రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నౌకాదళ స్థావరంలో ఆఫీసర్‌ ట్రైనీల పాసింగ్‌ ఔట్‌ కార్యక్రమం

Posted On: 05 DEC 2020 7:25PM by PIB Hyderabad

98వ 'ఇంటిగ్రెటెడ్‌ ఆఫీసర్‌ ట్రైనీస్‌ కోర్స్‌' 'మొదటి ట్రైనింగ్‌ స్వాడ్రన్‌'కు కదులుతున్న నౌకలపై శిక్షణ 
శనివారం పూర్తయింది. కొవిడ్‌ ఆంక్షల కారణంగా పాసింగ్‌ ఔట్‌ వేడుకను కుదించారు. నౌకలపై జరిగిన ఈ కార్యక్రమంలో, రియర్‌ అడ్మిరల్‌, దక్షిణ నౌకాదళ స్థావర చీఫ్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ (శిక్షణ) ఆంటోనీ జార్జ్‌, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆఫీసర్‌ ట్రైనీలకు జ్ఞాపికలు అందజేశారు. 114 మంది నౌకాదళ, 13 మంది తీర రక్షణ దళ, ఐదుగురు విదేశీ (మయన్మార్‌ నుంచి ఇద్దరు, మాల్దీవులు, సీషెల్స్‌, టాంజానియా నుంచి ఒక్కొక్కరు) శిక్షణార్థులు కలిపి మొత్తం 132 మంది ఆఫీసర్‌ ట్రైనీలు శిక్షణ పొందారు. కోచి కేంద్రంగా ఉన్న 'మొదటి ట్రైనింగ్‌ స్వాడ్రన్‌'లో నౌకాదళ నౌకలైన తిర్‌, మగర్‌, శార్దూల్‌, సుజాతతోపాటు, తీర రక్షణ నౌక సారథి, నౌకాయాన శిక్షణ నౌకలు తరంగిణి, సుదర్శిని ఉన్నాయి. 

    'బెస్ట్‌ ఆల్‌ రౌండ్‌ సీ ట్రైనీ'గా నిలిచి, 'చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ ట్రోఫీ', 'టెలీస్కోప్‌'ను సబ్‌ లెఫ్టినెంట్‌ సుశీల్‌ సింగ్‌ దక్కించుకున్నారు. 'ఓవరాల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌' కింద, 'చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ ట్రోఫీ', 'బైనాక్యులర్స్‌' సబ్‌ లెఫ్టినెంట్‌ అభిషేక్‌కు దక్కాయి. 'బెస్ట్‌ కోస్ట్‌ గార్డ్‌ సీ ట్రైనీ'గా నిలిచిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ సోన్‌మలే సూరజ్‌ క్రిషాంత్‌, డీజీ ఐసీజీ ట్రోఫీని అందుకున్నారు. శిక్షణ సమయంలో వృత్తిపర పాఠ్యాంశాల్లో ఉత్తమ ప్రతిభ చూపించినందుకు 'ఎఫ్‌ఓసీ-ఇన్‌- సి ఈస్ట్ రోలింగ్ ట్రోఫీ'ని సబ్‌ లెఫ్టినెంట్‌ కేశవ్‌ సత్యం కత్తి దక్కించుకున్నారు. పాఠాలతోపాటు క్రీడలు, పాఠ్యేతర అంశాల్లో ప్రతిభ కనబరిచిన సబ్‌ లెఫ్టినెంట్‌ దేబ్‌శీష్‌ సింగ్‌ దేవ్‌కు 'ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ సౌత్‌ రోలింగ్‌ ట్రోఫీ' ప్రదానం చేశారు.

    సముద్రంపై సాగిన ఈ 24 వారాల శిక్షణ ఈ ఏడాది జూన్‌ 29వ తేదీన ప్రారంభమైంది. సీమాన్‌షిప్, నావిగేషన్, నౌక నిర్వహణ, పర్యవేక్షక అధికారి విధులతోపాటు సాంకేతిక అంశాల్లో శిక్షణ అందించారు. సముద్ర జీవన కఠినతను ఈ సమగ్ర సముద్ర శిక్షణ వారికి తెలియజేసింది. యుద్ధంతో పాటు ‘యుద్ధం కంటే తక్కువ’ విధులను సమర్థవంతంగా చేపట్టేలా యువ అధికారులను తీర్చిదిద్దింది. ఈ శిక్షణార్థులు 61 రోజులపాటు సముద్రంపై గడిపారు. ఈ సమయంలో మన దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లోని వివిధ పోర్టులతోపాటు మలక్కా, సింగపూర్ జలసంధిని సందర్శించారు. నౌకాయాన శిక్షణ నౌకలు తరంగిణి, సుదర్శినిలోనూ శిక్షణ పొందారు.

    తర్వాతి దశ శిక్షణ కోసం తూర్పు, పశ్చిమ స్థావరాల్లోని యుద్ధ నౌకలు, తీర రక్షణ నౌకల్లో ఈ అధికారులు చేరతారు.


(Release ID: 1678659) Visitor Counter : 176