మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
దేశంలో బర్ద్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లూయెంజా) స్థితి
Posted On:
07 JAN 2021 7:09PM by PIB Hyderabad
దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇటీవల అకస్మాత్తుగా బర్ద్ ఫ్లూ వ్యాపించి కోళ్లు, కాకులు, వలస పక్షులు మృత్యువాత పడటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. బర్ద్ ఫ్లూ వ్యాపించిన కేరళ,హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్
రాష్ట్రాల అధికారుల సమావేశాన్ని భారత ప్రభుత్వ పశుగణాభివృద్ధి & పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి ఏర్పాటు చేసి వ్యాధి వ్యాప్తి
తీరును అడిగి తెలుసుకున్నారు. వ్యాధిని నిరోధించడానికి, వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేశారు.
ఇప్పటివరకు కేవలం నాలుగు రాష్ట్రాలలో (కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్) మాత్రమే బర్ద్ ఫ్లూ వ్యాపించినట్లు ధృవపడింది. కేరళలో వ్యాధి ప్రభావం ఉన్న జిల్లాల్లో ఏరివేసి భూమిలో పూడ్చివేత పనులు జరుగుతున్నాయి. నీరు నిల్వ ఉండే కుంటలు, చెరువుల చుట్టుపక్కల, పక్షుల మార్కెట్లు, జంతు ప్రదర్శన శాలలు, కోళ్ల ఫారాలు మొదలగు వాటి పరిసరాల్లో నిఘా ముమ్మరం చేశారు. బర్ద్ ఫ్లూ వల్ల మరణించిన కోళ్లు, పక్షుల కళేబరాల విసర్జనకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు కోళ్ల ఫారాలలో బతికి ఉన్న కోళ్ల భద్రతను పటిష్టం చేయవలసిందిగా రాష్ట్రాలకు సూచించారు. బర్ద్ ఫ్లూ వ్యాప్తి కారణంగా ఏర్పడే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను కోరారు. వ్యాధి సోకిన కోళ్లు, పక్షుల ఏరివేత, విసర్జనకు అవసరమైన ఉపకరణాలు, తగినన్ని వ్యక్తిగత సంరక్షణ సాధనాల (పి పి ఇ) కిట్లు నిల్వ ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాలను కోరడం జరిగింది.
వ్యాధి ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు (RDDLs/CDDL/ICAR-NIHSAD) పంపడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర పశు గణాభివృద్ధి శాఖ అధికారులు ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. కోళ్లు, పక్షుల నుంచి వ్యాధి మనుష్యులకు సోకకుండా గట్టి నిఘా వేసి ఉండి నిరోధించాలని తెలిపారు. పశుగణాభివృద్ధి శాఖ అధికారులు ఆయా రాష్ట్రాల అటవీ శాఖ అధికారులతో సమన్వయంతో వ్యవహరించి అటవీ ప్రాంతాలలో సంచరించే పక్షులు అసాధారణ రీతిలో మృత్యువాత పడుతున్నట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యాధి ప్రభావిత రాష్ట్రాలకు నిఘా పెంచవలసిందిగా సూచనలు ఇవ్వడమే కాక కేంద్ర పశుగణాభివృద్ధి & పాడి పరిశ్రమ శాఖ రాష్ట్రాలతో సమన్వయంతో వ్యవహరించి వ్యాధి వ్యాప్తి నిరోధం, అదుపునకు తదుపరి చర్యలకు వ్యూహరచన చేచేసేందుకు కేంద్ర స్థాయిలో కంట్రోలు రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాక వ్యాధి ప్రభావిత కేరళ, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు మరియు సాంక్రమిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన పరిశోధనకు రెండు కేంద్ర బృందాలను పంపారు.
జాతీయ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ కార్యదర్శితో కలసి కేంద్ర పశుగణాభివృద్ధి శాఖ అధికారులు రాష్ట్రాలలో సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమావేశమై పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాలలో నిఘా ముమ్మరం చేయవలసిందిగా సూచించారు.
వదంతుల వ్యాప్తిని అరికట్టేందువుకు కోళ్లను పెంచే రైతులు మరియు గుడ్లు , కోడి మాంసం తినే వినియోగదారులకు వ్యాధిని గురించిన సమాచారం తెలియజేయడం ప్రధానమని , సరైన పద్ధతిలో మరిగించి వండినట్లయితే పౌల్ట్రీ ఉత్పత్తులు మనుష్యుల వినియోగానికి సురక్షితమైనవని తెలియజెప్పాలని/ జాగృతి కలిగించాలని రాష్టాల అధికారులకు వివరించారు.
***
(Release ID: 1687070)
Visitor Counter : 128