పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్త‌డి నేల‌ల‌ జాబితాలోకి ల‌ద్ధాఖ్‌లోని త్సోకార్ వెట్ ల్యాండ్ కాంప్లెక్స్‌


- దీంతో భార‌త్‌లో 42కు చేరిన రామ్‌సర్ సైట్ల సంఖ్య‌

Posted On: 24 DEC 2020 2:53PM by PIB Hyderabad

లద్దాఖ్‌‌లోని త్సో కార్ వెట్‌ల్యాండ్ కాంప్లెక్స్‌ను భార‌త్ రామ్‌స‌ర్ సైట్ జాబితాలో చేర్చింది. దీంతో భార‌త్‌లో రామ్‌స‌ర్‌ల సైట్‌ల సంఖ్య 42కు చేరింది. ఇది లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో(యుటీ) రెండోది. కేంద్ర‌ పర్యావరణ,అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్.. ఈ స‌మాచారాన్ని ఒక ట్వీట్‌లో వెల్ల‌డి చేస్తూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. త్సో కార్ బేసిన్ ఒక ఎత్త‌యిన‌ చిత్తడి నేలల‌ సముదాయం. ఇందులో ముఖ్యంగా రెండు ప్రధాన జల సంపదలు ఉన్నాయి. ఇందులో స్టార్ట్‌సాపుక్ త్సో ఒక‌టి. దక్షిణాన 438 హెక్టార్ల మంచి నీటి సరస్సు ఇది. భారత దేశంలోని లడఖ్‌లోని చాంగ్‌తాంగ్ ప్రాంతం ఉత్తరాన దాదాపు 1800 హెక్టార్ల మేర‌ విస్తీర్ణంలో హైపర్స‌లైన్ సరస్సు త్సో కార్ కూడా ఇందులో ఉంది. అధిక ఉప్పునీటి బాష్పీభవనం కారణంగా అంచులలో కనిపించే తెల్ల ఉప్పు ఎఫ్లోరోసెన్స్ కారణంగా దీనిని తెల్లటి సరస్సు అని అర్ధం వ‌చ్చేలా త్సో కార్ అని పిలుస్తారు. త్సో కార్ బేసిన్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ప్రకారం ఏ1 కేటగిరీ ముఖ్యమైన బర్డ్ ఏరియా (ఐబీఏ), సెంట్రల్ ఆసియన్ ఫ్లైవేలో కీలకమైన స్టేజింగ్ సైట్ కూడాను. భారత్‌లో న‌ల్ల‌ని-మెడ క‌లిగిన కొంగ‌ల‌ (గ్రస్ నైగ్రికోలిస్) ముఖ్యమైన సంతానోత్పత్తి ప్రదేశాలలో ఈ ప్ర‌దేశం కూడా ఒకటి. గ్రేట్ క్రెస్టెడ్ గ్రీబ్ (పోడిసెప్స్క్రిస్టాటస్), బార్-హెడ్ గీస్ (అన్సెరిండి కస్), రడ్డీ షెల్డక్ (టాడోర్నాఫెర్రుగినా), బ్రౌన్-హెడ్ గుల్ (లారస్బ్రునిసె ఫాలస్), లెస్సర్ సాండ్-ప్లోవర్ (చరాడ్రియస్మోంగోలస్) మరియు అనేక ఇతర జాతి ప‌క్షులు, జంతు జాలాల‌కు ఈ ఐబీఏ ప్రధాన సంతానోత్పత్తి కేంద్రం. రామ్‌సర్ జాబితా యొక్క లక్ష్యం “ప్రపంచ జీవ వైవిధ్య పరిరక్షణకు మరియు వాటి పర్యావరణ వ్యవస్థ భాగాలు, ప్రక్రియలు, ప్రయోజనాల నిర్వహణ ద్వారా మానవ జీవితాన్ని నిలబెట్టడానికి గాను ముఖ్యమైన చిత్త‌డి నేల‌ల‌ను  అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అభివృద్ధి చేసి నిర్వహించడం”. ఈ చిత్తడి నేలలు ఆహారం, నీరు, భూగర్భజల రీఛార్జ్, నీటి శుద్దీకరణ, వరద నియంత్రణ, కోత నియంత్రణ, వాతావరణ నియంత్రణ వంటి ముఖ్యమైన వనరులు మరియు పర్యావరణ వ్యవస్థల‌తో కూడిన వివిధ‌ సేవలను అందిస్తాయి. వాస్తవానికి ఇవి మేటి నీటి వనరులు, మంచినీటి ప్రధాన సరఫరా వ్య‌వ‌స్థ‌లు. వర్షపాత నిల్వ‌లు మరియు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి సహాయపడే చిత్తడి నేలల నుండి మంచి నీరు అందుబాటులోకి వ‌స్తుంది. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కేంద్ర పాలిత ప్రాంత చిత్త‌డి నేల‌ల నిర్వ‌హ‌ణ అథారిటీతో కలిసి ఈ ప్రాంతాన్ని మేటిగా ఉపయోగించుకునేలా చేస్తుంది.
                           

***


(Release ID: 1683418) Visitor Counter : 311