రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్రారంభం, భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఒక "వాటర్ షెడ్" ఉద్యమంగా నిలిచింది : రక్షణ మంత్రి

Posted On: 14 DEC 2020 7:10PM by PIB Hyderabad

భారత పరిశ్రమల సమాఖ్య, ఫిక్కీ 93వ వార్షిక సదస్సును ఉద్దేశించి, కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, న్యూ ఢిల్లీ లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ,  కోవిడ్ -19 మహమ్మారి దేశానికి అనేక కొత్త సవాళ్లను తెచ్చిపెట్టిందనీ,  జీవితాలు మరియు జీవనోపాధి రెండింటిపై, దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందనీ, పేర్కొన్నారు.   ప్రాణాలను కాపాడటానికి ముందుగా అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందనీ,  ప్రాణనష్టం తగ్గించడానికి, వైద్య సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేసిందనీ,  ఆయన తెలియజేశారు.  

ఆర్థిక రంగంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను శ్రీ రాజనాథ్ సింగ్ ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా లాక్డౌన్ తరువాత, జి.డి.పి.లో 23.9 శాతం సంకోచాన్ని తిప్పికొట్టడానికి భారతదేశానికి ఒకటి లేదా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పడుతుందని చెప్పగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ఇది సాధ్యమైందని, పేర్కొన్నారు. "అయితే, భారతదేశం చాలా తక్కువ సమయంలో నిలదొక్కుకుంది. రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ జి.డి.పి. లో 7.5 శాతం సంకోచాన్ని నమోదు చేసింది. అదేవిధంగా, ఉత్పాదక రంగం మొదటి త్రైమాసికంలో 39.3 శాతం సంకోచం నమోదుచేయగా, రెండవ త్రైమాసికంలో 0.6 శాతం వృద్ధిని నమోదు చేసింది.” అని అయన చెప్పారు.  ఈ అభివృద్ధి తరువాత, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి), 2020-21 లో భారత ఆర్థిక వ్యవస్థ కోసం ప్రకటించిన తన అంచనా క్షీణతను 9 శాతం నుండి 8 శాతానికి తగ్గించిందని, శ్రీ రాజ్ నాథ్ సింగ్ తెలియజేశారు. 

ఆర్థిక వ్యవస్థ పటిష్టత గురించి రక్షణ మంత్రి ప్రత్యేకంగా పేర్కొంటూ, 2020 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 35.73 బిలియన్ యుఎస్ డాలర్ల మేర గరిష్టంగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.‌డి.ఐ) లభించాయనీ, ఇది, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో లభించిన దానికంటే 13 శాతం ఎక్కువనీ, తెలిపారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వం మరియు ప్రభుత్వం సకాలంలో చేపట్టిన విధానాల అమలుద్వారా మార్గనిర్దేశం చేయబడి, ‘ప్రేరణ పొందిన భారతదేశం’ సహాయంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి.” అని, శ్రీ రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

"... ప్రపంచ ఉత్పాదక వ్యయాలను తగ్గించడానికి, తదుపరి అవకాశాలను చేపట్టండి. త్వరలో భారతదేశం ప్రపంచ తయారీ కేంద్రంగా రూపొందించడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించండి." అని రక్షణ మంత్రి పరిశ్రమ వర్గాలను కోరారు.

ఆత్మ నిర్భర్ భారత్ చర్యల దిశగా మరియు ఆర్థికాభివృద్ధి పునరుజ్జీవనం కోసం రక్షణ రంగం గణనీయమైన పాత్ర పోషిస్తుందని,  శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.  "ప్రపంచంలోని అతి పెద్ద సాయుధ దళాలలో ఒకటిగా, మనం క్లిష్టమైన ప్రాంతాలలో దిగుమతి-ఆధారితంగా ఉండటం అంత ఓదార్పునిచ్చే విషయం కాదు.  రక్షణ ఉత్పత్తిలో మనం కొంత ముఖ్యమైన ప్రగతి సాధించినప్పటికీ, మనం ఇంకా ఎక్కువ చేయగలం, తప్పక చేయాలి.” అని,  కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

రక్షణ మంత్రి మాట్లాడుతూ “మనం ప్రైవేటు రంగానికి తగిన అవకాశాలు కల్పించడం ద్వారా, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాము. రక్షణ కారిడార్లను సృష్టించడంతో పాటు, మరెన్నో చేస్తున్నాము.  అర్ధవంతమైన జాయింట్ వెంచర్లతో పాటు, ఇతర దేశాలతో భాగస్వామ్యంలో పాల్గొనడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము.” అని వివరించారు. 

