ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించడంలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చలు జరిపిన డాక్టర్ హర్ష్ హర్ష వర్ధన్ దిశ దశలను నిర్దేశించనున్న మంత్రి

'కోవిడ్ నేపథ్యంలో క్షయ వ్యాధిని విస్మరించరాదు.

చైతన్యం, సమన్వయంతో ముందుకు సాగాలి '

క్షయ వ్యతిరేకంగా పోరాటం ప్రజా ఉద్యమంగా సాగాలి

క్షయపై ఉన్నఅపోహలను పారదోలాలి

Posted On: 25 NOV 2020 5:56PM by PIB Hyderabad

హైదరాబాద్, నవంబర్25'క్షయవ్యాధిని నిర్మూలించడానికి చేపడుతున్నకార్యక్రమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దు కోవాలి. వ్యాధిపై అవగాహన  కల్పించి నివారణ మరియు నిర్మూలన అంశాలపై ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా ఒక సమాచార వ్యవస్థకు రూపకల్పన చేయవలసిన అవసరం ఉంది. దీనిలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా చూసి కార్యక్రమాలు సక్రమంగా లక్ష్యాలను చేరుకునేలా అమలు జరిగేలా చూడాలి' అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. దేశంలో క్షయవ్యాధిపై దృష్టి సారించి వ్యాధి వ్యాపించకుండా, నిర్మూలన అంశాలపై పనిచేస్తున్న వారితో మంత్రి సమావేశం అయ్యారు. దేశంలో 2025 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి దీనిపై పనిచేస్తున్నవారందరూ ఒక వేదిక మీదకి వచ్చి కలసి పనిచేసేలా చూడడానికి చర్యలను తీసుకోవలసి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వివిధ అంశాలపై జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా పనిచేసి వ్యాధిని ఏ విధంగా నిర్మూలించాలన్న అంశంపై సమావేశంలో చర్చించారు.

క్షయవ్యాధిని నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో పాటు రాజకీయ సహకారం కూడా అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఆయన కోరారు.క్షయవ్యాధిని నిర్మూలించడానికి కృషి చేస్తున్నవారు రాజకీయపరమైన సహకారాన్ని పొందడానికి పనిచేయాలని అన్నారు.తమ రాష్ట్రాలలో క్షయవ్యాధిని నిర్మూలించామంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంపుతున్న నివేదికలను వీరు పరిశీలించాలని ఆయన అన్నారు. క్షయవ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించడం ద్వారా వ్యాధిని అరికట్టి నిర్మూలించవచ్చునని మంత్రి అన్నారు. కొన్ని అపోహల వల్ల వ్యాధి సోకినవారు చికిత్స చేయించుకోడానికి ముందుకు రావడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యాధి నిర్మూలన కోసం పనిచేస్తున్నవారు ప్రజల నుంచి వివరాలను సేకరిస్తూ నిర్మూలనా కార్యక్రమాలు ఏ మేరకు పటిష్టంగా అమలు జరుగుతున్నాయన్న అంశంపై పూర్తి వివరాలను సేకరించాలని అన్నారు.

పోలియో మరియు క్షయవ్యాధితో సహా వివిధ ప్రజారోగ్య అంశాలలో ప్రభుత్వానికి సహకరిస్తున్న వారికి  డాక్టర్ హర్షవర్ధన్  కృతజ్ఞతలు తెలిపారు.

 పోలియో నిర్మూలన కోసం తాను చేసిన ప్రయత్నాలను గుర్తుచేసుకుంటూ "ప్రతి సవాలు ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. ఎక్కువ  జనాభా కలిగిన  భారతదేశం వంటి దేశంలో పోలియోను నిర్మూలించడం అంత సులభం కాదు. కానీ ప్రతి ఒక్కరి సహకారంతో భారతదేశం ఈ వ్యాధిని నిర్మూలించగలిగింది. ఈ విషయంలో ఇతర దేశాలకు భారతదేశం మార్గదర్శిగా నిలిచింది' అని మంత్రి అన్నారు.

