మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        రుతుస్రావ సమయంలో పరిశుభ్రత అనే అంశంపై వెబినార్ 
                    
                    
                        పాల్గొన్న కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి 
ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడానికి వ్యవస్థ అవసరం 
                    
                
                
                    Posted On:
                21 JAN 2021 6:32PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                జాతీయ ఆడపిల్లల వారోత్సవాలలో భాగంగా మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజు రుతుస్రావ సమయాలలో పరిశుభ్రత అనే అంశంపై వెబినార్ ను నిర్వహించింది. జనవరి 21 నుంచి 26 వరకు ఈ వారోత్సవాలను ఆడపిల్లలు, యుక్తవయస్కులు, మహిళలకు సంబందించిన వివిధ అంశాలపై వెబెనార్లను మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహిస్తోంది. 
ఈరోజు జరిగిన వెబెనార్ లో మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రామ్మోహన్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ రామ్మోహన్ మిశ్రా రుతుస్రావ సమయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ఆడపిల్లలకు అండగా నిలవాలని అన్నారు. యుక్తవయస్సులో ప్రవేశించే సమయంలో ఆడపిల్లలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారని వీటిని అర్ధం చేసుకుని ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలని అన్నారు. రుతుస్రావ అంశంపై ఇప్పటికీ సమాజంలో కొన్ని మూఢనమ్మకాలు అపోహలు ఉన్నాయని అన్నారు. ఈ అంశాలలో ప్రజలను చైతన్యవంతులను చేసి మూఢనమ్మకాలను పారదోలడానికి పటిష్టమైన వ్యవస్థకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని శ్రీ మిశ్రా పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యాసంస్థలు, పంచాయతీ సంస్థలు, ఆరోగ్య కార్యకర్తలు, తల్లులు, బంధువులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఆడపిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని మెలగాలని అన్నారు. రుతుస్రావం అనేది సహజంగా జరిగేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన అన్నారు. ఆడపిల్లలను విద్యావంతులను చేసి వారికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. 
వెబెనార్ లో ముఖ్యవక్తగా పాల్గొన్న ఎయిమ్స్ లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ సుమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. రుతుస్రావ సమయంలో పాటించవలసిన పరిశుద్రత లాంటి అంశాలపై డాక్టర్ మల్హోత్రా ప్రసంగించారు. తెలంగాణ, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ మరియు గుజరాత్ తో సహా వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు వెబ్‌నార్‌కు హాజరయ్యారు. ఆరోగ్య, కుటుంబ,మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు కూడా వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.
***
                
                
                
                
                
                (Release ID: 1691028)
                Visitor Counter : 178