ఆటోమేటిక్ రూట్ ద్వారా రక్షణ రంగంలో ఎఫ్.‌డి.ఐ. ని 74 శాతానికి పెంచాలని ఇంతకుముందు తీసుకున్న నిర్ణయంతో పాటు కొత్త రక్షణ పరికరాల సేకరణ విధానం, దేశీయ తయారీ, అభివృద్ధికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు మరియు ప్రపంచ ఉత్తమ పద్ధతుల అమలుతో ప్రేరణనిస్తుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశీయ తయారీని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో 101 వస్తువుల దిగుమతిని నిషేధిస్తూ జాబితాను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.  ఇది ముఖ్యంగా ప్రైవేటు రంగం, రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రక్రియలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుందనీ,  ఫలితంగా, 1,75,000 కోట్ల రూపాయల టర్నోవర్ తో పాటు,   35,000 కోట్ల రూపాయల మేర ఎగుమతులను సాధించడంలో ప్రైవేటు రంగం చురుకుగా పాల్గొంటుందనీ, ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రక్షణ మంత్రి మాట్లాడుతూ, 2020 మే నెలలో ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ, దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించిందని చెప్పారు.  ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి పెద్ద ప్రేరణనివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ ప్యాకేజీ ప్రకటించడం జరిగిందని, రక్షణ మంత్రి పేర్కొంటూ,  "ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రారంభం, భారత ఆర్థికవ్యవస్థ చరిత్రలో ఒక "వాటర్ షెడ్" ఉద్యమంగా నిలిచింది" అని వ్యాఖ్యానించారు. 

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద దాదాపు 81 లక్షల ఎం.ఎస్.‌ఎం.ఈ. లు ప్రధానమంత్రి అత్యవసర రుణహామీ పధకం (ఈ.సి.ఎల్.‌జి.ఎస్) ను సద్వినియోగం చేసుకున్నాయని ఆయన చెప్పారు.

కోవిడ్ -19 సంక్షోభం నుంచి తనకు తాను బయటపడటానికి సహాయం చేసుకోవడంతో పాటు, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయం చేసిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.  "ఇది తరలింపు, లేదా మందుల సరఫరా, లేదా మరే సహాయం అయినా, భారతదేశం ప్రతి ఒక్కరినీ తనతో పాటు ముందుకు తీసుకువెళుతోంది." భారతదేశం స్వయంగా ప్రేరణ పొందడంతో పాటు, ఇతరులు కూడా పునరుజ్జీవింపబడటానికీ, సహాయపడటానికీ, ప్రేరేపించిందని, ఆయన చెప్పారు. "భారతదేశానికి స్వీయ ప్రేరణ ఉంది, ఇది  'संगच्छध्वंसंवदध्वं', రూపంలో అంటే - 'మనమందరం కలిసి వెళ్దాం, మనమందరం కలిసి ముందుకు కదులుదాం" అనే ఆశయంతో శతాబ్దాలుగా మనలో పొందుపరచబడి ఉంది. 

వ్యవసాయ రంగ సంస్కరణల గురించి రక్షణ మంత్రి మాట్లాడుతూ, భారతదేశ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే, వాటిని చేపట్టినట్లు చెప్పారు. ఏదేమైనా, మన రైతు సోదరులు చెప్పే విషయాలు వినడానికీ, వారి అనుమానాలను తొలగించడానికీ, అవసరమైన హామీలను అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొంటూ,  "మా ప్రభుత్వం ఎల్లప్పుడూ చర్చలకూ, సమావేశాలకూ సిద్ధంగా ఉంటుంది." అని ఆయన పునరుద్ఘాటించారు.

హిమాలయ సరిహద్దులపై ఎటువంటి హెచ్చరికలు లేకుండాచేసిన కవ్వింపు చర్యల గురించి, రక్షణ మంత్రి, ప్రస్తావిస్తూ, లడఖ్‌ లోని నియంత్రణ రేఖ వద్ద సాయుధ దళాలు భారీగా మోహరించబడి ఉన్నాయి.  “అయితే, ఈ పరీక్ష సమయాల్లో మన దళాలు ఆదర్శప్రాయమైన ధైర్య, సాహసాలను ప్రదర్శించి,  పి.ఎల్.ఏ. తో చాలా ధైర్యంతో పోరాడి, వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేలా చేశాయి.” అని ఆయన చెప్పారు.  ఎవరు ఎంత ఎక్కువగా సైనిక శక్తిని కలిగి ఉన్నారనే దానిపై తీవ్రమైన చర్చ జరగవచ్చు, కాని మేధా శక్తి విషయానికి వస్తే ఎటువంటి అనుమానానికి తావు లేదని, రక్షణ మంత్రి పేర్కొంటూ,  "ఆలోచనలతో ప్రపంచాన్ని నడిపించే విషయంలో, భారతదేశం చైనా కంటే చాలా ముందుంది." అని స్పష్టం చేశారు.

సరిహద్దు ఉగ్రవాదంపై శ్రీ రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ,  భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి ఎవరూ లేనప్పుడు కూడా, మనం దానిని ఎదుర్కోడానికి ఒంటరిగానే పోరాడామనీ,  అయితే, ఆ తరువాత, ఈ ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్ర బిందువుగా ఉందని మనం చెప్పిన విషయాన్ని, ప్రపంచం అర్థం చేసుకుందనీ, వివరించారు.

*****




(Release ID: 1680700) Visitor Counter : 154