శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భౌగోళిక సమాచారంపై సరళీకృత మార్గదర్శకాలు ప్రకటించిన ప్రభుత్వం


ఈ చారిత్రక నిర్ణయం రూ.లక్షకోట్ల భౌగోళిక సమాచార ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తుంది: డాక్టర్‌ హర్షవర్ధన్‌

నేటి ప్రకటనతో భౌగోళిక మ్యాపింగ్‌పై ఆంక్షలు తొలగి దేశ వికాసం, స్వయం సమృద్ధ భారత సృష్టి దిశగా వినియోగం విస్తృతమవుతుంది: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

ఈ మార్గదర్శకాలు భద్రతకు భంగం లేకుండా భారత పారిశ్రామిక, సర్వే ఏజెన్సీలకు సాధికారత, ఉత్తేజం కల్పిస్తాయి: అశుతోష్‌ శర్మ

Posted On: 15 FEB 2021 6:28PM by PIB Hyderabad

భౌగోళిక సమాచార వినియోగంపై ప్రభుత్వం సరళీకృత మార్గదర్శకాలను ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన; ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ న్యూఢిల్లీలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ మార్గదర్శకాల సవరణపై ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం దేశంలో రూ.లక్ష కోట్ల విలువైన భౌగోళిక సమాచార ఆర్థిక వ్యవస్థకు బాటలు పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో శాస్త్ర విజ్ఞానం ప్రజా ఉద్యమంగా మారటమేగాక దేశ పౌరుల కోసం నవ భారతాన్ని నిర్మిస్తుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు/పెన్షన్లు, అణుశక్తి/అంతరిక్ష మంత్రిత్వ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, డీఎస్‌టీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, సంయుక్త కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.

   “విష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానాలు అత్యంత స్పష్టతగల మ్యాప్‌లను ఉపయోగిస్తాయి. అత్యంత కచ్చితమైన, సమగ్ర, సూక్ష్మస్థాయి భౌగోళిక సమాచారం నిరంతర నవీకరణతో అందుబాటులోకి రావడంద్వారా ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాలకు గణనీయ ప్రయోజనం కలుగుతుంది. అలాగే దేశంలో వినూత్న ఆవిష్కరణలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అంతేకాకుండా అత్యవసర ప్రతిస్పందనలో దేశ సంసిద్ధతను బాగా మెరుగవుతుంది. స్వయం సమృద్ధ భారతం, ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్వప్నాలు సాకారం కావడంలో భారత కంపెనీలకు సమాచారం, ఆధునిక మ్యాపింగ్‌ సాంకేతికతల అందుబాటు కూడా ఎంతో ముఖ్యం”” అని డాక్టర్ హర్షవర్ధన్‌ ఈ సందర్భంగా విశదీకరించారు.

   “భౌగోళిక సమాచార సేవల బహిరంగ లభ్యతతో ఇప్పటిదాకా పరిమిత పరిధిలో మాత్రమే వినియోగ అనుమతిగల సమాచారం ఇకపై ఉచితంగా, అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు అటువంటి సమాచార వినియోగాన్ని నియంత్రించే కొన్ని అనవసర, వాడుకలో లేని  విధానాలు/మార్గదర్శకాలు ఇప్పుడు అనవసరం” అని మంత్రి వివరించారు. “నేడు ప్రపంచంలో అనుక్షణం లభ్యమయ్యే దేన్నయినా నియంత్రించాల్సిన అవసరమే లేదు. కాబట్టి భారతీయ సంస్థలు మ్యాప్‌లుసహా భౌగోళిక సమాచార సేవలను పొందడానికి, రూపొందించడానికి ముందస్తు ఆమోదాలు, భద్రత అనుమతులు, లైసెన్సులు తదితర నియంత్రణ బంధనాలు పూర్తిగా తొలగించబడ్డాయి” అని ఆయన ప్రకటించారు.

   “దేశ భద్రత/చట్టాల అమలు సంస్థలు సేకరించే వర్గీకృత భౌగోళిక సమాచారం మినహా ప్రభుత్వ నిధులతో రూపొందించే సమాచారం మొత్తం దేశ శాస్త్రీయ, ఆర్థిక, ప్రగతి సంబంధిత ప్రయోజనాలతోపాటు భారతీయ సంస్థల స్వీయ వినియోగానికి ఎలాంటి ఆంక్షలూ లేకుండా  అందుబాటులో ఉంటుంది. తదనుగుణంగా ప్రభుత్వ, ఇతర సంస్థలు సార్వత్రిక అనుసంధాన భౌగోళిక సమాచారం దిశగా సంయుక్తంగా కృషి చేయాల్సి ఉంటుంది” అని డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు. “దీనివల్ల లబ్ధిపొందే భాగస్వాములలో పారిశ్రామిక, విద్యా, ప్రభుత్వ విభాగాలుసహా సమాజంలోని దాదాపు అన్ని విభాగాలూ ఉంటాయి” అని ఆయన నొక్కిచెప్పారు. మొత్తంమీద ఇదొక పరివర్తనాత్మక సంస్కరణ అని మంత్రి పేర్కొన్నారు.

