నీతి ఆయోగ్

పట్టణ ప్రాంతాలలో సేవ మరియు వాణిజ్య విధానాల్లో మల బురద,మల నీరు యాజమాన్యంపై నివేదిక విడుదల చేసిన నీతి ఆయోగ్

Posted On: 20 JAN 2021 5:01PM by PIB Hyderabad

దేశంలో 10 రాష్ట్రాలలోని పట్టణ ప్రాంతాలలో సేవాపరంగా వాణిజ్య పరంగా అమలు జరుగుతున్న మల బురద,మల నీరు యాజమాన్య విధానాలపై నీతీ ఆయోగ్ మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. దీనిలో మల బురద,మల నీరు యాజమాన్యంపై పట్టణ ప్రాంతాలలో అమలు జరుగుతున్న వ్యవస్థలపై నిర్వహించిన 27 అధ్యయనాల వివరాలు పొందుపరిచారు. జాతీయ మల బురద,మల నీరు యాజమాన్యం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎస్ఎమ్) సమాఖ్యతో కలసి నీతి ఆయోగ్ ఈ నివేదికను సిద్ధం చేసింది. వర్చువల్ విధానంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్, గృహనిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి డాక్టర్ కె. రాజేశ్వరరావు నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమితాబ్ కాంత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద పట్టణ ప్రాంతాలలో 70 లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు అనేక కార్యక్రమాలను అమలు చేశామని దీనివల్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా భారతదేశంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. బహిరంగ మల విసర్జన రహిత లక్ష్యాన్ని సాధించిన తరువాత ప్రజారోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.

 ఓడీఫ్ + , ఓడీఫ్ + + లక్ష్యాలను సాధించడం ద్వారా ప్రజారోగ్య రంగాన్ని మరింత మెరుగు పరుస్తామని తెలిపారు. దేశంలో అమలు జరుగుతున్నమల బురద,మల నీరు యాజమాన్య విధానాల వివరాలను నివేదికలో పొందుపరచడం జరిగిందని అన్నారు. వీటిని దేశంలోని ఇతర ప్రాంతాలలో అమలుచేయవచ్చునన్న అంశాన్ని కూడా పొందుపరిచామని తెలిపారు.

మల బురద,మల నీరు యాజమాన్య ప్రాధాన్యతను గుర్తించిన గృహనిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ 2017 మల బురద,మల నీరు యాజమాన్య జాతీయ విధానానికి రూపకల్పన చేసిందని గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా తెలిపారు. దీనిని 24 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, వీటిలో 12 రాష్ట్రాలు తమ పరిస్థితులకు అనుగుణంగా విధానాలను రూపొందించుకున్నాయని ఆయన వివరించారు.

పట్టణ ప్రాంతాలలో 66 లక్షల గృహాలలో మరుగుదొడ్లను, ఆరు లక్షల ప్రజామరుగుదొడ్లను నిర్మించి ప్రతి ఒక్కరికి మరుగు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. బహిరంగ మలవిసర్జన నిర్మూలన లక్ష్యాన్ని సాధించిన తరువాత ఓడీఫ్ + , ఓడీఫ్ + + లక్ష్య సాధన దిశలో సాగుతున్నది. లక్ష్య సాధనతో పాటు మల వ్యర్ధాలను హాని లేకుండా తొలగించే వ్యవస్థల రూపకల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

 

భారతదేశంలో 60% పట్టణ గృహాలు ఆన్‌సైట్ పారిశుధ్య వ్యవస్థలపై ఆధారపడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ వ్యవస్థల సక్రమ నిర్వహణకు సేకరించిన వ్యర్థాలను ప్రణాళికాబద్ధంగా శుద్ధి చేయవలసి ఉంటుంది. దీనిలో భాగంగా మానవ విసర్జన నిర్వహణకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. వ్యాధుల వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉన్న వ్యర్ధాలను సేకరించడం, వాటిని రవాణా చేయడం శుద్ధి చేసిన తరవాత వాటిని పారవేయడం లేదా పునర్వినియోగాయానికి సిద్ధం చేయడం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.దీనిద్వారా తక్కువ ఖర్చుతో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి దోహద పడుతుంది.

అనేక భారతీయ నగరాలు ఆదర్శవంతమైన మల బురద,మల నీరు యాజమాన్య విధానాల నమూనాలను సిద్ధం చేశాయి, వీటిని ప్రైవేటు రంగ భాగస్వామ్యం మరియు యాంత్రీకరణతో అమలు చేస్తున్నాయి. దేశంలో నగరాలు సమగ్ర పారిశుద్ధ్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ నివేదికల పుస్తకం సహకరిస్తుంది.

ఈ సందర్భంగా నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి డాక్టర్ కె రాజేశ్వరరావు మాట్లాడుతూ 'ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం సార్వత్రిక మురుగునీటి వ్యవస్థ రూపకల్పన. అయితే ప్రస్తుతం పట్టణ జనాభాలో 60% మంది ఆన్‌సైట్ పారిశుద్ధ్య వ్యవస్థలపై ఆధారపడి వుంటున్నారు. దీనివల్ల మల బురద మరియు మల వ్యర్ధాల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక అవసరం ఉంటుంది. రాష్ట్రాలు, నగరాల్లో ప్రైవేట్ రంగం, ప్రజాభాగస్వామ్యంతో అమలు జరుగుతున్న ప్రణాళికలు పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇది మున్సిపల్ కార్యనిర్వాహకులు, ప్రణాళికల రూపకర్తలు, ప్రైవేట్ రంగ నిపుణులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎమ్‌ను ప్రధాన ఆర్థిక కార్యకలాపంగా చేపట్టడానికి సహాయపడుతుంది.' అని అన్నారు.

' వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేలా చూడడానికి రాష్ట్రాలతో కలసి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎం వినూత్న నమూనాలు, విధానాలు మరియు మార్గదర్శకాల రూపకల్పనపై పనిచేస్తున్నది. ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ అంశాలు పారిశుధ్యం అంశంతో ముడిపడి ఉంటాయి. ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మానవ వ్యర్థాలను సురక్షితంగా మరియు పూర్తిగా శుద్ధి చేయడానికి చర్యలు తీసుకోవలసి ఉంది. ఈ నివేదికలో పొందుపరచిన నమూనాలు ఇతర రాష్ట్రాలు మరియు నగరాలు తమ పరిస్థితులకు అనువైన అవసరమైన ప్రణాళికల రూపకల్పన చేసుకోడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల భారతదేశంలో రానున్న అయిదు సంవత్సరాలలో మల బురద మరియు మలిన నీరు 100% సురక్షితంగా శుద్ధి చేయడానికి అవకాశం కలుగుతుంది' అని ఎన్ఎఫ్ఎస్ఎస్ఎమ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు మరియు బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ మధు కృష్ణ వివరించారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎమ్‌లోచోటు చేసుకుంటున్న మార్పులు, ఇది అందించే అవకాశాలను నగర నిర్వాహకులు, మునిసిపల్ కార్యనిర్వాహకులు, ప్రతినిధులు, రాష్ట్ర నిర్ణయాధికారులు, సిఎస్‌ఓలు మరియు ప్రైవేటు రంగ సంస్థలు అవగతం చేసుకునే విధంగా ఈ ఈ నివేదికను సిద్ధం చేశారు.

పూర్తి నివేదికలను https://niti.gov.in/NITI-NFSSM-Faecal-Sludge-And-Septage-Management-In-Urban-Areas-Service-and-Business-Modelsలో చూడవచ్చును.

 

***(Release ID: 1690610) Visitor Counter : 245