సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సమగ్ర ఆరోగ్య రక్షణ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజెప్పిన కరోనా: జితేంద్ర సింగ్

Posted On: 26 NOV 2020 6:37PM by PIB Hyderabad

   సమగ్రమైన ఆరోగ్య రక్షణా వ్యవస్థకు గల ప్రాముఖ్యతను కరోనా వైరస్ మహమ్మారి మనకు తెలియజెప్పిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రమఖ మధుమేహ వ్యాధి చికిత్సా నిపుణుడైన జితేందర్ సింగ్ ఒక అంతర్జాతీయ వెబినార్ సమ్మేళనంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మధుమేహ వ్యాధి అధయన, పరిశోధనా సంస్థ (ఆర్.ఎస్.ఎస్.డి.ఐ.) నిర్వహించిన 48వ వార్షిక  సమ్మేళనంలో జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,  ప్రతికూల అనారోగ్య పరిస్థితుల్లో కొత్త నియమాలను కనిపెట్టడానికి కోవిడ్ మనకు అవకాశం కల్పించిందన్నారు. కోవిడ్ కారణంగా, భారతీయ సంప్రదాయ వైద్య వ్యవస్థ ప్రాముఖ్యత ఏమిటో అవగతమైందన్నారు.

   కోవిడ్ మహమ్మారి ప్రబలడానికి ముందు రోజుల్లో కూడా,.. అంటువ్యాధులు కాని మధుమేహం వంటి కొన్ని రుగ్మతల చికిత్సలో ఇన్సులిన్ మోతాదును, నోటిద్వారా తీసుకునే మందులను తగ్గించాలని ఆధార సహితంగా రుజువైందని, కొన్ని యోగాసనాలు, ప్రకృతి వైద్యం సహాయంతో జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మధుమేహం లాంటి వ్యాధులను అదుపుచేసుకోవచ్చని రుజువైనట్టు ఆయన తెలిపారు.

 

  కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో దీర్ఘ కాల వ్యాధుల ప్రభావం గురించి రోగులకు వివరించవలసిన అదనపు బాధ్యత మధుమేహ వ్యాధి చికిత్సా నిపుణులకు ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో ఇతర వైద్య విధానాల సామర్థ్యాన్ని శంకించిన అలోపతి వైద్య నిపుణులు కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తమ వైఖరి మార్చుకున్నారని, ఆయుర్వేద, యోగా విధానాల్లో రోగనిరోధక శక్తి పెంపొందించే మందులపై, పద్ధతులపై వారు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన అన్నారు.

  వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి ఆర్.ఎస్.ఎస్.డి.ఐ. అవార్డులను మంత్రి ఈ సదస్సు సందర్భంగా ప్రదానం చేశారు. మధుమేహ వ్యాధి నియంత్రణకు మార్గదర్శక సూత్రాలను విడుదల చేశారు. 2020వ సంవత్సరం వరకూ మధుమేహ వ్యాధిపై తాజా సమాచారాన్ని, వార్షిక కేసు బుక్ ను, ఆర్.ఎస్.ఎస్.డి.ఐ. డయాబిటిస్ ఇయర్ బుక్.ను ఆవిష్కరించారు. ఆర్.ఎస్ఎస్.డి.ఐ. అధ్యక్షుడు డాక్టర్ బన్షీ సాబూ, అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐ.డి.ఎఫ్.) అధ్యక్షుడు డాక్టర్ ఆండ్రూ బౌల్టన్, ఐ.డి.ఎఫ్. ఆగ్నేయాసియా విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్ శశాంక్ జోషి, పలువురు వృత్తి నిపుణులు ఈ అంతర్జాతీయ వెబినార్ సదస్సులో పాలుపంచుకున్నారు.

<><><><><>

 



(Release ID: 1676258) Visitor Counter : 152