మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్, రాంపూర్ లో 2020 డిసెంబర్, 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించే, “హునార్ హాత్” కార్యక్రమాన్ని ప్రారంభించిన - కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
18 DEC 2020 7:23PM by PIB Hyderabad
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాంపూర్ (యు.పి) లోని పన్వాడియాలోని నుమాయిష్ మైదానంలో, 2020 డిసెంబర్, 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న “హునార్ హాత్” కార్యక్రమాన్ని, కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో - కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ; ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా; ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, ఎమ్.ఎస్.ఎమ్.ఈ. శాఖల మంత్రి శ్రీ సిద్ధార్థ్ నాథ్ సింగ్; జల్ శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బల్దేవ్ సింగ్ ఔలఖ్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ, దేశ సర్వతోముఖాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధి తప్పనిసరనీ, ఈ విషయంలో “హునార్ హాత్” ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోందనీ, పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా అద్భుతంగా చేతితో తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులు, రాంపూర్ లోని “హునార్ హాత్” వద్ద అందుబాటులో ఉన్నాయని శ్రీ గడ్కరీ తెలియజేశారు. దేశవ్యాప్తంగా గ్రామాల్లోని ముఖ్యంగా ప్రతిభావంతులైన కళాకారులు, హస్తకళాకారులకు, "హునార్ హాత్", సమర్థవంతమైన వేదికను అందిస్తోంది. ఈ దేశీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలోకి చేరుకున్నప్పుడు, మన హస్త కళాకారులు సంపన్నులవుతారు, అప్పుడే మన కల సాకారమౌతుంది.
"ఆత్మ నిర్భర్ భారత్" పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నిబద్ధతను నెరవేర్చడానికి, ఎం.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంయుక్తంగా, కృషి చేస్తాయని శ్రీ గడ్కరీ అన్నారు. “హునార్ హాత్” ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను అందించడానికి ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ సమన్వయంతో పనిచేస్తాయని, ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీ సక్సేనా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న చేతివృత్తులవారు, హస్తకళాకారులు తమ ప్రతిభను “హునార్ హాత్” లో ప్రదర్శిస్తున్నారని, చెప్పారు. "హునార్ హాత్" అవసరమైన చేతివృత్తులవారికి మరియు హస్తకళాకారులకు మంచి జీవనోపాధిని కల్పించిందని అయన అన్నారు.
శిల్పకళాకారులు, హస్తకళాకారుల పూర్వీకుల వారసత్వానికి “హునార్ హాత్” సమర్థవంతమైన వేదికను అందించిందని శ్రీ సక్సేనా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, శ్రీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న “హునార్ హాత్”, చేతివృత్తులవారికి, హస్తకళాకారులకు మార్కెట్లను అందించడానికి సరైన వేదిక, అని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి "వోకల్ ఫర్ లోకల్" స్వప్నాన్ని, "హునార్ హాత్" సాకారం చేస్తోంది. “ఒక జిల్లా - ఒక ఉత్పత్తి” ప్రచారాన్ని బలోపేతం చేయడంలో “హునార్ హాత్” కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
ప్రధాన చేతివృత్తులవారు, హస్తకళాకారుల స్వదేశీ ఉత్పత్తులకు ప్రచారం కల్పించి, ప్రోత్సహించడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క "ఆత్మ నిర్భర్ భారత్" మిషన్ మరియు "ఓకల్ ఫర్ లోకల్" నిబద్ధతను బలోపేతం చేయడానికి "హునార్ హాత్" సమర్థవంతమైన వేదికగా నిరూపించబడిందని శ్రీ నఖ్వీ పేర్కొన్నారు.
రాంపూర్ లోని “హునార్ హాత్” వద్ద ప్రముఖ హస్త కళాకారుల స్వదేశీ ఉత్పత్తులు ప్రధాన ఆకర్షణ అని శ్రీ నఖ్వీ అన్నారు. వీటితోపాటు, ఈ “హునార్ హాత్” వద్ద దేశంలోని దాదాపు ప్రతి మూల ప్రాంతానికి చెందిన సాంప్రదాయ రుచికరమైన ఆహార పదార్ధాలు కూడా సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, ప్రఖ్యాత కళాకారులు ప్రతిరోజూ ప్రదర్శించే “జాన్ భీ, జహాన్ భీ” అనే అంశంపై విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక ప్రధాన ఆకర్షణ కానున్నాయి. మత సామరస్యం మరియు దేశం యొక్క “భిన్నత్వంలో ఏకత్వం” అనే భావనలకు ప్రతీకగా ఈ “హునార్ హాత్” ఒక మంచి సందర్భంగా నిలుస్తుంది.
