శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొత్త కరోనా వైరస్ స్థాయిపై అంచనాకు జినోమిక్ కన్సార్షియం

పది పరిశోధన శాలల కలయికతో ఏర్పాటు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఐ.సి.ఎం.ఆర్., సి.ఎస్.ఐ.ఆర్.లతో సహా కేంద్ర బయోటెక్నాలజీ శాఖతో సమన్వయం
కన్సార్షియంకు మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో
ఉన్నతస్థాయి సారథ్యం సంఘం;
వైజ్ఞానిక, సాంకేతిక మార్గదర్శకత్వంకోసం వైజ్ఞానిక సలహా బృందం.

Posted On: 30 DEC 2020 7:15PM by PIB Hyderabad

  దేశంలోని 10 పరిశోధనాగారాల కలియికతో ఇండియన్ సార్స్-సి.ఒ.వి-2 జినోమిక్ కన్సార్షియం (ఇన్సాకోగ్)ను ప్రభుత్వం ప్రారంభించింది. విజ్ఞానశాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.)తో అనుబంధించిన లేబరేటరీలు కూడా ఈ కన్సార్షియంలో అంతర్భాగంగా ఉన్నాయి. కల్యాణి ప్రాంతంలోని నేషనల్ బయోమెడికల్ జినోమిక్స్ ఇన్.స్టిట్యూట్ (ఎన్.ఐ.బి.ఎం.జి.), భువనేశ్వర్ లోని జీవ విజ్ఞానశాస్త్రాల సంస్థ (ఐ.ఎల్.ఎస్.), పూణెలోని జాతీయ వైరాలజీ అధ్యయ సంస్థ (ఎన్.ఐ.వి), జాతీయ కణశాస్త్ర అధ్యయన కేంద్రం (ఎన్.సి.సి.ఎస్.), హైదరాబాద్ లోని సెల్యులార్, మాలిక్యులర్ బయాలజీ అధ్యయన సంస్థ (సి.సి.ఎం.బి.), సెంటర్ ఫర్ డి.ఎన్.ఎ. ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నసిస్ (సి.డి.ఎఫ్.డి.), బెంగళూరులోని మూలకణ శాస్త్ర అధ్యయన సంస్థ/జాతీయ జీవశాస్త్రాల అధ్యయన సంస్థ (ఐ.ఎన్.ఎస్.టి.ఇ.ఎం./ఎన్.సి.బి.ఎస్.), జాతీయ మానసిక ఆరోగ్య, న్యూరాలజీ అధ్యయన సంస్థ (నిమ్.హాన్స్), ఢిల్లీలోని ఇన్.స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐ.జి.ఐ.బి.), జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్.సి.డి.సి.)లకు సంబంధించిన లేబరేటరీలతో ఈ కన్సార్షియం ఏర్పాటైంది.

  సార్స్-సి.ఒ.వి.-2 లేదా కరోనా వైరస్ జన్యుపరమైన ఉత్పరివర్తనా ప్రక్రియలో చోటుచేసుకునే మార్పులను బహుళ పరిశోధనాగారాల వ్యవస్థ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడటమే ఈ కన్సార్షియం ప్రధాన లక్ష్యం. దేశంలో తాజాగా కనిపిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ (SARS-CoV-2 VUI 202012/01) వ్యాప్తి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో ఈ కన్సార్షియం బేరీజు వేస్తుంది. కొత్త రకం కరోనా వైరస్ జన్యువుల్లో మార్పును ఎప్పటికప్పుడు పసిగట్టడం, వాటివల్ల ప్రజారోగ్యంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం, వైరస్ వ్యాప్తికి అవకాశాలు, వైరస్ ధోరణులు, మరణాలు సంభవించే ఆస్కారం తదితర అంశాలను ఈ కన్సార్షియం మధింపు చేస్తుంది.

