ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
క్షయ, ఛాతీవ్యాధుల 75వ జాతీయ సదస్సులో ప్రసంగించిన డాక్టర్ హర్ష వర్ధన్
క్షయ వ్యాధిగ్రస్తుల పౌష్ఠికాహారం కోసం నిక్షయ్ పోషణ్ యోజన
కింద రూ. 886 కోట్లకు పైగా నేరుగా నగదు బదలీ
Posted On:
18 DEC 2020 8:00PM by PIB Hyderabad
క్షయ, ఛాతీవ్యాధుల జాతీయ సదస్సు ( నాట్కాన్) ప్లాటినం జుబిలీ వేడుకలలో భాగంగా జరిగిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ప్రసంగించారు. క్షయ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించటానికి నివారణ, బాధితులకు నాణ్యమైన చికిత్స ద్వారా ముందడుగు వేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. 1939 లో సంస్థ ఏర్పాటైనప్పటినుంచి దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా భారత క్షయ సంఘం అందిస్తున్న నిస్వార్థమైన సేవలను మంత్రి కొనియాడారు. కోవిడ్ సంక్షోభ సమయంలో క్షయ నిర్మూలనా యోధులుగా చేసిన కృషి దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సిబ్బంది అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ, పరిమాణాత్మకంగాను, విస్తృతి పరంగాను తమ ప్రభుత్వం ముందెన్నడూ లేనంతగా కృషి చేస్తున్నదన్నారు. క్షయ వ్యాధిని ప్రత్యేకమైన వ్యాధిగా గుర్తించటం వలన వ్యాధిగ్రస్తుల గుర్తింపులో పురోగతి సాధించి నియంత్రణలోనూ ఫలితాలు రాబట్టగలిగామన్నారు. లెక్కలోకి రాకుండా మిస్సయిన కేసులను బాగా గుర్తించగలగటం కూడా ఈ ఫలితాలకు కారణమని చెప్పారు. 2017 లో పది లక్షల కేసులు గల్లంతయ్యాయని, 2019 నాటికి ఈ సంఖ్యను 2.4 లక్షలకు తగ్గించగలిగామని చెప్పారు. ప్రైవేట్ రంగంలో 2019లో 7 లక్షల కేసులు నమోదయ్యాయని, వారు కూడా వ్యాధి నియంత్రణలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని డాక్టర్ డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగ ప్రస్తావించారు.
ఉద్యమస్థాయిలో క్షయవ్యాధి నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ, కేవలం వ్యాధి గ్రస్తులను మాత్రమే దీనికి సంబంధించిన ఇతర వ్యాధులున్నవారిని కూడా గమనిస్తూ ఉన్నామని చెప్పారు. నిక్షయ పోషణ్ యోజన కింద క్షయవ్యాధి గ్రస్తులకు పౌష్ఠికాహారం కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. రోగుల ఖర్చు భారం తగ్గించటానికే ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇదే కాకుండా, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్సపొందుతున్నవారికి కూడా ఉచితంగా మందులు, నిర్థారణ పరీక్షల సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మొత్తం చికిత్సాకాలమంతా పౌష్ఠికాహార సదుపాయం కల్పించటానికి కూడా ఏర్పాటు జరిగిందన్నారు. ఇప్పటివరకు క్షయ వ్యాధిగ్రస్తుల కోసం పౌష్ఠికాహారం కోసం రూ. 886 కోట్ల రూపాయలు ప్రత్యక్ష నగదు బదలీ ద్వారా పంపిణీ చేశామని వెల్లడించారు.
క్షయ వ్యాధి నివారణ గురించి మాట్లాడుతూ, ఆస్పత్రులలో వార్డులలోను, ఔట్ పేషెంట్ విభాగాల్లో బాధితులు వేచి ఉండే ప్రాంతంలోను గాలిద్వారా ఇన్ఫెక్షన్ సోకకుండా నియంత్రించటం మీద దృష్టి సారించామని చెప్పారు. క్షయ వ్యాధి సోకే అవకాశమున్నవారిని గుర్తించి వాళ్ళకు ముందస్తు చికిత్స అందించటానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
క్షయ వ్యాధి నివారణలో సాధించిన ఫలితాలను కాపాడుకోవటానికి కోవిడ్ అతిపెద్ద అవరోధంగా మారిందని గుర్తు చేస్తూ, ఈ సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. క్షయ వ్యాధి సంబంధ కార్యకలాపాలను పునరుద్ధగలిగామన్నారు. వ్యాధి నిర్థారణ కోసం క్షయ, కోవిడ్ వ్యాధుల పరీక్షలు రెండూ జరపాల్సి రావటాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.
జాతీయ క్షయవ్యాధి నిర్మూలనాపథకం కింద క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించటంలో 2018 లో 18%, 2019 లో 12% పెరుగుదల కనిపించిందన్నారు. క్షయ వ్యాధి పరిశోధనమీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. భారత వైద్య పరిశోధనామండలి, భారత క్షయ పరిశోధనా బృందం ఉమ్మడిగ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు సాగిస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు. వ్యాధి నిర్థారణ, చికిత్స, టీకాలు తదితర అంశాలు ఈ పరిశోధనలో భాగమయ్యాయన్నారు. ఐదు లక్షల శాంపిల్స్ తో ప్రభుత్వం అతి పెద్ద జాతీయ క్షయవ్యాధి గ్రస్తుల సర్వే నిర్వహిస్తున్నదన్నారు,
క్షయ, ఛాతీ వ్యాధులకు సంబంధించిన పలువురు నిపుణులను ఒక చోటికి చేర్చి శాస్త్రీయ చర్చలకు వేదిక కల్పించినందుకు నిర్వాహకులను అభినందిస్తూ డాక్టర్ హర్ష వర్ధన్ తన ప్రసంగాన్ని ముగించారు. 2025 నాటికి దేశాన్నుంచి క్షయ వ్యాధిని తరిమేసే లక్ష్యంతో విజ్ఞానాన్ని పంచుకోవటానికి, ఆధునిక పరిణామాలమీద చర్చించుకోవటానికి సదస్సు ఉపయోగపడిందన్నారు. ఈ మూడు రోజుల వర్చువల్ సదస్సును ఇండోర్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్, భారత టీబీ అసోసియేషన్ లో భాగమైన మధ్యప్రదేశ్ టీబీ అసోసియేషన్ ఉమ్మడిగా నిర్వహించాయి.
*****
(Release ID: 1681868)
Visitor Counter : 363