ఆర్థిక మంత్రిత్వ శాఖ

178 కోట్ల రూపాయల మేర "ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్" మోసానికి సంబంధించి, మూడు వేర్వేరు కేసుల్లో, నలుగురిని అదుపులోకి తీసుకున్న - సి.జి.ఎస్.టి. ఢిల్లీ అధికారులు


Posted On: 15 FEB 2021 7:12PM by PIB Hyderabad

నకిలీ బిల్లింగ్ కార్యకలాపాల మోసాన్ని ఎదుర్కోడానికి, కేంద్ర వస్తువులు, సేవల పన్ను కమీషనర్ కార్యాలయం (సి.జి.ఎస్.టి), ఢిల్లీ నార్త్ విభాగం అధికారులు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. అనేక మంది లబ్ధిదారులకు వస్తువుల విక్రయం లేకుండానే బిల్లులతో పాటు, నకిలీ "ఇన్-పుట్-ట్యాక్స్-క్రెడిట్" ప్రయోజనాన్ని బదిలీ చేస్తున్న కల్పిత సంస్థల ముఠాను, విస్తృత సమాచార విశ్లేషణల సహకారంతో, అభివృద్ధి చెందిన నిఘా వ్యవస్థ ఆధారంగా, వారు, వెలికితీశారు. సి.జి.ఎస్.టి చట్టం, 2017 లోని సెక్షన్ 132 (1) కింద నేరాలకు పాల్పడినందుకు గాను సి.జి.ఎస్.టి. చట్టం, 2017 లోని సెక్షన్ 69(1) ప్రకారం మొత్తం నలుగురు వ్యక్తులను మూడు వేర్వేరు కేసుల్లో, అధికారులు, అరెస్టు చేశారు. ఈ మూడు కేసుల్లో, మొత్తం 178 కోట్ల రూపాయల మేర "ఇన్-పుట్-ట్యాక్స్-క్రెడిట్" దుర్వినియోగమయ్యింది. అన్ని విషయాల్లో నూ తదుపరి పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ కేసుల్లో, నకిలీ క్రెడిట్ మొత్తం మరియు వీటితో ప్రమేయం ఉన్న కంపెనీలు, వ్యక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మొదటి కేసులో, ప్రధాన దోషులు, ఉనికిలో లేని నాలుగు సంస్థలను సృష్టించి, 54 కోట్ల రూపాయల మేర, ఐ.టి.సి. ని, 14 ఇతర సంస్థలకు బదిలీ చేశారు. ఈ సంస్థలు కమిషన్ ప్రాతిపదికన వస్తువుల విక్రయం లేకుండానే బిల్లులను జారీ చేయడంతో పాటు, వస్తువుల ఎగుమతిపై ఐ.జి.ఎస్.టి. రీఫండ్ ప్రయోజనం పొందడానికి కూడా ఈ బిల్లులను ఉపయోగించాయి. ఈ అన్ని సంస్థల వెనుక ఉన్న ప్రధాన ఆపరేటర్లు శ్రీ వికాస్ గోయల్, శ్రీ గోపాల్ అగర్వాల్ ఈ ముఠాను నడుపుతున్నట్లు అంగీకరించారు, వారిని 2021 ఫిబ్రవరి 12వ తేదీన అదుపులోకి తీసుకున్నారు.

రెండో కేసులో, శ్రీ మోహిందర్ కుమార్ అనే వ్యక్తి, తన సంస్థలైన వి.ఎం.డబ్ల్యూ. ఎంటర్ ప్రైజెస్ మరియు శ్రీ బహదూర్ స్టీల్ కంపెనీ ల తరఫున, అనేక నకిలీ సంస్థల నుండి, 111 కోట్ల రూపాయల మేర మోసపూరితమైన జి.ఎస్.టి. "ఇన్-పుట్-టాక్స్-క్రెడిట్" ప్రయోజనాన్ని పొందడంతో పాటు, ఈ క్రెడిట్ ను అనేక ఇతర సంస్థలకు ఎటువంటి వస్తువులు సరఫరా చేయకుండానే పంపిణీ చేసినట్లు, విచారణలో వెల్లడైంది. శ్రీ మోహిందర్ కుమార్ ను 2021 ఫిబ్రవరి, 13వ తేదీన అదుపులోకి తీసుకున్నారు.

ఇదే విధమైన మరో కేసులో, వి.డి.ఆర్. కలర్స్ అండ్ కెమికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ మరియు ఏ.వి. మెటల్స్ మార్కెటింగ్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్ మరియు సురేందర్ కుమార్ జైన్ అనే సంస్థకు యజమాని అయిన శ్రీ సురేందర్ కుమార్ జైన్ అనే వ్యక్తి, ఉనికిలో లేని సంస్థలు జారీచేసిన, వస్తువుల విక్రయం లేని బిల్లుల్ల ద్వారా 13 కోట్ల రూపాయల విలువైన ఐ.టి.సి. ని ఉపయోగించుకోవడంలో నిమగ్నమయ్యాడు. శ్రీ సురేందర్ కుమార్ జైన్ ను కూడా 2021 ఫిబ్రవరి, 13వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.

ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనాల్సిన విషయం ఏమిటంటే, జి.ఎస్.టి. అమలు ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటివరకు, 3,969.65 కోట్ల రూపాయలకు పైగా జి.ఎస్.టి. ఎగవేతకు సంబంధించిన వివిధ కేసుల్లో 25 మందిని, సెంట్రల్ టాక్స్, ఢిల్లీ జోన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

*****

 



(Release ID: 1698301) Visitor Counter : 179


Read this release in: English , Urdu , Hindi , Punjabi