ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నుంచి భారత ఆర్ధిక పునరుద్ధరణ కోసం ఎంఎన్ఇఆర్‌జి
పథకంద్వారా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం-ఎన్‌డీబీల మధ్య 1,000 మిలియన్ డాలర్ల ఒప్పందం
Posted On:
16 DEC 2020 5:30PM by PIB Hyderabad
‘కోవిడ్-19 ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం’ దిశగా 1,000 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంపై కేంద్ర ప్రభుత్వం-నవ్యాభివృద్ధి బ్యాంకు (ఎన్‌డిబీ) మధ్య రుణ ఒప్పందంపై ఇవాళ సంతకాలు పూర్తయ్యాయి. ఈ ఒప్పందం కింద సహజ వనరుల నిర్వహణ (ఎన్‌ఆర్‌ఎం) సంబంధిత గ్రామీణ మౌలిక వసతుల కల్పనతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజిఎన్ఆర్ఇజి) పథకం కింద గ్రామీణ ఉపాధి సృష్టికి అవసరమైన వ్యయాలకు మద్దతు లభిస్తుంది.
ప్రజా సంచారంపై దేశవ్యాప్త ఆంక్షలు, వీటికితోడు కోవిడ్19 వ్యాప్తి నిరోధానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కఠిన పరిమితులేగాక అడపాదడపా స్థానికంగా అమలు చేసిన దిగ్బంధాలతో దేశీయంగా డిమాండ్-సరఫరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫలితంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో గ్రామీణ ప్రాంతాలుసహా ప్రత్యేకించి... సంప్రదాయేతర రంగాల కార్మికులు ఉపాధిని, ఆదాయాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారి సృష్తించిన ప్రతికూల ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడంలో ఈ కార్యక్రమం ప్రభుత్వానికి తోడ్పడటంతోపాటు కింద పేర్కొన్న రూపంలో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పునరుద్ధరణకు వీలు కల్పిస్తుంది:
- ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడే సహజ వనరుల నిర్వహణ పనులు;
- కోవిడ్-19 వ్యాప్తివల్ల సంభవించిన ఆర్థిక కార్యకలాపాల క్షీణతను ఎదుర్కొనే దిశగా గ్రామీణ డిమాండును ఉత్తేజితం చేయగల ఉపాధి సృష్టి.
సహజ వనరుల నిర్వహణ (ఎన్ఆర్ఎం)కు సంబంధించిన దీర్ఘకాలి మన్నికగల గ్రామీణ మౌలిక ఆస్తుల సృష్టితోపాటు గ్రామీణ పేదలకు- ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయి పట్టణ/నగర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస శ్రామికులకు ఉపాధి కల్పంచడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. దీనికి సంబంధించి కుదిరిన ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వశాఖలోని ద్రవ్య వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ బల్‌దేవ్ పురుషార్థ్, ఎన్‌డీబీ తరఫున ఉపాధ్యక్షుడు, ముఖ్య కార్యకలాపాల అధికారి (సీఓఓ) షియాన్ ఝూ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పురుషార్థ్ మాట్లాడుతూ- గ్రామీణ పేదలకు ఉపాధిసహా కోవిడ్-19 మహమ్మారి వల్ల జీవనోపాధి కోల్పోయి పట్టణ ప్రాంతాలనుంచి స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికులకు ఆదాయార్జన అవకాశాలను మెరుగుపరుస్తుందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక అంతరాయాలను అధిగమించి డిమాండును ఉత్తేజపరిచే దిశగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఎన్‌డిబీ సకాలంలో అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతగానో తోడ్పడుతుందని శ్రీ పురుషార్థ్ వివరించారు.
కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన ప్రతికూల ఆర్థిక ప్రభావం ఉపశమనానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని షియాన్ ఝ చెప్పారు. అంతేగాక ఎన్ఆర్ఎం పనులు, ఉపాధి కల్పన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పునరుద్ధరణకు వీలు కలుగుతుందని తెలిపారు. కోవిడ్-19కు అత్యవసర ప్రతిస్పందనపై ఎన్‌డీబీ విధానం కింద నిధుల మంజూరుతో గ్రామీణ ఆదాయ పరిరక్షణ, గ్రామీణ వ్యయాల కొనసాగింపునకు తోడ్పాటు లభిస్తుంది. తద్వారా డిమాండ్ పెరిగి, ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడుతుంది.
బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా సమాఖ్య, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) మధ్య అంతర-ప్రభుత్వ ఒప్పందంపై 2014 జూలై 15న సంతకాలు పూర్తయిన నేపథ్యంలో నవ్యాభివృద్ధి బ్యాంకు (NDB) ఏర్పాటైంది. వర్ధమాన దేశాలు, వికసిస్తున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో మౌలిక సదుపాయాలు, సుస్థిర ప్రగతి పథకాల కోసం వనరుల సమీకరణ లక్ష్యంగా ఈ బ్యాంకు రూపుదిద్దుకుంది. కాగా, ఎన్‌డిబీ నుంచి లభించే ఈ బిలియన్ డాలర్ల రుణ ఒప్పందానికి 5 సంవత్సరాల అదనపు కాలపరిమితిసహా 30 ఏళ్లపాటు అమలులో ఉంటుంది.
***
(Release ID: 1681334)
Visitor Counter : 151