యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

8 రాష్ట్రాల్లో క్రీడా ప్రతిభా కేంద్రాలు ప్రారంభం

ఖేలో ఇండియా కార్యక్రమం కింద వర్చువల్ పద్ధతిలో
ప్రారంభించిన కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు.

నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, మిజోరాం,
ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఏర్పాటు

Posted On: 22 DEC 2020 8:33PM by PIB Hyderabad

   ఖేలో ఇండియా కారక్యక్రమం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 8 ప్రతిభా కేంద్రాలను (కె.ఐ.ఎస్.సి.ఇ.లను) కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి శ్రీ కిరెన్ రిజిజు మంగళవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల క్రీడా మంత్రుల సమక్షంలో ఆయన ఈ కేంద్రాలను ప్రారంభించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, కేరళ, తెలంగాణ, నాగాలాండ్, కర్ణాటక మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

https://ci5.googleusercontent.com/proxy/bHaykEJPrkw89hOVPNW1HQj0BXZZepCXCcwRQob365-ncoPlaWFAQIjwngwr6vBMIIieOBiISDteh1rvl9FIeRIhSq0RwVGX031EU02IXZsLYJ7Vp6AWD_6qpw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AKQZ.jpg

ఈ  కార్యక్రమానికి  కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బి ఎస్ యడ్యూరప్పతో పాటు అరుణాచల్ ప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి మమా నాతుంగ్,  నాగాలాండ్ యువజన, క్రీడా వ్యవహారాల సలహాదారు జలే నీఖా, మణిపూర్ క్రీడాశాఖ మంత్రి లెట్పావో హావోలిప్, మిజోరాం క్రీడా వ్యవహారాల మంత్రి ఎస్. రాబర్ట్ రోమావియా రాయ్తే, తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయి-ఎస్.ఎ.ఐ.)  డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి రవి మిటల్ తదితరులు  కూడా హాజరయ్యారు.

https://ci4.googleusercontent.com/proxy/j-Y1jAEijh8TCLrS7ILbRklZOiQjJQ80QLaUy7g90nYo9ruh5Ae7-kjZnoXfS0kIdDSvrnd71F6C3A5qISFlnFchZPb8BtJS5GL2pqXD9jRkOIRwp9hrCk35eA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00295Z8.jpg

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ, దేశ క్రీడారంగంలో ఇది చాలా ముఖ్యమైన రోజని అన్నారు. దేశంలో క్రీడా సంస్కృతి, క్రీడా ప్రతిభ అభివృద్ధికి ఈరోజు నాంది పలికినట్టయిందని అన్నారు. “క్రీడలకు సంబంధించి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకోసం యువత ఎంతో ఎదరుచూస్తోంది. ప్రతి భారతీయుడికీ క్రీడలు ఒక జీవన విధానం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు.  ఇందుకు ప్రతి ఒక్కరికీ తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం కూడా సంకల్పించింది. దేశంలోని జాతీయ ప్రతిభా కేంద్రాలకు అదనంగా ఖేలో ఇండియా రాష్ట్ర ప్రతిభా కేంద్రాలను ప్రారంభిస్తున్నాం.” అని రిజిజు అన్నారు.

  2028లో లాస్ ఏంజిలిస్ లో జరగనున్న ఒలింపిక్ క్రీడోత్సవంలో భారత్ ను 10 అగ్రశ్రేణి స్థానాల్లో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమన్నారు. "ఇందుకోసం కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయాలి. అవసరమైన ఆర్థిక సహాయాన్ని మేం అందిస్తాం. సరైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, క్రీడా విజ్ఞాన శాస్త్రం, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన శిక్షణ, తదితర అంశాలను వారు రూపొందించుకోవాలి. 2028 ఒలింపిక్స్ క్రీడల్లో ఒకటో రెండో పతకాలతో సంతృప్తి చెందడం కాదు. మనం పది అగ్రశ్రేణి దేశాల సరసన ఉండాలి.” అని కేంద్రమంత్రి అన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/CrKoO3gPt6v9PDM-t-cdgY24b1Nmo97h7lkphEl0b5mBbP2sNJ-EpOJxVprsEhG7YyFQwAr22HtpMorx-an4cp9Dhxp7XNfnnaUWsET6OJTQQ5ArqX8MY88XZQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003C5UK.jpg

