శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి శాస్త్ర, సాంకేతికతలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి: ఐఐఎస్‌ఎఫ్‌లో సూచించిన డా.హర్షవర్ధన్‌

రాష్ట్ర శాస్త్ర, సాంకేతికత మండళ్లు మరింత శక్తిమంతంగా మారాలి, రాష్ట్రాల పురోగతిలో ప్రధాన పాత్ర పోషించాలి: డా.హర్షవర్ధన్

Posted On: 24 DEC 2020 4:49PM by PIB Hyderabad

రాష్ట్రాల్లోని సమస్యల పరిష్కారానికి శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని అన్ని రాష్ట్రాల శాస్త్ర, సాంకేతికత శాఖ మంత్రులకు కేంద్ర శాస్త్ర, సాంకేతికత శాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌ సూచించారు.

    "సమాజంలోని సవాళ్లను, పరిష్కారాలను అర్ధం చేసుకోవడానికి కొవిడ్‌-19 ఒక పాఠం వంటిది. శాస్త్ర, సాంకేతికత ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. మనకు గొప్ప విజ్ఞాన మౌలిక వసతులు ఉన్నాయి. అన్ని కొలమానాల్లో ప్రపంచంలో ఉత్తమంగా నిలిచాం. శాస్త్ర, సాంకేతికతలను రాష్ట్రస్థాయిలో పూర్తిగా వినియోగించుకోవాలి" అని, ఆరో దఫా "ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌" (ఐఐఎస్‌ఎఫ్‌-2020)లో భాగంగా నిర్వహించిన "రాష్ట్ర ఎస్‌&టీ మంత్రుల సమావేశం"లో డా.హర్షవర్ధన్‌ సూచించారు.
 
    రాష్ట్ర శాస్త్ర, సాంకేతికత మండళ్లు మరింత శక్తిమంతంగా మారాలని, రాష్ట్రాల పురోగతిలో ప్రధాన పాత్ర పోషించాలని కూడా చెప్పారు.

    "వ్యవసాయం, తాగునీరు, విద్యుత్‌, ఆరోగ్యం వంటి అనేక రంగాల సమస్యల పరిష్కారానికి దేశంలో ఉన్న శక్తిమంతమైన విభాగాల్లో శాస్త్ర, సాంకేతికత విభాగం కూడా ఒకటి. సమస్యల పరిష్కారానికి ఈ రంగాలన్నింటిలోకి శాస్త్రీయ విజ్ఞానాన్ని చొప్పించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర మౌలిక వసతులను అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి. దీనివల్ల శాస్త్రీయ ఫలాలు అన్ని రాష్ట్రాలకు అందుతాయి" అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

    రోజువారీ జీవితంలో తలెత్తే సమస్యలకు శాస్త్రీయ విజ్ఞానం సమాధానం చూపుతుందని, జీవన నాణ్యతను పెంచుతుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు ప్రొ.విజయ్ రాఘవన్‌ చెప్పారు. సుదీర్ఘమైన, సంతోషకర జీవనాన్ని పొందడానికి శాస్త్రీయ విజ్ఞానం గొప్ప ప్రయత్నంగా "సీడ్‌" విభాగాధిపతి డా.దేబప్రియ దత్‌ అభివర్ణించారు.

    ఐఐఎస్‌ఎఫ్‌లో భాగంగా రాష్ట్రాల ఎస్‌&టీ మంత్రుల సమావేశం ఏటా జరుగుతుంది. కేంద్రం-రాష్ట్రాల మధ్య శాస్త్ర, సాంకేతికత సహకారంలో చర్చలకు అవకాశం కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర శాస్త్ర, సాంకేతికత మండళ్ల సంకలనాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి డా.హర్షవర్ధన్‌ వెబ్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు.

సంకలనం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

***



(Release ID: 1683505) Visitor Counter : 127