రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డి.ఆర్.డి.ఒ. 63వ వ్యవస్థాపక దినోత్సవం

Posted On: 01 JAN 2021 5:52PM by PIB Hyderabad

  రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) 63వ వ్యవస్థాపక దినోత్సవం ఈ రోజు జరిగింది.   ఈ సందర్భంగా,..ఇటీవల ఎగుమతికి అనుమతించిన ఆకాష్ క్షిపణి వ్యవస్థ నమూనాను,.. రక్షణ పరిశోధనా, అభివృద్ధి డైరెక్టరేట్ కార్యదర్శి, డి.ఆర్.డి.ఒ. చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్.కు సమర్పించారు. మరో వైపు,..డి.ఆర్‌.డి.ఒ. భవన్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్.తో పాటుగా డైరెక్టర్ జనరల్స్, డి.ఆర్.డి.ఒ. ప్రధాన కార్యాలయం డైరెక్టర్లు దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంకు పుష్పాంజలి ఘటించారు.  

   రక్షణ రంగంలో పరిశోధనను పెంపొందించేందుకు, భారతీయ సాయుధ బలగాలకోసం అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పన లక్ష్యంగా 1958లో కేవలం పది లేబరేటరీల వ్యవస్థతో డి.ఆర్.డి.ఒ. ఏర్పాటైంది. ఈ రోజున సైన్యానికి అవసరమైన  అనేక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో డి.ఆర్.డి.ఒ. కృషిని కొనసాగిస్తోంది. రక్షణ రంగంకోసం  ఏరోనాటిక్స్, ఆయుధ సంపత్తి, యుద్ధ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇంజనీరింగ్ వ్యవస్థలు, క్షిపణులు, నావికా వ్యవస్థలు, అధునాతన కంప్యూటింగ్, సైబర్ రంగం, జీవన శాస్త్రాలు తదితర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో డి.ఆర్.డి.ఒ. తన పరిశోధనను కొనసాగిస్తోంది.

   వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డి.ఆర్.డి.ఒ. సిబ్బందిని ఉద్దేశించి సంస్థ చైర్మన్ ప్రసంగిస్తూ, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఒడిదుడుకులతో కూడిన సంవత్సరం ముగిసిందని, మరొ కొత్త సంవత్సరం మొదలవుతోందని అన్నారు. డి.ఆర్.డి.ఒ.లో జరుగుతున్న కృషితో భారత్ స్వావలంబన దిశగా ఎంతో పురోగమించిందని, ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనకు ఇది దోహపడుతోందని డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు. 
  2021వ సంవత్సరానికి ఎగుమతే డి.ఆర్.డి.ఒ. ప్రధాన లక్ష్యమని, డి.ఆర్.డి.ఒ. అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న పలు ఉత్పాదనలను ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలు, పరిశ్రమలు ఇదివరకే ఎగుమతి చేశాయని అన్నారు. భారతీయ సాయుధ బలగాల అవసరాలకు తగినట్టుగా కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను, ఉత్పాదనలను డి.ఆర్.డి.ఒ. రూపొందిస్తుందని అన్నారు.

  2020లో డి.ఆర్.డి.ఒ. అనేక విజయాలు సాధించిందన్నారు. భారతీయ నావికాదళానికి చెందిన ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్య నౌకపై నావికాదళం తేలికరకం యుద్ధవిమానాన్ని తొలిసారి దింపడం, శబ్ధవేగానికి మించిన సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శన వాహనం, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్,, క్వాంటమ్ టెక్నాలజీ పరిణామాలు, లేజర్ చోదక ట్యాంకు విధ్వంసక క్షిపణి, జలంతర్గామి విధ్వంసక యుద్ధ సామర్థ్యాన్ని నిర్ధారించే స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానం, యాంటీ రేడియేషన్ క్షిపణి (ఎన్.గార్మ్), మెరుగుపరిచిన పినాకా రాకెట్ వ్యవస్థ, భూతలంనుంచి గగనతలానికి ప్రయోగించగలిగే సత్వర ప్రతిస్పందనా క్షిపణి రూపకల్పనతో పాటు ఇలాంటి మరెన్నో విజయాలను డి.ఆర్.డి.ఒ. సాధించిందన్నారు. .

   కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో డి.ఆర్.డి.ఒ. ఎన్నో సేవలందించిందని, కోవిడ్ పై పోరాటం, వైరస్ వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా దేశంలోని దాదాపు 40 డి.ఆర్.డి.ఒ. లేబరేటరీలు 50రకాల సాంకేతిక పరిజ్ఞానాలకు యుద్ధ ప్రాతిపదికన రూపకల్పన చేశాయని అన్నారు. డి.ఆర్.డి.ఒ. రూపకల్పన చేసిన ఉత్పాదనల్లో వ్యక్తిగత రక్షణ కిట్లు (పి.పి.ఇ. కిట్లు), శానిటైజర్లు, మాస్కులు, అతినీలలోహిత కిరణాల ఆధారంగా పనిచేసే సూక్ష్మక్రిమి సంహారక వ్యవస్థలు, జెర్మి క్లీన్, కృత్రిమ శ్వాస పరికరాల కీలక విడిభాగాలు, వంటివి అతి తక్కువ వ్యవధిలో డి.ఆర్.డి.ఒ. తయారు చేయగలిగిందన్నారు. కోవిడ్ నియంత్రణ లక్ష్యంగా వైద్య సదుపాయాలను బలోపేతం చేయడానికి ఢిల్లీ, పాట్నా, ముజఫర్ పూర్ ప్రాంతాల్లో మూడు కోవిడ్ ఆసుపత్రులను డి.ఆర్.డి.ఒ. ఏర్పాటు చేసిందన్నారు. దీనికి తోడు, కోవిడ్-19 స్కీనింగ్ పరీక్షలు, పరిశోధనా కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు పలుచోట్ల సంచార వైరాలజీ పరిశోధన, వ్యాధినిర్ధారణ లేబరేటరీలను తమ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

