భద్రతలకు, విదేశాలతో మైత్రీ సంబంధాలకు ముప్పు కలిగించే సమాచారం, ప్రచురణార్హంగాని చట్ట వ్యతిరేకమైన సమాచారం తొలగించడానికి ప్రముఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థకు అధికారం ఉంటుంది.
  • కొత్తగా రూపొందించిన నిబంధనలు,.. గెజిట్ ప్రచురణ తేదీనాటినుంచి వెంటనే అమలులోకి వస్తాయి. అదనపు జాగ్రత్తలు పాటించవలసిన ప్రముఖ సామాజిక మాధ్యమ మధ్యవర్తిత్వ సంస్థల విషయంలో మాత్రం ఈ నిబంధనలు ప్రచురణ తేదీనుంచి 3నెలల తర్వాత అమలులోకి వస్తాయి.

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అమలు జరపవలసిన డిజిటల్ మీడియా, ఒ.టి.టి. వేదికల నైతిక సూత్రాల నియమావళి.:

  డిజిటల్ మీడియా, ఒ.టి.టి. వేదికల ద్వారా ప్రచురితమయ్యే అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఆందోళన నెలకొంది. ఇందుకు సంబంధించి నియంత్రణకోసం తగిన సంస్థాగత యంత్రాగం ఉండి తీరాలని  పౌర సమాజం, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నాయకులు, వాణిజ్య సంస్థలు, సంఘాలు అభిప్రాయపడుతూ వచ్చాయి. తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టుతోపాటుగా  వివిధ హైకోర్టులు కూడా ప్రభుత్వానికి సూచించాయి.

  ఈ అంశం మొత్తం డిజిటల్ వేదికలకు సంబంధించినది కాబట్టి, డిజిటల్ మీడియా, ఒ.టి.టి.కి సంబందించిన అంశాలపై నిబంధనల అమలును సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పర్యవేక్షించాలని ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే, పూర్తి యంత్రాగం మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల మేరకు పనిచేయాలని నిర్ణయించారు.

సంప్రదింపులు:

ఇందుకు సంబంధించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గత ఏడాదిన్నరగా ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో సంప్రదింపులు జరిపింది. తాము ప్రసారం చేసే అంశాల విషయంలో “స్వయం నియంత్రణ యంత్రాంగాన్ని” అమలుచేయాలని ఒ.టి.టి. వేదికల నిర్వాహక సంస్థలకు ఈ సంప్రదింపుల సందర్భంగా సూచించారు. ఇందుకు సంబందించి సింగపూర్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్ డమ్.లలో అమలు చేస్తున్న వ్యవస్థల నమూనాలను ప్రభుత్వం అధ్యయనం చేసింది. అధ్యయనంలో అందిన సమాచారం ఆధారంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 87వ సెక్షన్ కింద ఈ నూతన నిబంధలకు రూపకల్పన చేశారు. అందుకు అనుగుణంగా 3వ భాగం నిబంధలను అమలు చేసేందుకు వీలుగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు అధికారాలు దఖలుపడ్డాయి. 3వ భాగం నిబంధనలు ఈ కింది విధంగా ఉన్నాయి.:

  • ఆన్ లైన్ లో ప్రసారమయ్యే వార్తలకు, ఒ.టి.టి., డిజిటల్ మీడియా వేదికలకు నైతిక సూత్రాల నియమావళి: ఒ.టి.టి. వేదికలు, డిజిటల్ మీడియా పాటించవలసిన నియంత్రణలను, ఆన్.లైన్ లో ప్రసారమయ్యే వార్తలకు అనుసరించవలసిన నైతిక సూత్రాలను ఈ నియమావళి నిర్దేశిస్తుంది.
  • అంశాలపై స్వీయ వర్గీకరణ: ఆన్ లైన్ ద్వారా ప్రసారం చేసే ఒ.టి.టి. వేదికలు తాము ప్రసారం చేసే అంశాలను వీక్షకుల వయస్సు ప్రాతిపదికగా ఐదు కేటగిరీలుగా వర్గీకరించుకోవాల్సి ఉంటుంది.  యు (యూనివర్సల్), యు/ఎ 7 ప్లస్, యు/ఎ 13 ప్లస్, యు/ఎ 16 ప్లస్, ఎ (పెద్దలకు మాత్రమే) అంటూ... సొంతంగా 5 రకాలుగా వర్గీకరించుకోవలసి ఉంటుంది. యు/ఎ 13 ప్లస్ కేటగిరీ, అంతకు మించిన వయస్సుల కేటగిరీ అంశాల విషయంలో పేరంటల్ లాక్ పద్ధతిని పాటించవలసి ఉంటుంది. ఏ కేటగిరీ అంశాలకు కూడా తగిన నియంత్రణలు పాటించవలసి ఉంటుంది. ఈ వర్గీకరణను ఒ.టి.టి. ప్రచురణ కర్తలు ముందస్తుగా ప్రస్ఫుటంగా ప్రదర్శించవలసి ఉంటుంది.
  • డిజిటల్ మీడియా వేదికపై వార్తలను ప్రచురించే వారు, ప్రసారం చేసేవారు,.. ప్రెస్ కౌన్సిల్ ఇండియా నిర్దేశిత పాత్రికేయ నియమావళిని, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ చట్టం పరిధిలో కార్యక్రమ నియమావళిని పాటించవలసి ఉంటుంది.
  •  విభిన్నమైన స్థాయిల్లో స్వయం నియంత్రణతో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త మార్గదర్శక సూత్రాల ప్రకారం మూడు స్థాయిల యంత్రాగాన్ని ఏర్పాటు చేశారు.
    • స్థాయి-I: ప్రచురణ కర్తల స్వయం నియంత్రణ;
    • స్థాయి-II: ప్రచురణ కర్తలకు చెందిన స్వయం నియంత్రణ సంస్థల ద్వారా స్వీయ నియంత్రణ;
    • స్థాయి-III: పొరపాటును సరిదిద్దుకునే వ్యవస్థ.

 

****



(Release ID: 1700981) Visitor Counter : 610