శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో భారతదేశం ముందంజలో ఉంది : డాక్టర్ హర్ష వర్ధన్
"ఈ భాగస్వామ్యం యొక్క తదుపరి దశ మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొత్త పరిష్కారాలను ప్రోత్సహించడం" : ఇండియా-పోర్చుగల్ టెక్నాలజీ సదస్సు-2020 లో డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
07 DEC 2020 6:04PM by PIB Hyderabad
పోర్చుగల్ భాగస్వామి దేశంగా ఈ రోజు ఏర్పాటైన ఒక ప్రధాన కార్యక్రమం, డి.ఎస్.టి-సి.ఐ.ఐ. భారత, పోర్చుగల్ టెక్నాలజీ సదస్సు-2020 లో, కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, భూవిజ్ఞానం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, మాట్లాడుతూ, "భారతదేశంలో, సుమారు 30 వ్యాక్సిన్లు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. వాటిలో రెండు టీకాల అభివృద్ధి తుది దశకు చేరుకుంటోంది. - ఒకటి, "కోవాక్సిన్" పేరుతో ఐ.సి.ఎం.ఆర్-భారత్ బయోటెక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది, రెండోది, "కోవీషీల్డ్" పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఈ రెండూ, మూడో దశ క్లినికల్ ట్రయల్సు లో ఉన్నాయి. మా ప్రధాన సంస్థ - భారత వైద్య పరిశోధనా మండలి - ఈ రెండు టీకాల క్లినికల్ ట్రయల్సు నిర్వహణలో నిమగ్నమై ఉంది. అన్ని ప్రధాన టీకా తయారీదారుల క్లినికల్ ట్రయల్సు నిర్వహణలో భారతదేశం సహకారం అందిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్సుఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ నిర్వహిస్తోంది. జైడస్ కాడిలా అనే సంస్థ కూడా స్వదేశీ డి.ఎన్.ఏ. వ్యాక్సిన్ యొక్క రెండవ దశ ట్రయల్సు నిర్వహిస్తోంది. మా ఫార్మా దిగ్గజాలలో ఒకటైన డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ సంస్థ, రష్యన్ వ్యాక్సిన్ కు చివరి దశ మానవ పరీక్షలు నిర్వహించి, నియంత్రణ ఆమోదం పొందిన తరువాత, ఆ టీకాను, భారతదేశంలో పంపిణీ చేస్తుంది.” అని, తెలియజేశారు.
ఎక్కువ సంఖ్యలో పేటెంట్లను దాఖలు చేసిన ప్రపంచంలోని మొదటి పది దేశాల్లో, భారతదేశం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వెల్లడించారు. కోవిడ్ సవాళ్ళతో పోరాడటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల గురించి ఆయన పేర్కొంటూ, "కోవిడ్-19 కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన వందకు పైగా అంకురసంస్థలు వినూత్న ఉత్పత్తులు, పరిష్కారాలను అందించాయి." అని, తెలియజేశారు.
"దేశం కోసం బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మరియు పరిశ్రమల మధ్య సమర్థవంతమైన భాగస్వామ్యానికి ఈ సదస్సు ఒక ప్రతిబింబం". అని, డాక్టర్ హర్ష వర్ధన్ వ్యాఖ్యానించారు. "ఈ భాగస్వామ్యం యొక్క తదుపరి దశ మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొత్త పరిష్కారాలను ప్రోత్సహించడం." అని కూడా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా, వివిధ రంగాలలో, భారత-పోర్చుగల్ దేశాల మధ్య సంబంధాల గురించి ఆయన వివరించారు. ఆరోగ్య సంరక్షణ, నీరు, వ్యవసాయం, విద్యుత్తు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడుల అవకాశాలను అన్వేషించడానికి పాల్గొనే సంస్థలకు పరస్పర చర్యలు మంచి అవకాశాన్ని అందిస్తాయని డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా పాల్గొన్న, పోర్చుగల్ ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత విద్య శాఖల మంత్రి, ప్రొఫెసర్ మాన్యుయేల్ హెయిటర్, కీలకోపన్యాసం చేస్తూ, “ఇవి సంఘీభావ సమయాలు. భారతదేశంతో మా సంబంధాలు బలంగా ఉన్నాయి. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి మనం జ్ఞానం మీద ఆధారపడాలి.” అని, పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి), కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ప్రసంగిస్తూ, చాలా సంవత్సరాలుగా, రెండు దేశాల మధ్య కలిసి జ్ఞానాన్ని సృష్టించడం, పరస్పరం సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకోవడం, ఆర్. & డి. ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాలను ఈ సదస్సు సులభతరం చేసిందని పేర్కొన్నారు. భారత, భాగస్వామ్య దేశాలకు చెందిన పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య మెరుగైన మార్కెట్ సదుపాయాలను ఈ సదస్సు అందుబాటులోకి తెచ్చిందని కూడా ఆయన చెప్పారు. భారతదేశంలో క్రమంగా పెరుగుతున్న విధాన పాలన ద్వారా, శాస్త్ర, సాంకేతిక పర్యావరణ వ్యవస్థ బాగా మెరుగుపడిందనీ, దీనికి, ఆర్థిక సంస్కరణలతో పాటు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల ద్వారా కలిగిన ప్రేరణ మరింత సహకరించిందని, ఆయన వివరించారు.
భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి), గత 26 సంవత్సరాలుగా, భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) భాగస్వామ్యంతో ఈ టెక్నాలజీ సదస్సును నిర్వహిస్తోంది. పరిశోధన, అభివృద్ధితో పాటు, సాంకేతిక పరిజ్ఞానంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను గణనీయంగా పెంపొందించడానికి అవసరమైన విధాన రూపకల్పనతో సహా, అంతర్జాతీయ భాగస్వాములతో సహకారాన్ని ఏర్పరచుకోవడానికి, ఈ సదస్సు, భారత పరిశ్రమలతో పాటు, విద్యా, పరిశోధనా సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. గతంలో నిర్వహించిన సదస్సుల్లో, స్పెయిన్, దక్షిణ కొరియా, యు.కె., ఇటలీ వంటి దేశాలు కూడా పాల్గొన్నాయి.
ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యాలు :-
ఎ) భాగస్వామ్యాలను ప్రోత్సహించడం;
బి) ఆవిష్కరణ, పెట్టుబడి, వాణిజ్యాలను పెంపొందించడం;
సి) సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు, ఉమ్మడి ప్రాజెక్టులు, మార్కెట్ అందుబాటులను సులభతరం చేయడం.
ఈ సదస్సు ద్వారా దిగువ పేర్కొన్న అంశాలను సాధించాలని భావిస్తున్నారు :-
ఎ) ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక జ్ఞానం మరియు ఆవిష్కరణ ఎజెండాను ప్రారంభించడం;
బి) భారత, పోర్చుగల్ దేశాల మధ్య నూతన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు;
సి) కొత్త భాగస్వాములను సత్వరమే గుర్తించి, మార్కెట్ ప్రవేశానికి అవకాశాలు;
d) ప్రస్తుతం ఉన్న భారత, పోర్చుగల్ భాగస్వాములకు మార్కెట్ విస్తరణ అవకాశాలు;
ఈ) జ్ఞాన ఆర్థిక వ్యవస్థ కు అందుబాటులో ఉన్న వివిధ రంగాలలో భారత, పోర్చుగల్ సంబంధాలను మరింత పటిష్ఠపరచడం;
ఎఫ్) సామాజిక సవాళ్లకు అందుబాటులో ఉన్న పరిష్కారాలను పెంపొందించడం;
జి) పెట్టుబడులు, మార్కెట్ అవగాహనతో పాటు, చొచ్చుకుపోయే తత్వాన్ని ప్రోత్సహించడం;
హెచ్) పరిశోధనలు, మానవ వనరుల పరస్పర మార్పిడిలో సహకారం;
ఐ) భారతీయ పరిశ్రమ మరియు పరిశోధనా సంస్థల మధ్య పెద్ద సంఖ్యలో సాంకేతిక పరిజ్ఞానం; మరియు
జె) అవగాహన ఒప్పందాలపై సంతకాలతో పాటు, భవిష్యత్ సహకారాన్ని బలోపేతం చేయడానికి అనువైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవడం.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన రంగాల్లో ఎ) అగ్రిటెక్; బి) వాటర్ టెక్; సి) హెల్త్ టెక్; డి) క్లీన్ టెక్, ఎనర్జీ, వాతావరణ మార్పు; ఈ) ఐ.టి. / ఐ.సి.టి. / ఎమర్జింగ్ టెక్నాలజీస్; ఎఫ్) ఆవిష్కరణలు మరియు అంకుర సంస్థలు; జి) అంతరిక్ష-సముద్రం పరస్పర చర్యలు మొదలైనవి ఉన్నాయి.
ఈ రోజు, సదస్సు ప్రారంభ కార్యక్రమంలో - భారత ప్రభుత్వం, నీతీ ఆయోగ్, సభ్యుడు, డాక్టర్ వి.కె. సారస్వత్; భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ), డైరెక్టర్ జనరల్, శ్రీ చంద్రజిత్ బనెర్జీ; కో-చైర్మన్, ఆర్ & డి, ఇన్నోవేషన్ పై సి.ఐ.ఐ. జాతీయ కమిటీ, సహా అధ్యక్షుడు మరియు జి.ఈ. దక్షిణాసియా సి.టి.ఓ. మరియు జి.ఈ. భారత సాంకేతిక కేంద్రం సి.ఈ.ఓ. శ్రీ అలోక్ నందా; ఆర్ & డి, ఇన్నోవేషన్ పై సి.ఐ.ఐ. జాతీయ కమిటీ, చైర్మన్ మరియు టెక్నాలజీ సదస్సు చైర్మన్ మరియు అశోక్ లే ల్యాండ్, సి.ఈ.ఓ., మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ విపిన్ సొంధి; ఎఫ్.సి.టి. డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడు, ప్రొఫెసర్ హెలెనా పెరీరా కూడా ప్రసంగించారు. భారత ప్రభుత్వం, డి.ఎస్.టి., అంతర్జాతీయ సహకారం అధిపతి డాక్టర్ సంజీవ్ వి. వర్షిణీ వందన సమర్పణ తో ఈ రోజు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది.
****
(Release ID: 1678972)
Visitor Counter : 326