శ్రీ నఖ్వీ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, నాగాలాండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, లడఖ్, కర్ణాటక, గుజరాత్, హర్యానా, జమ్మూ-కశ్మీర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, కేరళతో పాటు దేశంలోని ఇతర ప్రదేశాలకు చెందిన ప్రముఖ చేతివృత్తుల వారు, హస్త కళాకారులు, కలప, ఇత్తడి, వెదురు, గాజు, వస్త్రం, కాగితం, బంకమట్టి మొదలైన వాటితో తయారు చేసిన దేశీయ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు.
చెక్క మరియు బంకమట్టి బొమ్మలు, పోస్టల్ పెయింటింగ్, మెటల్ క్రాఫ్ట్, ఆభరణాలు, ఖాదీ ఉత్పత్తులు, రాంపూరి కత్తి, రాంపూరి వయోలిన్, నల్ల కుండలు, మూలికా ఉత్పత్తులు, పొడి పువ్వులు, చెక్కతో, ఇనుముతో చేసిన హస్తకళా వస్తువులు, ఆయిల్ పెయింటింగ్, ఐరన్ ఆర్ట్ వర్కు, బాగ్ ప్రింట్, కేన్ మరియు వెదురు ఉత్పత్తులు వంటి అద్భుతమైన చేనేత ఉత్పత్తులు, రాంపూర్ లోని “హునార్ హాత్” వద్ద ఒకే పైకప్పు క్రింద లభిస్తాయని, శ్రీ నఖ్వీ చెప్పారు.
డిసెంబర్ 18 మరియు 19 తేదీలలో, రాంపూర్ లోని “హునార్ హాత్” లో సుశీల్ జీ మహారాజ్ రాసిన “శ్రీ రామ్ రాజ్య” అనే అంశంపై మనోహరమైన రామ్ లీలా ప్రదర్శించబడుతుంది. వీటితో పాటు - సంగీతం మరియు ఇతర కళా రంగాలలో ప్రముఖ, సుప్రసిద్ధ కళాకారులైన రేఖా రాజ్ మరియు ప్రేమ్‌భటియా (డిసెంబర్, 20వ తేదీ); భూపేంద్ర సింగ్ భుప్పి (డిసెంబర్, 20వ తేదీ); స్మితా రావు బెల్లూరు (డిసెంబర్, 21వ తేదీ); అస్లాం సబ్రి (డిసెంబర్, 22వ తేదీ); షిబాని కశ్యప్ (డిసెంబర్, 23వ తేదీ); రాజు శ్రీవాస్తవ (డిసెంబర్, 24వ తేదీ); అహ్సాన్ ఖురేషి (డిసెంబర్, 25వ తేదీ); హమ్సర్ హయత్ నిజామి (డిసెంబర్, 26వ తేదీ); మొదలైనవారు, “హునార్ హాత్” లో ప్రతిరోజూ నిర్వహించే, విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనున్నారు. డిసెంబర్, 27వ తేదీన, “కవి సమ్మేళనం” నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో - డాక్టర్ అనామిక అంబర్, పాపులర్ మెరథి, డాక్టర్ సునీల్ జోగి, డాక్టర్ సురేష్ అవస్థీ, నిఖాత్ అమ్రోహవి, శంభు శిఖర్, మన్వీర్ మాధుర్, డాక్టర్ సరిత శర్మ, మంజర్ భోపాలి, సుదీప్ భోలా, గజేంద్ర సోలంకి, వంటి ప్రముఖ కవులు, తమ కవితలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
రాంపూర్ వద్ద “హునార్ హాత్” వర్చువల్ మరియు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ http://hunarhaat.org లో కూడా లభిస్తుందని శ్రీ నఖ్వీ చెప్పారు. దేశ, విదేశాల్లోని ప్రజలు డిజిటల్ మరియు ఆన్‌లైన్‌లో కూడా “హునార్ హాత్” ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
గత 5 సంవత్సరాలలో 5 లక్షల మంది భారతీయ కళాకారులు, హస్తకళాకారులు, పాక నిపుణులు మరియు వారితో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించిన “హునార్ హాత్” ప్రజలలో ప్రాచుర్యం పొందిందని శ్రీ నఖ్వీ అన్నారు.
తదుపరి “హునార్ హాత్” 2021 జనవరి, 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు లక్నో (యు.పి) లోని శిల్పాగ్రామంలో “వోకల్ ఫర్ లోకల్” అనే ఇతివృత్తంతో నిర్వహించబడుతుంది. లక్నోలో నిర్వహించబోయే “హునార్ హాత్” ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభిస్తారు.
రాబోయే రోజుల్లో జైపూర్, చండీగఢ్, ఇండోర్, ముంబై, హైదరాబాద్, ఇండియా గేట్-న్యూ ఢిల్లీ, రాంచీ, కోటా, సూరత్/అహ్మదాబాద్, కొచ్చి మరియు ఇతర ప్రదేశాలలో “హునార్ హాత్” నిర్వహించనున్నట్లు శ్రీ నఖ్వీ తెలిపారు.
****
(Release ID: 1681886)
Visitor Counter : 175