నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
రాష్ర్టాల సహకారం పునాదిగా భారత పునరుత్పాదక ఇంధన వృద్ధి అసాధారణం : 3వ గ్లోబల్ రీ ఇన్వెస్ట్ సిఎంల ప్లీనరీ సెషన్ లో శ్రీ ఆర్.కె.సింగ్
Posted On:
27 NOV 2020 7:08PM by PIB Hyderabad
“భారతదేశం పునరుత్పాదక ఇంధన విభాగంలో అద్భుతమైన కృషి చేసింది. భారీ స్థాయిలో విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మన దేశం ప్రతీ ఒక్క ఇంటికీ విద్యుత్ సదుపాయం కల్పించింది. దేశం యావత్తును ఒక సమగ్ర గ్రిడ్ కిందకు తెచ్చింది. ఉష్ణోగ్రతలను నిర్దేశిత లోపులోనే నిలువరించగలిగిన ఏకైక జి-20 దేశం భారత్” అని విద్యుత్, నవ్య, పునరుత్పాదక ఇంధన వనరులు, నైపుణ్యాల శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ అన్నారు. 3వ గ్లోబల్ రి ఇన్వెస్ట్ సమావేశంలో ముఖ్యమంత్రుల ప్లీనరీని ఉద్దేశించి మాట్లాడుతూ “మన దేశంలో పునరుత్పాదక ఇంధనం అతి చవకగా అందుబాటులో ఉంది. అద్భుతమైన కృషి చేసినందుకు సిఎంలందరినీ నేను అభినందిస్తున్నాను. కాని ఇది ప్రారంభం మాత్రమే. మనం మరింతగా సహకారం పెంచుకుని మన లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉంది. విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధనం వాటా గణనీయంగా పెంచే దిశగా అందరం కృషిని కొనసాగించాలి” అని శ్రీ సింగ్ సూచించారు. గత నాలుగేళ్ల కాలంలో మన దేశం పునరుత్పాదక ఇంధన పరిశ్రమలోకి 6400 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, అన్ని ప్రధాన పెన్షన్ ఫండ్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశాయని చెబుతూ భారతదేశం ప్రపంచంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యంగా మారిందన్నారు.
ఈ రంగంలో గుజరాత్ సాధించిన విజయాలను ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ వివరిస్తూ పునరుత్పాదక ఇంధన విభాగంలో గుజరాత్ ముందువరుసలో ఉన్నదని, ఎన్నో సవాళ్ల మధ్యన కూడా గత మూడేళ్ల కాలంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని చెప్పారు. “ప్రజలు, ఆసక్తి గల భాగస్వాములు, కంపెనీలు అందరినీ ఏకతాటి పైకి తీసుకువస్తూ సొల్యూషన్లు కనుగొనగలిగాం. ఆర్ఇ విభాగంలో అది అందరికీ లాభదాయకమైన స్థితి” అని శ్రీ రూపానీ అన్నారు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడానికి గుజరాత్ 55 వేల మంది ప్రజలకు సబ్సిడీలు అందించిందని, 5000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుందని, వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ ప్రవేశపెట్టాలనుకుంటున్నదని వివరించారు. కేంద్రప్రభుత్వ ఓసోవాగ్ విజన్ ను సాధించేందుకు తాము అమిత ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు.
