అంతరిక్ష విభాగం
నేటివరకు 33 భిన్నదేశాలకు చెందిన 328 ఉపగ్రహాలను భారత్ ప్రయోగించిందిః డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేటు భాగస్వామ్యం అత్యాధునిక సాంకేతికత, నూతన అప్లికేషన్లు, సేవల అభివృద్ధికి దారి తీస్తుందిః డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
10 FEB 2021 4:18PM by PIB Hyderabad
ఉపగ్రహాల ప్రయోగ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇస్రోకు రూ. 900 కోట్లను కేటాయించినట్టు ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ ఇఆర్) (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. లోక్‌సభలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, అంతరిక్ష శాఖ చాలాకాలంగా విదేశీ శాటిలైట్లను ప్రయోగిస్తోందని చెప్పారు. దాదాపు 33 భిన్న దేశాలకు సంబంధించిన 328 ఉపగ్రహాలను నేటివరకూ ప్రయోగించి, అదే కాలానికి 28 మిలియన్లను డాలర్ల రూపంలో, 189 మిలియన్లను యూరోల రూపంలో ఆర్జించింది. అంతేకాకుండా, భారత ప్రభుత్వం అంతరిక్ష శాఖ కింద న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ ఎస్ ఐఎల్) అనే ప్రభుత్వ రంగ సంస్థను వాణిజ్యపరంగా శాటిలైట్లను ప్రయోగించి, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఏర్పాటు చేసింది.
ఉపగ్రహ ప్రయోగాలలో సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకునే రంగంలో ఆత్మనిర్భరతను సాధించేందుకు ఇస్రో కృషి చేస్తోంది; కనుక ఈ దిశగా విదేశీ సహకారాన్ని కోరేందుకు ఎటువంటి విధానాన్ని గురించీ యోచించడం లేదు.
ఈ అంశానికే సంబంధించిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇస్రో సౌకర్యాలను భారతీయ పరిశ్రమలు, విద్యా సంస్థలు తమ అంతరిక్ష వ్యవస్థలను పరీక్షించుకునేందుకు విస్తరించినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఎం/ఎ స్ స్పేస్ కిడ్జ్, ఎం/ ఎస్ సైజిగీ స్పేస్ టెక్నాలజీస్‌కు చెందిన ఉపగ్రహాలను ఇస్రోలోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్‌లో పరీక్షించారన్నారు. భారతదేశంలోని అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం అన్నది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన అప్లికేషన్లు, సర్వీసుల అభివృద్ధికి దారి తీస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మొత్తం మీద అది అంతరిక్ష ఆర్థికవ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుందన్నారు.
అంతరిక్ష కార్యకలాపాలలో పాలుపంచుకునేందుకు ప్రైవేటు కంపెనీలను అనుమతించే సమయంలో జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను ఆందోళనలను ప్రభుత్వం విశ్లేషించిందని, ఈ క్రమంలోనే దేశంలోని అంతరిక్ష కార్యకలాపాలను అనుమతించేందుకు, పర్యవేక్షించేందుకు, క్రమబద్ధం చేసేందుకు స్వతంత్ర నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ( IN-SPACe)ను ఏర్పాటు చేయడం ద్వారా తగిన చర్యలను తీసుకుందని మంత్రి వెల్లడించారు.
***
(Release ID: 1696844)
Visitor Counter : 253