రక్షణ మంత్రిత్వ శాఖ
భారత, వియత్నాం రక్షణ మంత్రుల మధ్య చర్చలు
Posted On:
27 NOV 2020 6:43PM by PIB Hyderabad
భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ వియత్నాం సోషలిస్ట్ రిపబ్లిక్ జాతీయ రక్షణ మంత్రి జనరల్ ఎంగో జువాన్ లిచ్ తో వీడియో కాన్ఫరెన్సింగ్ లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఉభయ దేశాల మధ్య నెలకొన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే భారత-వియత్నాం రక్షణ సహకారంలో కీలక మూలస్తంభమని ఉభయులు ఈ చర్చల్లో పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఉభయ దేశాల మధ్య అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల గురించి చర్చించడంతో పాటు వారు ద్వైపాక్షిక రక్షణ బంధం భవిష్యత్తు గురించి కూడా చర్చించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కూడా ఉభయ దేశాల మధ్య రక్షణ బంధం సానుకూల పథంలోనే ఉండడం పట్ల వారు సంతృప్తి ప్రకటించారు. రక్షణ పరిశ్రమ సామర్థ్యాల నిర్మాణం, శిక్షణ, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో సహకారం వంటి చర్యల గురించి కూడా వారు చర్చించారు.
భారత, వియత్నాం నేషనల్ హైడ్రోగ్రాఫిక్ కార్యాలయాల అధికారులు హైడ్రోగ్రఫీ రంగంలో సహకారానికి సంబంధించిన అమలు ఒప్పందాలపై ఉభయ రక్షణమంత్రుల సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. మరింత ద్వైపాక్షిక సహకారం దిశగా ఇది ఒక ముందడుగు అని వారు ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఉభయదేశాలు హైడ్రోగ్రఫీ డేటాను, నావిగేషన్ చార్టులను పరస్పరం పంచుకుంటాయి.
రక్షణ పరిశ్రమల స్వయం సమృద్ధి కూడా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ఒక భాగమని రక్షణమంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శక్తివంతమైన, స్వయం సమృద్ధ భారత్ వియత్నాం వంటి భాగస్వామ్య మిత్రదేశాల సామర్థ్యాల నిర్మాణానికి కూడా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులోనే సంస్థాగత సహకార ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఉభయదేశాల రక్షణ పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం పెంచుకోవాలన్న ఆకాంక్ష మంత్రి ప్రకటించారు.
ఆసియాన్ నాయకత్వం వహించిన సమయంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్నా కూడా వియత్నాం విజయవంతంగా రక్షణ సంబంధిత కార్యకలాపాలు నిరాఘాటంగా చేపట్టడాన్ని రక్షణ మంత్రి ప్రశంసించారు.
వియత్నాం రక్షణ దళాల సామర్థ్యాల నిర్మాణానికి ప్రత్యేకించి మానవ వనరుల అభివృద్ధిలో సహకారానికి వియత్నాం రక్షణ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భారత రక్షణదళ సంస్థల్లో వియత్నాంకు చెందిన త్రివిధ సర్వీసుల శిక్షణ పరిధి విస్తరించేందుకు భారత్ సంసిద్ధతను రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.
2020 డిసెంబర్ 10వ తేదీన వర్చువల్ గా నిర్వహిస్తున్న ఎడిఎంఎం ప్లస్ సమావేశంలో కూడా పాల్గొనాలని భారత రక్షణ మంత్రిని వియత్నాం రక్షణ మంత్రి ఆహ్వానించారు.
***
(Release ID: 1676721)
Visitor Counter : 269