రాజస్తాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ కూడా అదే తరహా అభిప్రాయాలు ప్రకటిస్తూ సోలార్ ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులు పెట్టిన రెండో పెద్ద రాష్ట్రం రాజస్తాన్. “మేం ఈ కృషి 20 సంవత్సరాల క్రితమే ప్రారంభించాం. అప్పటికి ఆర్ఇ ధర రూ.16 ఉండగా ఇప్పుడది రూ.2కి దిగివచ్చింది. అది ఇంకా తగ్గుతుంది. పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పుల దిశగా కృషి చేయడం మా బాధ్యత” అని చెప్పారు. ఈ రంగంలో ఇన్వెస్టర్లకు తాము స్టాంప్ డ్యూటీ తగ్గింపు, తేలిగ్గా భూ లభ్యత, 10 సంవత్సరాల ఉచిత విద్యుత్, జిఎస్ టిలో 90 శాతం సబ్సిడీ అందిస్తున్నట్టు తెలిపారు. “రాజస్తాన్ కు 1.25 లక్షల ఎకరాల ఎడారి భూమి ఉంది. జోథ్ పూర్, బికనీర్ లలో విస్తారమైన ప్రదేశాల్లో సోలార్ ప్రాజెక్టులు చేపట్టాం” అన్నారు.
పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తికి భారతదేశం ఆదర్శవంతమైన దేశమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. “మధ్యప్రదేశ్ దేశం యావత్తుకు కేంద్రీయ స్థానంలో ఉంది. పునర్ వినియోగ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవసరంలో ఉన్న పొరుగు రాష్ర్టాలకు కూడా ఆర్ఇ సరఫరా చేయగలదు. రాష్ట్రంలో 37 వేల సర్క్యూట్ ట్రాన్స్ మిషన్ లైన్లు, సర్వీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం” అని చెప్పారు. మధ్యప్రదేశ్ 15 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రచించిందని, ఆ ప్రాజెక్టు వ్యయం రూ.5 వేల కోట్లని ఆయన తెలిపారు. పవర్ ట్రాన్స్ మిషన్ లైన్లపై పని ప్రారంభించడంతో పాటు ఫ్లోటింగ్ సోలార్ స్టేషన్ల ఏర్పాటుతో సహా పలు నవ్య దృక్పథంతో కూడిన ఆర్ఇ ప్రాజెక్టులపై సర్వే కూడా చేపట్టిందని చెప్పారు. “ఆత్మనిర్భర్ మధ్యప్రదేశ్ ప్రణాళిక రూపు దిద్దుకుంటోంది. అందులో ఆర్ఇ కీలక పాత్ర పోషిస్తుంది” అని ఆయన ప్రకటించారు.
“హిమాచల్ ప్రదేశ్ అతి చిన్న రాష్ట్రం. కాని ఆర్ఇ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి మేం అపారమైన కృషి చేస్తున్నాం. 24 వేల మెగావాట్ల ఆర్ఇ సాధన మా లక్ష్యం. ప్రస్తుతం మేం 10 వేల మెగావాట్ల హైడ్రో పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే దశాబ్ది కాలంలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనుకుంటున్నాం” అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాకూర్ అన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లో 12 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రణాళికలు ఆ రంగంలోని ఉత్పత్తిదారుల వద్ద ఉన్నాయని తెలిపారు. ఝాన్సీలో ఒక్కోటి 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్లాంట్లు ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. అవి త్వరలోనే పూర్తవుతాయన్నారు. “కుసుమ్ స్కీమ్ రైతుల కోసం ప్రారంభించిన ఉత్సాహవంతమైన పథకం. దాన్ని రాష్ట్రంలో అమలుపరచడానికి యుపి ప్రణాళికలు సిద్ధం చేసింది” అని తెలిపారు. ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ సోలార్ ప్రాజెక్టులు, పార్కుల కోసం ఓపెన్ యాక్సెస్ తో పాటు సింగిల్ విండో ఎంట్రీ కల్పిస్తున్నదని చెప్పారు. “2022 నాటికి సోలార్ విద్యుత్ సామర్థ్యం 10,700 మెగావాట్లతకు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందులో 6000 మెగావాట్లు సోలార్ ప్లాంట్ల ద్వారా సాధిస్తే 4000 మెగావాట్లు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా సాధిస్తాం” అన్నారు.