  కేంద్ర జీవసాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.బి.టి.) కార్యదర్శి డాక్టర్ రేణూ స్వరూప్ ఈ విషయమై మాట్లాడుతూ,  10 లేబరేటరీల కన్సార్షియానికి అనుబంధంగా వివిధ మంత్రిత్వ శాఖల ప్రాతినిధ్యంతో ఒక ఉన్నత స్థాయి సారథ్యం సంఘం ఉంటుందన్నారు. విధానపరమైన అంశాలకు సంబంధించి ఈ సారథ్యం సంఘం మార్గదర్శకంగా పనిచేస్తుందన్నారు. విజ్ఞానశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన పరమైన మార్గదర్శకత్వంకోసం విజ్ఞానశాస్త్ర సలహా బృందం కూడా ఉంటుందని చెప్పారు. కన్సార్షియం కార్యకలాపాలను డి.బి.టి., కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.), సమన్వయం చేస్తూ ఉంటాయన్నారు. ఈ కన్సార్షియం నిర్వహించే కార్యకలాపాలకు అవసరమైన వ్యూహాన్ని, ప్రణాళికను ఇప్పటికే ఇప్పటికే రూపొందించారు.

   యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణాఫ్రికా దేశాలతోపాటుగా, ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో కొత్తరకం కరోనా వైరస్ తలెత్తిన నేపథ్యంలో, వైరస్ వ్యాప్తి, కదలికలపై నిఘాను, అధ్యయనాన్ని ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. వైరస్ జన్యుమార్పులపై, లక్షణాలపై అధ్యయనాన్ని కూడా వేగవంతం చేసింది. యు.కె.లో ప్రత్యేకించి లండన్ నగర ప్రాంతంలో కనిపించిన కొత్త రకం కరోనా వైరస్.కు కొమ్ముల భాగంలో, కొన్ని ఇతర అంతర్భాగాల్లో మార్పులు చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు. వేగంగా జరిగే జన్యుపరమైన మార్పులవల్ల వైరస్ రూపాంతరాల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్టు డి.బి.టి. పేర్కొంటోంది. ఈ కొత్తరకం కరోనా వైరస్ ఇదివరకటి వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు కనుగొన్నారు. అలాగే, దీని ప్రత్యుత్పత్తి వేగం, వ్యాప్తి వేగం దాదాపు 70శాతం వరకూ ఎక్కువగా ఉందని డి.బి.టి. అంచనా వేస్తోంది.

  బహుళ లేబరేటరీల వ్యవస్థ సహాయంతో కన్సార్షియం క్రమం తప్పకుండా జరిపే పర్యవేక్షణ, పరిశోధనల సమాచారం,.. భవిష్యత్తులో జరిగే వ్యాధినిర్ధారణ, నియంత్రణ ప్రక్రియలకు, వ్యాక్సీన్ రూపకల్పనకు ఎంతగానో దోహదపడుతుంది. కన్సార్షియం పరిశోధనా కార్యక్రమాలకు నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇన్.స్టిట్యూట్ (ఎన్.ఐ.బి.ఎం.జి.) సమన్వయకర్తగా పనిచేస్తుంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్.సి.డి.సి.) నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే అన్ని రకాల వైరస్ సమాచారంతో ఒక డాటా బేస్ ను కన్సార్షియం ఏర్పాటు చేస్తుంది. దీనిపై విశ్లేషణతో లభించే సమాచారాన్ని రాష్ట్రాల, జిల్లా స్థాయిలో పరిశోధనకోసం పంపిణీ చేస్తారు.  వైరస్ సోకిన కేసులను పసిగట్టేందుకు, ప్రతిస్పందనా వ్యూహాలను రూపొందించుకునేందుకు ఈ సమాచారాన్ని వినియోగిస్తారు. వైరస్ జన్యు పరవర్తనపై సమాచారాన్ని అంతా జాతీయ స్థాయి డాటాబేస్ రూపంలో రెండు లేబరేటరీల్లో అందుబాటులో ఉంచుతారు. కల్యాణిలోని ఎన్.ఐ.బి.ఎం.జి. లేబరేటరీలో, న్యూఢిల్లీలోని ఐ.జి.ఐ.బి. లేబరేటరీలో సమాచారాన్ని ఉంచుతారు. సార్స్ సి.ఒ.వి-2 ఐసొలేటెడ్ వైరస్ ను ఫరీదాబాద్ లోని ప్రాంతీయ బయోటెక్నాలజీ కేంద్రం(ఆర్.సి.బి.), పూణెలోని జాతీయ వైరాలజీ ఇన్.స్టిట్యూట్ (ఎన్.ఐ.వి.)లోని రిపాజిటరీల్లో ఉంచుతారు.     

 

******



(Release ID: 1684965) Visitor Counter : 258