ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోల్‌కతాలో ఆదాయపన్ను విభాగం సోదాలు

Posted On: 08 JAN 2021 8:35PM by PIB Hyderabad

ఈనెల 5వ తేదీన, కోల్‌కతాలోని మూడు స్థిరాస్తి వ్యాపారం, స్టాక్‌ బ్రోకింగ్‌ గ్రూపుల కేసుల్లో ఆదాయపన్ను విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయా గ్రూపుల గురించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం, వారి ఆర్థిక నివేదికలపై విశ్లేషణ, మార్కెట్‌పై నిఘా, క్షేత్రస్థాయి దర్యాప్తు ఆధారంగా ఈ సోదాలు చేపట్టారు.

    వాటాల మూలధనం/అసురక్షిత రుణాల కోసం అనేక నకిలీ సంస్థలను ఈ గ్రూపులు సృష్టించినట్లు అధికారుల తనిఖీల్లో ఆధారాలతో సహా తేలింది. ఖాతా పుస్తకాల్లో చూపని నగదు లావాదేవీలు కూడా బయటపడ్డాయి. ఫ్లాట్లను దొంగచాటుగా అమ్మగా వచ్చిన భారీ ఆదాయాన్ని కూడా అధికారులు కనుగొన్నారు. తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకుని తిరిగి తీసుకోవడానికి, ఈ గ్రూపుల్లోని వ్యక్తులు అనేక నకిలీ సంస్థలను సృష్టించినట్లు దర్యాప్తులో తెలిసింది. లెక్కల్లో చూపని దాదాపు రూ.365 కోట్ల ఆదాయాన్ని ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. రూ.111 కోట్ల నల్లధనాన్ని కూడబెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

    సోదాల్లో లభించిన, లెక్కల్లో చూపించని 3.02 కోట్ల నగదు, రూ.72 లక్షల విలువైన ఆభరణాలను అధికారులు జప్తు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

 

***



(Release ID: 1687323) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi , Manipuri