హోం మంత్రిత్వ శాఖ

మాన‌వ హ‌క్కుల దినోత్స‌వాన్ని నిర్వ‌హించిన జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్‌హెచ్ ఆర్‌సి)

Posted On: 10 DEC 2020 5:16PM by PIB Hyderabad

వైదిక కాలం నుంచి స‌ర్వే భ‌వంతు సుఖినః స‌ర్వే సంతు నిరామ‌య అన్న వైదిక మంత్రాల‌లో మొత్తం మాన‌వాళి స్ఫూర్తిని క‌లిగి ఉన్నాయ‌న్న కేంద్ర హోం వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్
 


 

మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, ప్రోత్సాహంలో స్థానిక పంచాయ‌తీల పాత్ర అత్యంత కీల‌కం - నిత్యానంద రాయ్ 

జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ నిర్భ‌యంగా, ప‌క్ష‌పాతం లేకుండా పాక్షిక న్యాయ సంస్థ‌గా, కాప‌లా సంఘంగా పాత్ర పోషిస్తుందన్న కేంద్ర హోం వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి

న్యూఢిల్లీ, డిసెంబ‌ర్ 10, (పిఐబి)ః జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్‌హెచ్ఆర్‌సి) గురువారం మాన‌వ హ‌క్కుల దినోత్స‌వాన్ని కొత్త ఢిల్లీలో ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర‌ హోం వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. దృశ్య మాధ్య‌మం ద్వారా పాల్గొన్న మంత్రి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ,  వైదిక కాలం నుంచే భార‌త‌దేశంలో మాన‌వ హ‌క్కులు ఉనికిలో ఉన్నాయ‌ని చెప్పారు. వైదిక మంత్రాల‌లో స‌ర్వే భ‌వంతు సుఖినః, స‌ర్వే సంతు నిరామయ అన్న వ‌చ‌నాలు మొత్తం మాన‌వాళి స్ఫూర్తిని క‌లిగి ఉన్నాయ‌న్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మాన‌వాళిని నొప్పించే వ్య‌క్తి కాద‌ని, మాన‌వ సేవ ఆయ‌న జీవిత ల‌క్ష్య‌మ‌ని అన్నారు. అలాగే, మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను  బ‌లోపేతం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా క‌ట్టుబ‌డి ఉన్నార‌ని మంత్రి రాయ్ తెలిపారు.
స‌మాజంలోని బ‌ల‌హీన వ‌ర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త‌ను ఇచ్చింద‌ని నిత్యానంద‌రాయ్ అన్నారు. బ‌ల‌హీన‌వ‌ర్గాల హ‌క్కులను వారు త‌మ హ‌క్కుల గురించి చైత‌న్యంతో లేన‌ప్పుడు కూడా వారి హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డ‌మే కాదు వారి స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించామ‌న్నారు. మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, ప్రోత్సాహంలో స్థానిక పంచాయ‌తీల పాత్ర చాలా కీల‌క‌మ‌న్నారు. అందుకే వాటిని కూడా బ‌లోపేతం చేసేందుకు కృషి జ‌రుగుతోంద‌న్నారు.
క‌రోనా సంక్షోభం స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ యోజ‌న ద్వారా ఒక్క వ్య‌క్తి కూడా ఉప‌వాసం లేకుండా ఉండేందుకు ప్ర‌తి వ్య‌క్తి ఆహార భ‌ద్ర‌త హ‌క్కును ప్ర‌భుత్వం కాపాడింద‌న్నారు. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల‌లోని కార్మికుల‌ను సాధికారం చేసేందుకు ఎంజిఎన్ ఆర్ ఇజిఎ కింద వేత‌నాల‌ను పెంచ‌డం జ‌రిగింద‌న్నారు. కోవిడ్‌-19 వ‌ల్ల ప్ర‌భావిత‌మైన వ‌ల‌స కార్మికుల అకౌంట్ల‌లోకి ప్ర‌భుత్వం నేరుగా న‌గ‌దు బ‌దిలీ చేసింద‌ని, ఇది వారి హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డం కోస‌మే చేశార‌ని అన్నారు.


మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు, ప్రోత్సాహానికి జాతీయ మానవ హ‌క్కుల క‌మిష‌న్ చేసిన ప‌నిని కొనియాడుతూ, క‌మిష‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కున్న న‌మ్మ‌కాన్నిప్ర‌స్తావించారు. క‌మిష‌న్ త‌న పాత్ర‌ను ఎటువంటి ప‌క్ష‌పాతం భ‌యం లేకుండా పాక్షిక న్యాయ సంస్థ‌గా త‌న పాత్ర‌ను పోషించింద‌ని కేంద్ర హోం వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి చెప్పారు. క్షేత్ర స్థాయిలో మాన‌వ హ‌క్కుల‌ను బ‌లోపేతం చేయ‌డం అన్న‌ది స‌మాజ సామూహిక బాధ్య‌త అని ఆయ‌న అన్నారు.
మాన‌వ హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డంలో భ‌ద్ర‌తా ద‌ళాల‌కు కీల‌క పాత్ర ఉంద‌ని నిత్యానంద రాయ్ అన్నారు. పూర్తి సాహ‌సంతో త‌మ విధుల‌ను నిర్వ‌ర్తించ‌డ‌మే కాక‌, పౌరుల హ‌క్కుల ప‌ట్ల భ‌ద్ర‌తా ద‌ళాలు ఎంతో సున్నిత‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్నారు.
జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ స‌భ్యుడు జ‌స్టిస్ పి.సి. పంత్ మాట్లాడుతూ, కోవిడ్‌-19 కార‌ణంగా ఈ ఏడాది మాన‌వాళి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంద‌ని చెప్పారు.  దీనికి ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ‌ల‌, సాధార‌ణ ప్ర‌జల నుంచి స‌మైక్య స్పంద‌న అవ‌స‌ర‌మైంద‌న్నారు. ఈ సంక్షోభ ప‌రిస్థితిని ప‌రిష్క‌రించేందుకు ప్రజారోగ్య వ్య‌వ‌స్థ స్పంద‌న విజ‌యం అనేది మాన‌వ హ‌క్కుల‌‌ను గౌర‌వించాల‌న్న భావ‌న వారిలో ఎంత లోతుగా పాతుకుని ఉంద‌న్న దానిపై ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. అన్న రాష్ట్రాల విధానాల‌కు మాన‌వ హ‌క్కులు ఆధారం అన్న నిబద్ధ‌త‌ను పున‌రుద్ఘాటించాల్సిన స‌మ‌యం ఇద‌ని ఆయ‌న అన్నారు.
గ‌త 27 సంవ‌త్స‌రాలుగా ఎంత‌మందికి సాధ్య‌మైతే అంత‌మందికి అందుబాటులోకి వ‌చ్చేందుకు క‌మిష‌న్ నిరంత‌రం కృషి చేస్తోంద‌ని జ‌స్టిస్ పి.సి. పంత్ చెప్పారు. అయితే, అసాధార‌ణ కాలానికి అసాధార‌ణ స్పంద‌న‌లు అవ‌స‌ర‌మ‌న్నారు. కోవిడ్‌-19 సంక్షోభానికి క‌మిష‌న్ కూడా స్పందించి, ఈ ఏడాది త‌న కార్య‌క‌లాపాలు అన్నింటినీ ప్ర‌త్య‌క్ష ప‌ద్ధ‌తి నుంచి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తికి మార్చుకుంద‌న్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ సెక్రెట‌రీ జ‌న‌ర‌ల్ బింబాధ‌ర్ ప్ర‌ధాన్‌, ఎన్‌హెచ్ ఆర్ సీ మాజీ చైర్ ప‌ర్స‌న్లు, స‌భ్యులు, వివిధ రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ల చైర్మ‌న్లు, స‌భ్యులు, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌తినిధులు, రాయ‌బారులు, పౌర స‌మాజ స‌భ్యులు, ఎన్జీవోల ప్ర‌తినిధులు, ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

***



(Release ID: 1679758) Visitor Counter : 382