  రక్షణ రంగపు సాంకేతిక పరిజ్ఞానంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా తన క్షేత్ర సామర్థ్యాన్నిబలోపేతం చేసేందుకు డి.ఆర్.డి.ఒ. అనేక చర్యలు తీసుకుందన్నారు. అత్యుత్తమమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను అతి తక్కువ వ్యవధిలో రూపొందించేలా డి.ఆర్.డి.ఒ. తన కృషిని కొనసాగిస్తుందన్నారు. వివిధ నిర్దేశిత లక్ష్యాల సాధనకోసం సాయుధ బలగాలతో సమన్వయంగా పనిచేసిన డి.ఆర్.డి.ఒ. శాస్త్రవేత్తలను, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. డి.ఆర్.డి.ఒ. చేపట్టిన ప్రధాన పతాక కార్యక్రమాలను ఆయన వివరించారు. శబ్ధవేగాన్ని మించి దూసుకుపోయే క్రయిజ్ క్షిపణి, అధునాతన మధ్యతరహా యుద్ధ విమానం, కొత్త తరం ప్రధాన యుద్ధ ట్యాంకు, మానవ రహిత యుద్థ వాహనం తదితరాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  సైబర్ భద్రత, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు వంటి రేపటి తరం అవసరాలకు తగినట్టుగా పనిచేయడంపై దృష్టిని కేంద్రీకరించాలని ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. రక్షణ తయారీ రంగంలో పలు అభివృద్ధి కార్యకలాపాలకు డి.ఆర్.డి.ఒ. సామర్థ్యం ఉత్పేరకంగా దోహపడిందన్నారు.  రక్షణ రంగంలో భారతదేశం స్వావలంబనే లక్ష్యంగా భవిష్యత్తుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయాలంటే విద్యా సంస్థలు, పరిశోధనా అభివృద్ధి సంస్థలు, పరిశ్రమలు కలసికట్టుగా పనిచేయాలన్నారు. డి.ఆర్.డి.ఒ. రూపొందిస్తున్న ఉత్పాదనలకు అవసరమైన విడి భాగాలను చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎస్.ఎం.ఇ.లు), సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు) సరఫరా చేస్తున్నాయని, వాటన్నింటికీ ఇపుడు కొత్త విజయాల్లో భాగస్వామ్యం లభించినట్టేనని చైర్మన్ అన్నారు.  స్టార్టప్ కంపెనీలకోసం “కలలు కనే సాహసం” పేరిట ఒక పోటీని డి.ఆర్.డి.ఒ. నిర్వహించిందని, దీనికి ఎంతో ప్రోత్సాహకరమైన ప్రతిస్బందన లభించిందని అన్నారు. మన సైనిక బలగాలకోసం సృజనాత్మక ఉత్పాదనలను రూపొందించేందుకు ప్రతి ఏడాది కనీసం 30 స్టార్టప్ కంపెనీలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. 

   వివిధ అధ్యయన సంస్థలతో  దీర్ఘ కాల సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, దేశంలో అందుబాటులో ఉన్న విద్యా సంస్థల నైపుణ్యాన్ని సానుకూలంగా వినియోగించుకునేందుకు డి.ఆర్.డి.ఒ. కృషి చేయాలన్నారు. సమస్య సత్వర పరిష్కారం లక్ష్యంగా జరిపే పరిశోధనపై  డి.ఆర్.డి.ఒ. దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుందన్నారు. రక్షణ పరిశోధనా అభివృద్ధి రంగంలో తగిన కృషి జరిగేలా పరిశ్రమలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, యువతకు సాధికారత కల్పించేందుకు డి.ఆర్.డి.ఒ. కృషి చేస్తుందని చెప్పారు. కాంట్రాక్ట్ సంస్థ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేస్తూ, ఆన్ లైన్ ద్వారా పారిశ్రామిక భాగస్వామ్య సంస్థను రిజిస్టర్ చేసుకునేందుకు రూపొందించిన నూతన వ్యవస్థను కూడా డి.ఆర్.డి.ఒ. చైర్మన్ ఆవిష్కరించారు. “ఉపగ్రహాల వినియోగం ద్వారా కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిజ్ఞానాల రూపకల్పన అంశాల”పై తయారు చేసిన డి.ఆర్.డి.ఒ. మోనోగ్రాఫ్ ను విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణపై నిబంధనావళిని,  డి.ఆర్.డి.ఒ.లో కాలం చెల్లిన రసాయనాల, వాయువుల సమస్య పరిష్కారానికి రూపొందించిన మార్గదర్శక సూత్రాలను కూడా డి.ఆర్.డి.ఒ. చైర్మన్ ఆవిష్కరించారు.

 

****(Release ID: 1685563) Visitor Counter : 307