   సందర్భంగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు/పెన్షన్లు, అణుశక్తి/అంతరిక్ష మంత్రిత్వ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా మాట్లాడారు. భౌగోళిక మ్యాప్‌ల రూపకల్పనపై నియంత్రణను పూర్తిగా తొలగిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ రంగానికి బంధవిముక్తి కల్పించిందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయాన్ని అంతరిక్ష రంగంలో చేపట్టిన పలు దార్శనిక సంస్కరణలకు కొనసాగింపుగా ఆయన అభివర్ణించారు. నేటి ప్రకటనతో భౌగోళిక మ్యాపింగ్‌పై ఆంక్షలు తొలగి దేశ వికాసం, స్వయం సమృద్ధ భారత సృష్టి దిశగా వినియోగం విస్తృతమవుతుందని ఆయన వివరించారు.

   భారతదేశాన్ని వెనక్కులాగే వలస పాలన వారసత్వ విధానాల్లో కొన్నిటిని రూపుమాపే క్రమంలో ఇది మరొక విశిష్ట ఉదాహరణగా డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. భౌగోళిక మ్యాప్‌ల వినియోగం, రూపకల్పన ప్రస్తుతం దేశ భద్రతకు మాత్రమే ఉపకరణంగా ఉందని ఆయన అన్నారు. అయితే, ఇకపై ప్రగతి సాధనకూ ఇది ఉపకరించనున్న దృష్ట్యా మ్యాప్‌ల రూపకల్పనపై నియంత్రణ రద్దు చరిత్రాత్మకమేనని చెప్పారు. స్వయం సమృద్ధ భారత నిర్మాణం దిశగా అందుబాటులోకి వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ముందడుగు వేయాలని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వ్యాపార సమాజానికి పిలుపునిచ్చారు. పారిశ్రామిక, విద్యా, ప్రభుత్వ రంగాల సంయుక్త కృషి భౌగోళిక విజ్ఞానంలో మన దేశాన్ని ప్రపంచ అగ్రగాములలో ఒకటిగా నిలుపుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని అన్నివర్గాలూ అందిపుచ్చుకుని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారతజాతి ఆకాంక్షను నెరవేర్చాలని మంత్రి పిలుపునిచ్చారు.

   భౌగోళిక సమాచారంపై మార్గదర్శకాలను శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ ఈ సందర్భంగా ప్రదర్శనపూర్వకంగా వివరించారు. “ఈ కొత్త మార్గదర్శకాలు దేశ భద్రతకు భంగం లేకుండా భారత పారిశ్రామిక, సర్వే ఏజెన్సీలకు సాధికారత, ఉత్తేజం కల్పిస్తాయి. భౌగోళిక సమాచార ఉత్పత్తులు, పరిష్కారాల్లో స్వయం సమృద్ధం కావడంవల్ల 2030 నాటికి ఇది రూ.లక్ష కోట్ల వ్యాపార రంగంగా రూపొందడమేగాక అభివృద్ధి రూపంలో ఆర్థిక ప్రభావం చూపుతుంది” అన్నారు. స్వయం సమృద్ధ భారత స్వప్న సాకారంతోపాటు 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధన దిశగా భౌగోళిక సమాచారం, మ్యాప్‌లకు వర్తించే నియంత్రణలు తొలగించబడి మార్గదర్శకాలు విప్లవాత్మక రీతిలో సరళం చేయబడ్డాయి. ఆ మేరకు భారతదేశ మ్యాపింగ్ విధానంలో- ప్రత్యేకించి భారతీయ కంపెనీల కోసం శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ విస్తృత మార్పులు చేసింది. ప్రపంచంలో అనుక్షణం లభ్యమయ్యే దేన్నయినా భారతదేశంలో  నియంత్రించాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇప్పటిదాకా భౌగోళిక సమాచార వినియోగంపై ఆంక్షలు తొలగిపోయి ఇకమీదట దేశంలో అది ఉచితంగా లభ్యమవుతుంది. ఆ మేరకు మన కార్పొరేట్‌ సంస్థలు, ఆవిష్కర్తలపై ఎటువంటి ఆంక్షలూ ఉండవు. అంతేగాకుండా భారత ప్రాదేశిక హద్దులకు లోబడి భౌగోళిక సమాచారం, మ్యాప్‌ల ఉన్నతీకరణసహా సేకరణ, సృష్టి, తయారీ, పంపిణీ, నిల్వ, ప్రచురణలకు ఎలాంటి ముందస్తు ఆమోదాలు, అనుమతులు ఇకపై అక్కర్లేదు.

 

మార్గదర్శకాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

****


(Release ID: 1698329) Visitor Counter : 280


Read this release in: English , Urdu , Hindi