ఆయుష్
2021 యునానీ దినోత్సవం సందర్భంగా యునానీ వైద్యంపై జాతీయ సమ్మేళనం
Posted On:
11 FEB 2021 7:31PM by PIB Hyderabad
యునానీ వైద్యంపై జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అధీనంలోని కేంద్రీయ యునానీ ఔషధ పరిశోధనా మండలి (సి.సి.ఆర్.యు.ఎం.) నిర్వహించింది. 2021వ సంవత్సరపు యునానీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైబ్రిడ్ వర్చువల్ పద్ధతిలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు.
‘యునానీ వైద్యం: కోవిడ్-19 నేపథ్యంలో అవకాశాలు, సవాళ్లు’ అన్న అంశంపై నిర్వహించిన సమ్మేళనాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, ఆయుష్ శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల సహాయమంత్రి కిరెణ్ రిజిజు ప్రారంభించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్యా రాజేశ్ కొటేచా, అదనపు కార్యదర్శి ప్రమోద్ కుమార్ పాఠక్, సి.సి.ఆర్.యు.ఎం. డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అసిమ్ అలీ ఖాన్, ఆయుష్ మంత్రిత్వ శాఖలో యునానీ వైద్య విభాగం సలహాదారు డాక్టర్ ఎం.ఎ. ఖాస్మీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమ్మేళనాన్ని ప్రారంభించిన సందర్భంగా కిరెణ్ రిజిజు మాట్లాడుతూ, ఎన్నో నాగరకతల పరిజ్ఞానంతో యునానీ వైద్యం సుంపన్నమైందని, ప్రజల శారీరక, మానసిక, సామాజిక సంక్షేమ సాధనలో ఇది ఎంతో సమర్థవంతమైన వైద్యవిధానమని అన్నారు. ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, సోవా రిగా, హోమియోపతి వైద్య విధానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోఏర్పాటైన ఆయుష్ మంత్రిత్వ శాఖ, వైద్య పరిశోధనతో ప్రజలకు ఆరోగ్య సేవలందించడంలో ప్రశంసనీయమైన కృషి చేసిందన్నారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ మంత్రిత్వ శాఖ అందించిన సేవలు మరింత ప్రత్యేకమైనవని అన్నారు.
కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్య వర్గాలు చేసిన సేవలను ప్రశంసిస్తూ కేంద్రమంత్రి శ్రీపాద యస్సో నాయక్ ఒక వీడియో సందేశం పంపించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్యా రాజేశ్ కొటేచా ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్-19పై జరిపిన పోరాటంలో యునానీ ఔషధాలు,సి.సి.ఆర్.యు.ఎం. ప్రముఖ పాత్ర పోషించాయని అన్నారు. అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణకు సంబంధించిన 11వ సవరణ (ఐ.సి.యు.-11)లో ఆయుష్ పరిభాషను ప్రమాణబద్ధం చేయడానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాన్ని గురించి కొటేచా ఈ సమ్మేళనంలో ప్రధానంగా ప్రస్తావించారు. నామ్.స్తే పోర్టల్ (NAMSTE Portal), ఎ-హిమిస్ (A-HMIS) వంటి ఐ.టి. సంబంధమైన చర్యలు తీసుకోవడంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని అన్నారు. ఇందుకు సంబంధించి సి.సి.ఆర్.యు.ఎం. అందించిన సేవలు కూడా అభినందనీయమన్నారు.