ఖేలో ఇండియా రాష్ట్ర ప్రతిభా కేంద్రాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేసినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  బి.ఎస్. యడ్యూరప్ప కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో క్రీడా వాతావరణం నెలకొల్పడంతో కర్ణాటక ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందన్నారు. “బెంగళూరులోని జయప్రకాశ్ నారాయణ్ జాతీయ క్రీడా కేంద్రానికి ఖేలో ఇండియా రాష్ట్ర ప్రతిభా కేంద్రం కేటాయించినందుకు కేంద్ర క్రీడా వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి క్రీడాకేంద్రాలు, క్రీడా హాస్టళ్లు, ఇతర సంస్థలను మెరుగుపరిచేందుకు కర్ణాట ప్రభుత్వం ఎల్లపుడూ భారీ మొత్తంలోనే ఖర్చు పెడుతోంది. పతకాలు గెలిచే క్రీడాకారులందరికీ మేం మద్దతుగా నిలుస్తున్నాం. దేశం గర్వించదగిన మరింత మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులను ఇక్కడి క్రీడా ప్రతిభా కేంద్రం తీర్చిదిద్దగలదని నేను విశ్వసిస్తున్నాను.” అని యడ్యూరప్ప అన్నారు.

ఖేలో ఇండియా రాష్ట్ర ప్రతిభా కేంద్రాలుగా నవీకరించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 8 రాష్ట్రాల్లో గుర్తించిన కేంద్రాలు ఇవే.:

1. నాగాలాండ్- రాష్ట్ర క్రీడా అకాడమీ, ఐ.జి. స్టేడియం కొహిమా

2. మణిపూర్ - ఖుమాన్ లంపక్ క్రీడా సముదాయం, ఇంఫాల్

3. అరుణాచల్ ప్రదేశ్ - సంగే లాడెన్ క్రీడా అకాడమీ, చింపూ ఇటానగర్

4. మిజోరాం - రాజీవ్ గాంధీ స్టేడియం, ఐజాల్

5. ఒడిశా - కళింగ స్టేడియం, భువనేశ్వర్

6. తెలంగాణ - ప్రాంతీయ క్రీడా పాఠశాల హకీంపేట

7. కర్ణాటక - జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ యూత్ సెంటర్, బెంగళూరు

8. కేరళ - జి.వి. రాజా సీనియర్ సెకండరీ క్రీడా పాఠశాల, తిరువనంతపురం

   ఆయా క్రీడాల్లో ప్రతిభ చూపే క్రీడాకారులకు ప్రపంచ స్థాయి ప్రత్యేక శిక్షణను అందించేందుకు  ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ప్రతిభా కేంద్రాల్లో తగిన చర్యలు తీసుకుంటారు. క్రీడాకారులకు,.. వారికి కేటాయించిన క్రీడాంశంలో ప్రపంచ స్థాయి ప్రత్యేక శిక్షణను అందించేందుకు అత్యుత్తమైన కేంద్రాలుగా ఈ ప్రతిభా కేంద్రాలను తీర్చిదిద్దుతారు. 2028 ఒలింపిక్ క్రీడల్లో భారత్ ను 10 అగ్రశ్రేణి దేశాల జాబితాలో చేర్చాలన్న లక్ష్యంతో ఈ కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తారు. 

  క్రీడా ప్రతిభా కేంద్రాలుగా ఎంపికైన వివిధ రాష్ట్రాల్లోని ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల నవీకరణ, క్రీడా విజ్ఞాన శాస్త్ర కేంద్రాల ఏర్పాటు, నాణ్యత కలిగిన ప్రతిభావంతమైన కోచ్ ల నియామకం, ఫిజియో థెరపిస్టులు, ఇతర నిపుణుల ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటారు. ఈ కేంద్రాల్లో ఉన్నత ప్రమాణాలు కలిగిన మేనేజర్లను కూడా నియమిస్తారు. తమకు నిధులు అందిన ప్రతి క్రీడాంశానికి సంబంధించి ప్రతిభాపాటవాలున్న వారిని గుర్తించి, తగిన తర్ఫీదు ఇచ్చేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కృషిచేయనున్నందున మరింత విస్తృత దృక్పథంతో ప్రతిభా పాటవాలను గుర్తించేలా ఈ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు వీలుంటుంది.

 

*****



(Release ID: 1683195) Visitor Counter : 151