కొత్తగా ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్ లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గురించి లెఫ్టనెంట్ గవర్నర్ శ్రీ రాధాకృష్ణ మాధుర్ మాట్లాడుతూ “కర్బన వ్యర్థాలు లేని కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ ను మార్చాలనుకుంటున్నాం. పునరుత్పాదక ఇంధనం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని అంచనాల ప్రకారం లదాఖ్ లో 30 గిగావాట్ల సోలార్, 5 గిగావాట్ల పవన విద్యుత్, 2 గిగావాట్ల హైడ్రో విద్యుత్, 300 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ సామర్థ్యం ఉంది. తొలి దశలో 10 వేల మెగావాట్ల సామర్థ్యం సాధించడంతో పాటు దానికి కావలసిన ట్రాన్స్ మిషన్ మౌలిక వసతులు కూడా అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం” అని వివరించారు.
“మూడు ప్రధాన పాయింట్లపై మనం దృష్టి కేంద్రీకరించాలి. మనం ఒక దేశంగా రాష్ర్టాలు, కేంద్రం అన్నింటికీ కలుపుతూ ఎలా కృషి చేయగలం అనేది మొదటిది; కోట్లాది మంది దేశవాసులకు పునరుత్పాదక ఇంధనాన్ని అందుబాటు ధరల్లో ఎలా అందుబాటులో ఉంచగలమనేది రెండోది; టెక్నాలజీ సహాయంతో భవిష్యత్తులోకి ఏ విధంగా అడుగేసి ప్రపంచంలో అగ్రగామిగా ఎలా నిలవగలదనేది మూడో అంశం” అని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు.
3వ రీ ఇన్వెస్ట్ గ్లోబల్ సమావేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. దేశవిదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు; యుకె ప్రభుత్వ ఇంధనం, పారిశ్రామిక వ్యూహ శాఖ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు శ్రీ అలోక్ శర్మ; డెన్మార్క్ వాతావరణం, ఇంధనం, యుటిలిటీల శాఖ మంత్రి శ్రీ డాన్ జార్గెన్సెన్; రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టనెంట్ గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ మార్క్ రూటి సమావేశానికి వీడియో సందేశం పంపారు.
గతంలో జరిగిన రీ ఇన్వెస్ట్ సమావేశాల్లో భారతదేశం చేసిన ప్రకటనలు వాస్తవ రూపం దాల్చుతున్న తీరును ప్రధామంత్రి వివరించారు. భారతదేశ పౌరులందరికీ ఇంధనం అందుబాటులో ఉంచేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆయన చెప్పారు. ఆర్ఇ సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ పెద్ద దేశమని, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. 2022 నాటికి భారత ఆర్ఇ సామర్థ్యం 220 గిగావాట్లకు పెరుగుతుందని ఆయన చెప్పారు. గత ఆరు సంవత్సరాల కాలంలో స్థాపిత ఆర్ఇ సామర్థ్యం రెండున్నర రెట్లు, సోలార్ సామర్థ్యం 13 రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు. వాతావరణ మార్పులపై పోరాటానికి ప్రకటించిన కట్టుబాటు ఫలితమే ఇదని ఆయన అన్నారు.ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల పరిధిలో ఉన్న కొద్ది దేశాల్లో భారత్ ఒకటని ఆయన తెలిపారు. విద్యుత్ అందుబాటును, సామర్థ్యాన్ని, పరిణామక్రమాన్ని పెంచడం భారతదేశం వైఖరి అని చెప్పారు. ఇరిగేషన్ పంప్ సెట్లకు సోలార్ విద్యుత్ ను ఉపయోగించేందుకు ఉద్దేశించిన పిఎం-కుసుమ్ స్కీమ్ గురించి ప్రధానమంత్రి వివరించారు. వచ్చే ఆరు సంవత్సరాల కాలంలో భారతదేశం ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలనుకుంటున్నదని ఆయన అన్నారు. భారతదేశంలో పెట్టుబడులు ఎందుకు పెట్టవచ్చునో పలు కారణాలను వివరించారు. భారతదేశం సమగ్ర హైడ్రోజెన్ ఎనర్జీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నదని ప్రకటించారు. దేశంలో ప్రతీ మంత్రిత్వ శాఖలోనూ ప్రత్యేక ప్రాజెక్టు అభివృద్ధి కేంద్రాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కేంద్రాలు ఉన్నాయని ఆయన అన్నారు.
పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చూపించిన నాయకత్వాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రశంసించారు. భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ ఇజ్రాయెల్ పర్యటన, తన భారత పర్యటన గురించి ఆయన ప్రస్తావించారు. తక్కువ కర్బన వ్యర్థాలు గల, హరిత ఇంధన వనరులున్న ప్రపంచం ప్రస్తుత అవసరమని ఆయన అన్నారు. భారత్ కు ఈ ప్రయత్నంలో ఇజ్రాయెల్ సన్నిహితంగా సహకరిస్తుందని చెప్పారు. 2025 నాటికి ఇజ్రాయెల్ లో బొగ్గు వినియోగం జీరోకి తగ్గుతుందన్నారు. నవ్యపథంలో నడిచే వారిదే భవిష్యత్తు అని ఆయన అన్నారు.
ఆర్ఇ విభాగంలో భారతదేశం కీలక ప్రపంచ భాగస్వామి అని నెదర్లాండ్స్ ప్రధానమంత్రి చెప్పారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచానికి హరిత ప్రపంచాన్ని నిర్మించే అవకాశం అందుబాటులోకి తెచ్చిందన్నారు. నెదర్లాండ్స్ లో నిర్వహిస్తున్న ప్రపంచ వాతావరణ అమలు శిఖరాగ్ర సదస్సుకు రావాలని ఆయన భారత్ ను ఆహ్వానించారు. భారత్ తో కలిసి తాము పని చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
జీవితాలను మెరుగుపరిచి, ఉద్యోగాలు కల్పించి, హరిత వృద్ధిని పెంచే పునరుత్పాదక ఇంధన విప్లవం రావాలని యుకె ప్రభుత్వ వ్యాపారం, ఇంధనం, పారిశ్రామిక వ్యూహ శాఖ కార్యదర్శి, సిఓపి 26 కార్యదర్శి పిలుపు ఇచ్చారు. అందుబాటు ధరల్లో పునరుత్పాదక ఇంధనాన్ని అందించే విప్లవంలో భారతదేశం కేంద్రీయ స్థానంలో ఉన్నదంటూ వాతావరణ మార్పులను సమర్థవంతంగా అరికట్టడంలో సిఓపి 26 అధ్యక్ష స్థానంలో ఉన్న యుకెకు కీలక భాగస్వామి అని ఆయన చెప్పారు.
భారత-డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతను డెన్మార్క్ వాతావరణం, ఇంధనం, యుటిలిటీల శాఖ మంత్రి వివరించారు. డెన్మార్క్ కు నైపుణ్యాలు, భారతదేశానికి పరిధి ఉన్నాయన్న భారత ప్రధానమంత్రి మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
గత ఐదు సంవత్సరాల కాలంలో ఇంధన లోటు దేశాన్ని ఇంధన మిగులు దేశంగా మార్చడంలోను, ప్రతీ ఒక్క జనావాస ప్రాంతం, గ్రామానికి విద్యుత్ సరఫరా అందుబాటులోకి తేవడంలోను, 18 నెలల కాలంలో 28 మిలియన్ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు అందించడంలోను భారతదేశం సాధించిన విజయాలను, శ్రీ ఆర్.కె.సింగ్ వివరించారు. భారతదేశం పునరుత్పాదక ఇంధన వృద్ధిలో సాధించిన పురోగతి అత్యధికమని ఆయన చెప్పారు. ఈ విజయాలు సాధించానికి అండగా నిలిచిన, స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించిన ప్రధానమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
****
(Release ID: 1676720)
Visitor Counter : 210