రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
బ్రహ్మపుత్ర వేలీ ఫర్టిలైజర్ కార్పొరేశన్ లిమిటెడ్, అసమ్ కు 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
10 FEB 2021 3:07PM by PIB Hyderabad
బ్రహ్మపుత్ర వేలీ ఫర్టిలైజర్స్ కార్పొరేశన్ లిమిటెడ్ (బివిఎఫ్‌సిఎల్), నామరూప్ (అసమ్) కు యూరియా తయారీ విభాగాల నిర్వహణ ను కొనసాగించడం కోసం 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించవలసిందంటూ ఎరువుల విభాగం తీసుకు వచ్చిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్న ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఈ రోజు న ఆమోదం తెలిపింది.
కంపెనీల చట్టం ప్రకారం భారత ప్రభుత్వ ఎరువుల విభాగం (డిఒఎఫ్) పరిపాలనపూర్వక నియంత్రణ లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థ గా బ్రహ్మపుత్ర వేలీ ఫర్టిలైజర్స్ కార్పొరేశన్ లిమిటెడ్ (బివిఎఫ్‌సిఎల్), నామరూప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ అసమ్ లోని నామరూప్ లో గల బివిఎఫ్‌సిఎల్ పరిసరాల లో తన రెండు పాత ప్లాంటులైన నామరూప్-II ని, నామరూప్-III ని నడుపుతున్నది. భారతదేశం లో గ్యాస్ ఆధారితంగా నడిచే తొలి యూరియా తయారీ యూనిట్ కావడం తో పాటు మౌలిక సదుపాయాల పరంగా, ఫీడ్ స్టాక్ అందుబాటు పరంగా కొదువ ఏమీ లేకపోయినప్పటికీ కూడా తన ప్లాంటుల లోని సాంకేతిక విజ్ఞానం పాతదీ, కాలం చెల్లిపోయిందీ అయినందువల్ల ఈ కంపెనీ కి ఖర్చు కు తగిన విధం గా సముచితమైన ఉత్పాదన స్థాయి ని నిలబెట్టుకోవడం కష్టం అయిపోతోంది. ఈ ప్లాంటులను సురక్షితమైన విధంగాను, నిలకడైన రీతి లోను, ఆర్థిక నిర్వహణ పరంగా ఇవి సజావు గా సాగాలి అంటే గనక కొన్ని యంత్రాలను, ఉపకరణాలను పూర్తి మరమ్మత్తు చేయవలసిన /కొత్త సామగ్రి ని సమకూర్చవలసిన అవసరం ఎంతయినా ఉంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేశన్, ఉత్ప్రేరక వస్తువులు మొదలైన వాటిని కొనుగోలు చేయడంతో పాటుగా యూనిట్ లను సాఫీ గా నిర్వహించడానికి కనీస నిర్వహణ సంబంధి మరమ్మత్తులకు 100 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని అంచనా వేయడమైంది. మరి ఈ కారణం గా భారత ప్రభుత్వం బ్రహ్మపుత్ర వేలీ ఫర్టిలైజర్స్ కార్పొరేశన్ లిమిటెడ్ (బివిఎఫ్‌సిఎల్) కు 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమోదం తెలిపింది.
భారతదేశ ఈశాన్య ప్రాంతం లో ఏర్పాటైన బ్రహ్మపుత్ర వేలీ ఫర్టిలైజర్స్ కార్పొరేశన్ లిమిటెడ్ (బివిఎఫ్‌సిఎల్), ఆ ప్రాంతం లో ఆర్థిక వృద్ధి కి ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తున్నది. బివిఎఫ్‌సిఎల్ కు 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తే ప్రతి సంవత్సరం 3.90 లక్షల ఎమ్‌టి యూరియా ఉత్పత్తి సామర్ధ్యం కొనసాగుతూ, యావత్తు ఈశాన్య ప్రాంతం లో, ప్రత్యేకించి అసమ్ లో, తేయాకు పరిశ్రమ కు, వ్యవసాయ రంగానికి యూరియా సకాలం లో అందుబాటు లో ఉండేటట్లుగా ఈ కంపెనీ పూచీ పడగలుగుతుంది. దీనితో సుమారు 580 మంది ఉద్యోగులకు శాశ్వత ప్రాతిపదిక న, మరో 1500 మంది కి అడ్-హాక్ ప్రాతిపదిక న ఉపాధి కొనసాగేందుకు ఆస్కారం ఉంటుంది. దీనికి అదనం గా, ఈ సంస్థ ద్వారా 28,000 మంది కి పరోక్ష ప్రయోజనం కూడా లభిస్తుంది. దీనితో భారత ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ కు సైతం ఊతం అందుతుంది.
***
(Release ID: 1696802)
Visitor Counter : 139