వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత్, మయన్మార్ మధ్య ఉమ్మడి వాణిజ్య కమిటీ 7వ సమావేశం

Posted On: 24 NOV 2020 8:01PM by PIB Hyderabad

భారత్ మరియు మయన్మార్ మధ్య 7వ ఉమ్మడి వాణిజ్య కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో నవంబర్ 24, 2020 న జరిగింది. ఈ సమావేశానికి మయన్మార్ వాణిజ్యశాఖ మంత్రి డాక్టర్ థాన్‌, భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి, బ్యాంకింగ్, అనుసంధానం, సామర్థ్యం పెంపు, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ ద్వైపాక్షిక సమస్యలపై ఇరుపక్షాలు సమీక్షించాయి. కొవిడ్-19 సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు సాంప్రదాయ మందులు, ఫార్మా మరియు ఆరోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు తమ సంసిద్ధతను సమీక్షించాయి.

భారతదేశం మరియు మయన్మార్ మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక మరియు వాణిజ్య సంబంధాలను శ్రీ పియూష్ గోయల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్‌కు చెందిన 'నైబర్‌హుడ్ ఫస్ట్' మరియు 'యాక్ట్ ఈస్ట్' విధానాలకు అనుగుణంగా మయన్మార్‌తో భాగస్వామ్యానికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

వాణిజ్యం మరియు పెట్టుబడులు, ఆయిల్ & గ్యాస్, విద్యుత్, భీమా, ఔషధ, మౌలిక సదుపాయాలతో సహా పలు రంగాలలో మయన్మార్‌తో బహుముఖ సహకారాన్ని పెంపొందించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. అలాగా ఆయా రంగాల్లో మయన్మార్‌లో భారతదేశానికి చెందిన పెట్టుబడుల పెరుగుదలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, మయన్మార్ దేశాల చమురు మరియు గ్యాస్ కంపెనీల మధ్య సహకారం ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు శుద్ధి రంగంలో ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం వాస్తవ సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లేదని ఇరు దేశాలు అంగీకరించాయి. పలు రంగాల్లో సహకారాన్ని మరియు వాణిజ్య ప్రోత్సాహాన్ని సులభతరం చేయడం ద్వారా..ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి నిబద్ధతను వ్యక్తం చేశాయి. కనెక్టివిటీ ప్రాజెక్టుల ప్రగతిని, వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి సరిహద్దు వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై ఇరుదేశాల ప్రతినిధులు సమీక్షించారు. ద్వైపాక్షిక అనుసంధానం మరియు వాణిజ్యాన్ని పెంచేందుకు ఇండియన్ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద తము వద్ద ఆధునిక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసిపి) ఏర్పాటుపై ప్రాజెక్ట్ ఒప్పందం ఖరారు చేసినందుకు ఇరుపక్షాలు ప్రశంసలు వ్యక్తం చేశాయి. అలాగే స్థానిక వర్గాల ప్రయోజం కోసం సరిహద్దుల్లో ప్రజల మధ్య కనెక్టివిటీ పెంచెందుకు ఇరువర్గాలు అంగీకారం తెలిపాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలలో సాధించిన ప్రశంసనీయమైన ప్రగతిపై ఇరు దేశాలు సంతృప్తి వ్యక్తం చేయడంతో సమావేశం ముగిసింది.అలాగే వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరుదేశాలు నిబద్ధతను చాటాయి. 2021లో భారతదేశంలో జరగబోయే తదుపరి ఉమ్మడి వాణిజ్య కమిటీ సమావేశానికి శ్రీ గోయల్ డాక్టర్ దాన్ మైంట్ కు ఆహ్వానం పలికారు.

***


(Release ID: 1675999) Visitor Counter : 198


Read this release in: English , Urdu , Hindi , Manipuri