సి.సి.ఆర్.యు.ఎం. డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అసిమ్ అలీ ఖాన్ స్వాగతోపన్యాసం చేస్తూ,. యునానీ సమ్మేళనం నేపథ్యాన్ని గురించి వివరించారు. కోవిడ్-19పై పోరాటంలో సి.సి.ఆర్.యు.ఎం. క్రియాశీలక పాత్ర పోషించిందని, రెండు వ్యాధి నిరోధక చికిత్సా పద్ధతులను, రెండు వైద్య అధ్యయనాలను ప్రారంభించడంతోపాటుగా అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. యునానీ వైద్య విభాగం సలహాదారు డాక్టర్ ఎం.ఎ. ఖాస్మీ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై జరిగిన చర్చల్లో ప్రముఖ వైద్య శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ‘సంప్రదాయ, ఆధునిక ఆరోగ్య వ్యవస్థల సమ్మిశ్రితం’, ‘సంప్రదాయ వైద్యం. కోవిడ్-19 పై పోరాటంలో సంప్రదాయ వైద్యం పాత్ర’, ‘కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో యునానీ ఔషధాల వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యం’, ‘కోవిడ్-19 వైరస్ పై పోరాటంలో భాగస్వామ్య వర్గాలకు ప్రమేయం కల్పించడం’, ‘కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొత్త ఔషధం రూపకల్పనకు ప్రణాళిక’, ‘ఔషధ మొక్కలు–ఆయుష్ వైద్యవిధాన రంగంలో ప్రస్తుత పరిస్థితి’, ‘కోవిడ్-19 కారణంగా విద్యా సంస్థల్లో ఒత్తిడి: టిబ్-ఇ-యునానీలో పరిష్కారాలు’, కోవిడ్-19 నేపథ్యంలో యునానీ, ఇతర ఆయుష్ వైద్య విధానాల పాత్ర’ తదితర అంశాలపై ప్రముఖ వైద్య శాస్త్రవేత్తలు కీలక ప్రసంగాలు చేశారు. యునానీ ఔషధాలు-కోవిడ్-19 నేపథ్యంలో అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై నిపుణుల కమిటీ చర్యలు కూడా జరిపింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా యునానీ వైద్యం ఎదుర్కొనే సవాళ్లు, యునానీ వైద్య విధానానికి ఉన్న అవకాశాలపై ప్రధాన చర్చ కూడా జరిగింది.
ముగింపు కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రమోద్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ, కోవిడ్-19 నేపథ్యంలో జరిగిన పరిశోధనా కార్యకలాపాలను, సి.సి.ఆర్.యు.ఎం. అందించిన సేవలను ప్రశంసించారు. యునానీ సమ్మేళనంలో జరిగిన చర్చను అభినందిస్తూ, ఇందుకు సంబంధించిన కార్యాచరణను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ ఎం. జగదీశ్ కుమార్ మాట్లాడుతూ, ఆయుష్ వైద్య విధానం రూపకల్పనలో సృజనాత్మకతను తీసుకువచ్చేందుకు వివిధ పరిశోధనాంశాల అనుసంధానంతో అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
జోధ్పూర్ కు చెందిన మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అఖ్తర్ ఉల్ వసీ మాట్లాడుతూ, కోవిడ్-19పై పోరాటంలో ఆయుష్ వైద్య విధానం పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఆయుష్ వైద్య విధానం ప్రజలకు మరింత ఆమోదయోగ్యంగా మారిందన్నారు.
న్యూఢిల్లీకి చెందిన జామియా హందర్ద్ సంస్థ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ ఎం.ఎ. జాఫ్రీ మాట్లాడుతూ, కోవిడ్ వంటి ఆరోగ్య సమస్యల నివారణకు యునానీ శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు నిర్వహించాలన్నారు.
సమ్మేళనంలో వివిధ శాస్త్రవేత్తలు జరిపిన చర్చల ప్రధానాంశాలను ప్రొఫెసర్ అసిమ్ అలీఖాన్ క్లుప్తంగా వివరించారు. సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రముఖులకు, సి.సి.ఆర్.యు.ఎం. అధికారులకు, ఇతర భాగస్వాములకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమ్మేళనంపై ప్రచురించినప్రత్యేక సంచికను, ‘యునానీ వైద్యంలో సాధారణ నివారణ మార్గాలపై హ్యాండ్ బుక్’ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ‘యునానీ వైద్యం ప్రాథమిక సూత్రాలపై పరిశోధన– సి.సి.ఆర్.యు.ఎం. నిర్వహించిన అధ్యయనాల సంకలనాన్ని ప్రారంభ కార్యక్రంలో ఆవిష్కరించారు. ‘యునానీపై వైద్య అధ్యయనం– మా జున్ నిశ్యాఁ ఇన్ నిశ్యాఁ(ఆమ్నీనిసియా)’, ‘సి.సి.ఆర్.యు.ఎం. సంస్థ పేటెంట్ హక్కుల సంకలనం’, ‘జీవితకాలం వృద్ధికి ఔషధ మొక్కలు’ పేరిట సి.సి.ఆర్.యు.ఎం. ప్రచురించిన పుస్తకాలను ముగింపు కార్యక్రమంలో ఆవిష్కరించారు.
************
(Release ID: 1697369)
Visitor Counter : 235