ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయాలి - ఉపరాష్ట్రపతి

- ఈ దిశగా ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలి

- దీర్ఘకాలంగా ఆచరణకు నోచుకోని ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు’పై ఐక్యరాజ్యసమితి త్వరగా నిర్ణయం తీసుకోవాలి

- ఇందుకోసం ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

- మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి

- అవినీతి, పేదరికం, సామాజిక రుగ్మతలను తరిమేసేందుకు మనమంతా నిబద్ధతతో కృషిచేయాలని సూచన

- లాల్ బహూదూర్ శాస్త్రి విశిష్ఠ అవార్డును శ్రీమతి సుధామూర్తికి అంతర్జాల వేదిక ద్వారా అందజేసిన ఉపరాష్ట్రపతి..- సుధామూర్తి గారి సేవా కార్యక్రమాలను అభినందించిన ఉపరాష్ట్రపతి

- ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని యువతకు పిలుపు

Posted On: 21 NOV 2020 5:37PM by PIB Hyderabad

ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందించడంతోపాటు వెన్నుదన్నుగా నిలుస్తున్న దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వారిపై తీవ్రమైన ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారతదేశం ప్రతిపాదించిన ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు’కు ఐక్యరాజ్యసమితి ముందుకురావాలని.. దీనిపై అన్ని దేశాలతో చర్చలు జరపాలని సూచించారు.

‘లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ విశిష్ఠ అవార్డు - 2020’ కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఈ అవార్డును ప్రముఖ సామాజికవేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సుధామూర్తికి అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద ప్రభావం లేని దేశమే లేదని, అందుకే అన్ని దేశాలు ఏకమై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన కీలకమైన సమయమని పేర్కొన్నారు. దీంతోపాటుగా ఐక్యరాజ్యసమితిలో కీలక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచశాంతికి అవసరమైన ముఖ్యమైన నిర్ణయాలకు బీజం వేయాలని తెలిపారు. అన్ని దేశాలు, మరీ ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు కలిసి ఈ ప్రాంతంలో శాంతి స్థాపన, పేదరిక నిర్మూలన, సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడంతోపాటు ఉగ్రవాదాన్ని నిర్మూలించుకోవడంపై దృష్టిసారించాలని సూచించారు.

భారత మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి.. ఉన్నతమైన ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన శ్రీ శాస్త్రి గారి నిరాడంబరత, మానవతా విలువలను నేటితరం అర్థం చేసుకుని తమ జీవితాల్లో అవలంబించాలన్నారు. రాజనీతిజ్ఞత, హుందాతనంతోపాటు నైతిక విలువల విషయంలో రాజీలేకుండా ప్రభుత్వాన్ని వారు నడిపిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు.

సమర్థవంతంగా విషయాన్ని తెలియజేయడం, నైపుణ్యవంతమైన, ఫలప్రదమైన చర్చలు జరపడం శ్రీ శాస్త్రి గారి ప్రత్యేకతన్న ఉపరాష్ట్రపతి, అవతలి వ్యక్తి కోణంలోనూ ఆలోచించి మాట్లాడం ద్వారా వారు అందరి మనసులు గెలుచుకునేవారన్నారు. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిగారి చొరవకారణంగానే.. దేశంలో శ్వేత విప్లవం, హరిత విప్లవం ప్రారంభమయ్యాయని.. తద్వారా ఆహార భద్రతతోపాటు ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా భారతదేశం నిలిచిందన్నారు.

కరోనా సందర్భంగా వివిధ రంగాల్లోని మొదటి వరుస యోధులను ఈ సందర్భంగా ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, లాక్ డౌన్ ఆంక్షల సమయంలోనూ మన రైతులు చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు. వారి కృషికారణంగానే ఆహారోత్పత్తికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదని, వీరితోపాటు వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, భద్రతాసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా సిబ్బంది కూడా కరోనా ఆపత్కాల సమయంలో ముందు వరస యోధులుగా తమసేవలను అందించారని, వారందరినీ మన:పూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. 

కేంద్రంతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగానే.. కరోనా నష్టాన్ని భారీగా నివారించగలిగామన్న ఉపరాష్ట్రపతి, కరోనా సమయంలో బాధితులను ఆదుకునేందుకు చాలా చోట్ల పలువురు తమ మానవతాదృక్పథాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. సర్వేజనా సుఖినోభవంతు, వసుధైవ కుటుంబకం వంటి భారతీయ మూలసూత్రాల కారణంగానే మన సమాజం మానవత్వాన్ని చాటుకుంటోందని తెలిపారు. భగవద్గీతలోనూ సేవానిరతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారన్న ఉపరాష్ట్రపతి.. దానం గురించి భారతీయ ప్రాచీన గ్రంథాలన్నీ ప్రత్యేకంగా చెబుతున్నాయని ఆయన గుర్తుచేశారు. రాజుల నుంచి భూస్వాములు, వ్యక్తులు, స్వచ్ఛంద  సంస్థలనుంచి కంపెనీల వరకు ప్రతి సందర్భంలోనూ సేవానిరతి కొనసాగుతుందంటే అది మన సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించిన విలువనే అని తెలిపారు.

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ విశిష్ఠ అవార్డును అందుకున్న ప్రముఖ సామాజికవేత్త, రచయిత శ్రీమతి సుధామూర్తిని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా వెనుకబడిన వర్గాలకోసం విద్య, వైద్యం, వ్యక్తిగత స్వచ్ఛత, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చోదక శక్తిగా వారికి వచ్చిన ప్రశంసలు, గౌరవాలు, అవార్డులకు వారు అర్హులని, వారి ఆదర్శవంతమైన సేవల ద్వారా వారు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. శ్రీమతి సుధామూర్తిని సత్కరించడం ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుందన్న ఉపరాష్ట్రపతి, ఆమెను ఆదర్శ మహిళగా అభివర్ణించారు. ఆమె జీవితం గురించి తెలుసుకుని మహిళలు ఆమె స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. పురాతన భారతీయ విలువలైన నలుగురితో పంచుకోవడం – నలుగురి పట్ల శ్రద్ధ వహించడం (షేర్ అండ్ కేర్) గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. వృత్తిలో సాధించిన విజయాల కంటే సేవ మార్గంలో వచ్చే ఆనందం ఉన్నతమైనదని తెలిపారు.

లాల్ బహదూర్ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎల్బీఎస్ఐఎమ్) ఆధ్వర్యంలో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు జాతికి చేసిన సేవలను, వివిధరంగాల్లో వారి ముద్రను గుర్తుచేసేలా ‘జాతీయ విశిష్ఠ అవార్డు’ను ఏర్పాటుచేయడాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ అవార్డులు వివిధ రంగాల్లో విస్తృతమైన, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్న వారి శ్రమను గుర్తించడానికి మాత్రమే కాదని.. వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఈ క్షేత్రాల్లో సేవాకార్యక్రమాలు చేపట్టేందుకు ఈ అవార్డులు ప్రేరణ కల్పిస్తాయన్నారు. పాఠశాల విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించేలా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు జీవిత గాథలను, వారి సందేశాలను పాఠ్యప్రణాళికలో భాగం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి సుధామూర్తి, ఎల్బీఎస్ఐఎమ్ చైర్మన్ శ్రీ అనిల్ శాస్త్రి, దౌత్యవేత్త ప్రొఫెసర్ డీకే శ్రీవాత్సవతోపాటు ఇనిస్టిట్యూట్ అధ్యాపక బృందం, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

****



(Release ID: 1674794) Visitor Counter : 126