ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మీద మంత్రుల బృందం 22వ సమావేశానికి డాక్టర్ హర్ష వర్ధన్ ఆధ్యక్షత


భారత్ లో కోవిడ్ వ్యాప్తి 2శాతానికి తగ్గుదల; మరణాల శాతం ప్రపంచంలోనే అతి తక్కువగా 1.45%

ముందుగా 30 కోట్ల జనాభాకు టీకాలివ్వటానికి సిద్ధం కావాలి: డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 19 DEC 2020 1:20PM by PIB Hyderabad

ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19 మీద జరిగిన మంత్రుల బృందం సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఆధ్యక్షత వహించారు. ఆయనతోబాటు విదేశాంగ వ్యవహారాలశాఖకు చెందిన డాక్టర్ ఎస్. జైశంకర్,  పౌర విమానయాన శాఖకు చెందిన శ్రీ ఎస్ హర్దీప్ పూరి,రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే, హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్,  నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్తర్ వినోద్ కె పాల్, ప్రధాని సలహాదారులు శ్రీ అమర్ జీత్ సిన్హా, శ్రీ భాస్కర్ ఖుల్బె కూడా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

కోవిడ్ సంక్షోభ సమయంలో నిస్వార్హ సేవలందించిన పొరాట యోధులకు ధన్యవాదాలు తెలియజేయటతో డాక్టర్ హర్ష వర్ధన్ తన ప్రసంగం ప్రారంభించారు. దేశ ప్రజారోగ్య వ్యవస్థ ఈ 12 నెలల కాలంలో ఎన్ని ఫలితాలు సాధించిందో వివరించారు.   కరోనా విస్తరణ వ్యాప్తి 2 శాతానికి తగ్గిపోయిందని, వ్యాధిబారిన పడిన వారిలో మరణాలు 1.45% మాత్రమే ఉండటం ప్రపంచంలోనే అత్యల్పమని చెప్పారు.  కోలుకున్నవారి శాతం అత్యధికంగా 95.46% ఉందని కూడా ప్రస్తావించారు. కరోనా నిర్థారణ పరీక్షలు భారీగా పెంచాలన్న వ్యూహానికి అనుగుణంగా రోజుకు 10 లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించటంతో పాజిటివ్ శాతం 6.25% కు పడిపోయిందని చెప్పారు.  

అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగల సీజన్ వచ్చినప్పటికీ కోవిడ్ కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ కానరాలేదన్నారు. పరీక్షించటం, ఆనవాలు పట్టటం, చికిత్స అందించటం అన్ని త్రిముఖ వ్యూహం ఫలించటం వల్ల వ్యాధిని సకాలంలో నియంత్రించగలిగామన్నారు. మంత్రుల బృందానికి అధ్యక్షుని హోదాలో మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కోవిడ్ నివారణ క్రమంలో వాక్సిన్ పూర్తిగా అందేదాకా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందు అత్యవసరంగా 30 కోట్లమందికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు

.

ఎన్ సి డి సి డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె సింగ్ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ప్రభుత్వ విధానాలు ఎలాసహాయపడ్దాయో వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.  మొత్తం పాజిటివ్ కేసులు, వాటి పెరుగుదల, మరణాలు తదితర గణాంకాలను పోల్చి చెబుతూ ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు భారత్ ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నదో వివరించారు. ఒక్కో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిన తీరును, వివిధ పరీక్షల సంఖ్యను, కొన్ని ప్రాంతాలలో వ్యాధి కేంద్రీకృతమైన పరిస్థితిని, అస్పత్రిలో చేరిన తరువాత ఎంత సమయంలో ప్రాణాలు కొల్పోయినవారు ఎంతమంది లాంటి గణాంకాలను తెలియజెప్పారు.  

వాక్సిన్ ఇవ్వటంలో ఎదురుకాబోయే కీలకమైన అంశాలను నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వినోద్ కె పాల్ సవివరంగా తెలియజేశారు. వాక్సిన్ల క్లినికల్ పరీక్షల ప్రక్రియ, ప్రస్తుతం భారత్ లో ట్రయల్స్ లో ఉన్న ఆరు రకాల వాక్సిన్లు, వాటి తయారీదారులు, సాంకేతిక భాగస్వాములు, డోసుల సంఖ్య, నిల్వ కు అనుకూల పరిస్థితులు, సామర్థ్యం, వయసు, వృత్తి, ఎదుర్కొంటున్న ఇతర వ్యాధుల పరంగా ముందుగా టీకాలు ఇవ్వాల్సిన ప్రజల సమాచారం తదితర అంశాలను అందులో తెలియజేశారు.  ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులను కూడా ప్రస్తావించారు. మరో పన్నెండు దేశాల నుంచి వాక్సిన్ కోసం విజ్ఞప్తులు అందాయని కూడా మంత్రుల బృందానికి తెలియజేశారు.

కేంద్ర ఆరోగ్య శాఖమ్ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ మాట్లాడుతూ, ఆరోగ్యం పట్ల ప్రజల అప్రమత్తతే ఈ వ్యాధి నియంత్రణకు ప్రధాన సహాయకారి అన్నారు. అదే ప్రధానంగా మరణాల సంఖ్యను అదుపు చేయగలిగిందన్నారు. కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండి కూడా మరణాల సంఖ్య నామమాత్రంగా ఉందని , మరికొన్ని రాష్ట్రాలలో పాజిటివ్ కేసులు తక్కువే అయినా మరణాల శాతం ఎక్కువగా నమోదైందని గుర్తు చేశారు. అక్కడున్న చురుకైన ప్రజారోగ్య వ్యవస్థ, ప్రజల అప్రమత్తతలో ఉండే తేడాలే ఇందుకు కారణమయ్యాయన్నారు. దూకుడుగా పరీక్షలు  పెంచటం ద్వారా ఎక్కువ కేసులు నమోదైనప్పటికీ మరణాల సంఖ్యను తగ్గించటం సాధ్యమైందన్నారు. పరీక్షల సంఖ్య పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జౌళి శాఖ కార్యదర్శి శ్రీ రవి కపూర్, ఫార్మా కార్యదర్శి కుమారి ఎస్. అపర్ణ, నీతి ఆయోగ్  సీఈవో అమితాబ్ కాంత్,  హోం వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ గోవిడ్ మోహన్,  విదేశాంగ వ్యవహారాల అదనపు కార్యదర్శి శ్రీ దమ్ము రవి,   విమానయాన డైరెక్టర్ జనరల్ శ్రీ అరుణ్ కుమార్, విదేశీ వర్తక విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీ అమిత్ యాదవ్,  డిజిహెచ్ ఎస్ శ్రీ సునీల్ కుమార్ పలువురు సీనియర్ ప్రభుత్వాధికారులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత వైద్య పరిశోధనామండలి తరఫున డాక్టర్ సమీరన్ పాండా పాల్గొన్నారు.   

****



(Release ID: 1681971) Visitor Counter : 198