వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ఎమ్.ఎస్.పి. కార్యకలాపాలు

గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది వరి సేకరణ 27.13 శాతం మేర పెరిగింది.

98,456.80 కోట్ల రూపాయల మేర ఎం.ఎస్.పి. విలువతో, సుమారు 67.89 లక్షల మంది వరి రైతులు కె.ఎం.ఎస్. సేకరణ కార్యకలాపాల ద్వారా లబ్ధి పొందారు.

Posted On: 07 JAN 2021 6:07PM by PIB Hyderabad

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్) లో భాగంగా, ప్రస్తుతం ఉన్న ఎమ్.ఎస్.పి. పథకాల  ప్రకారం, 2020-21 ఖరీఫ్ పంటలను రైతుల నుండి ప్రభుత్వం ఎమ్.ఎస్.పి. వద్ద కొనుగోలు చేస్తూనే ఉంది.

వరి పండించే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ-కశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఝార్ఖండ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లలో, 2020-21 ఖరీఫ్ వరి సేకరణ, సజావుగా సాగుతోంది.  గత ఏడాది ఇదే కాలంలో కొనుగోలు చేసిన 410.18 లక్షల మెట్రిక్ టన్నుల వరి తో పోలిస్తే 2021 జనవరి, 6వ తేదీ వరకు కొనుగోళ్ళు 27.13 శాతం ఎక్కువగా అంటే 521.48 లక్షల మెట్రిక్ టన్నుల మేర వరి కొనుగోళ్ళు జరిగాయి.   మొత్తం 521.48 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ళలో, కేవలం పంజాబ్ లోనే 202.77 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే మొత్తం సేకరణలో 38.88 శాతం మేర వరి కొనుగోళ్ళు జరిగాయి.

98,456.80 కోట్ల రూపాయల మేర ఎం.ఎస్.పి. విలువతో, సుమారు 67.89 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కె.ఎం.ఎస్. సేకరణ కార్యకలాపాల నుండి లబ్ధి పొందారు.

వీటితో పాటు, రాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ధరల మద్దతు పధకం (పి.ఎస్.ఎస్) కింద 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం 51.66 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు, నూనె గింజలను సేకరించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.  వీటితో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి  (బహు వార్షిక పంట)  కొనుగోలుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది.  ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ధర మద్దతు పథకం (పి.ఎస్.ఎస్)  కింద పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరి సేకరణకు కూడా ప్రతిపాదనలు స్వీకరించినప్పుడు అనుమతి ఇవ్వబడుతుంది.  అప్పుడు, సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో, గుర్తించిన పంట కాలం వ్యవధిలో మార్కెట్ రేటు,  ఎం.ఎస్.పి. కంటే తక్కువగా ఉన్నట్లయితే, రాష్ట్రాలు గుర్తించిన సేకరణ  ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు, ఎఫ్.ఏ.క్యూ. గ్రేడ్ కు చెందిన ఈ పంటలను నమోదు చేసుకున్న రైతుల నుండి నేరుగా 2020-21 సంవత్సరానికి ప్రకటించిన ఎం.ఎస్.పి. వద్ద సేకరించవచ్చు.

2021 జనవరి 6వ తేదీ వరకు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 1,48,555 మంది రైతుల నుండి 1,487.65 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన 2,78,059.62 మెట్రిక్ టన్నుల పెసలు, మినుములు, వేరుశనగ కాయలు, సోయాబీన్ లను ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీ ల ద్వారా సేకరించింది.

అదేవిధంగా, 2021 జనవరి, 6వ తేదీ వరకు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని 3,961 మంది రైతులకు లబ్ది చేకూరే  విధంగా 52.40 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి  (బహు వార్షిక పంట)   ని సేకరించడం జరిగింది. కొబ్బరి, మినుముల విషయానికి వస్తే, వీటిని ప్రధానంగా పండించే చాలా రాష్ట్రాల్లో, వీటి ధరలు ఎమ్.ఎస్.పి. కంటే ఎక్కువగా ఉన్నాయి. ఖరీఫ్ పప్పుధాన్యాలు, నూనెగింజల లభ్యత ఆధారంగా, ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సేకరణను ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఎం.ఎస్.‌పి. కింద పత్తి విత్తన  (కపాస్)  సేకరణ కార్యకలాపాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక  రాష్ట్రాల్లో సజావుగా కొనసాగుతున్నాయి. 2021 జనవరి, 6వ తేదీ వరకు 15,59,429 మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా మొత్తం 23,485.05 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన 80,26,401 పత్తి బేళ్ళను సేకరించడం జరిగింది.

*****


(Release ID: 1686937) Visitor Counter : 159