'క్షయవ్యాధి నిర్మూలనలో భాగస్వాములందరి మద్దతు కీలకం. గత 11 నెలల నుండి దేశం నిరంతరం ఒక మహమ్మారితో పోరాడుతోంది. కోవిడ్ నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో  2025 నాటికి దేశం నుంచి క్షయవ్యాధిని నిర్మూలించాలన్నలక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. కొవిడ్ పై నిర్వహించిన ప్రతి సమావేశంలో క్షయవ్యాధిపై చర్చించడం జరిగింది' అని మంత్రి వివరించారు. 2025 నాటికి దేశం నుండి టిబిని నిర్మూలించే అంశాన్ని ప్రస్తావించిన మంత్రి  "మనం కాలంతో పోటీ పడుతూ పనిచేస్తున్నాం. దూరదృష్టి, సక్రమ అమలు ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చును' అని అన్నారు. "గత రెండు సంవత్సరాల్లో"టిబి హరేగా, దేశ జీటెగా"ప్రచారం ప్రకారం దేశం గణనీయమైన విజయాన్ని సాధించింది.  ఇది 2025 నాటికి టిబిని నిర్మూలించాలన్నలక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. ముందు నిర్ణయించుకున్న విధంగా 2030  నాటికి కాకుండా ఐదు సంవత్సరాల ముందుగా 2025 నాటికి వ్యాధిని నిర్మూలించాలని నిర్ణయించాము' అని ఆయన తెలిపారు.

2017తో పోల్చి చూస్తే  2018 మరియు 2019 సంవత్సరాల్లో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద కేసుల సంఖ్యలో  వరుసగా 18% మరియు 12% పెరుగుదల ఉందని మంత్రి పేర్కొన్నారు. టిబి రంగంలో  లో ప్రైవేట్ రంగం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. 2025 నాటికి 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు టిబి నుండివిముక్తి సాధిస్తామని తెలిపాయని ఆయన చెప్పారు.కొవిడ్ రూపంలో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకుని లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

వ్యాధిని నిర్మూలించే దిశగా పనిచేయడానికి ఐక్యరాజ్య సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ఎన్జిఓల సహకారంతో కార్యక్రమాన్ని రూపొందిస్తామని  కార్యదర్శి (ఆరోగ్యం) శ్రీ రాజేష్ భూషన్ చెప్పారు.లక్ష్యాన్ని సాధించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్ననిర్ధారణ ల్యాబ్ సౌకర్యం, చికిత్సా సౌకర్యం, రోగి సహాయక వ్యవస్థ మరియు కమ్యూనికేషన్ ను బలోపేతం చేయడానికి భాగస్వాములందరూ సహకరించాలని కోరిన ఆయన నిర్దిష్ట ప్రణాళిక లక్ష్యాల సాధనకు దారితీస్తుందని  పేర్కొన్నారు.

ముగింపు సమావేశంలో మాట్లాడిన మంత్రి వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నాలకు మరింత పదును పెట్టాలని కోరారు.లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు వృధా పోకుండా చేయాలని ఆయన అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి షి వికాస్ షీల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు, బిల్ అండ్  మెలిండా గేట్స్ ఫౌండేషన్ , ఆసియా అభివృద్ధి బ్యాంకు, యూనిసెఫ్,యుఎన్ ఎయిడ్స్ , ఇంటర్నేషనల్ యూనియన్ ఎగైనెస్ట్ టిబి మరియు లంగ్ డిసీజెస్,. క్లింటన్ ఫౌండేషన్,ఇండియా, ప్రపంచ ఆరోగ్య భాగస్వాములు  యాక్షన్ హెల్త్ ప్రమోషన్ ట్రస్ట్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

***

 



(Release ID: 1675846) Visitor Counter : 419