వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భవిష్యత్తు అవసరాల కోసం తక్కువ ఖర్చు మరియు వినూత్న ఆరోగ్య విధానాలను చేపట్టడంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది: శ్రీ పియూష్ గోయల్

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఆసియా హెల్త్ 2020 సమావేశంలో శ్రీ పియూష్ గోయల్ ప్రసంగించారు

Posted On: 20 NOV 2020 4:53PM by PIB Hyderabad

ఆస్పత్రులు, వైద్యులతో పాటు కరోనా యోధులను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రశంసించారు. ఒకదేశంగా మనం అందించే అత్యున్నత ప్రశంసలకు వారంతా అర్హులని అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఆసియా హెల్త్ 2020 సదస్సులో ప్రసంగించిన ఆయన..వారి త్యాగం ఫలించిందని అన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడిన శ్రీ గోయల్..మన దేశంలో వ్యాక్సిన్ పరిశోధన అత్యంత వేగంగా జరుగుతోందని అయితే  టీకా వచ్చే వరకూ మహమ్మారిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రధాని చెప్పారని అన్నారు. మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందన్నారు. దేశంలో లాక్‌డౌన్‌ అమలును సమర్ధించిన ఆయన..మహమ్మారిపై పోరాటానికి దేశాన్ని సిద్ధం చేయడంలో అది ఎంతగానో ఉపయోగపడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని గుర్తు చేశారు. అనేక ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతీయులు మహమ్మారి పట్ల అప్రమత్తంగా వ్యవహారించారని చెప్పారు. భారతదేశం కఠినంగా అమలు చేసిన లాక్డౌన్ ప్రపంచవ్యాప్తంగా ఒక రోల్ మోడల్‌గా గుర్తించబడిందని దేశంలో అద్భుతమైన రికవరీ రేటు  నమోదు చేయడానికి అది సహాయపడిందని అన్నారు.

సిఐఐ ప్రయత్నాలను అభినందించిన శ్రీ గోయల్ "ఆసియా హెల్త్ 2020 వంటి కార్యక్రమాలు కొత్త ఆలోచనలకు ఊపిరి పోస్తాయని, దేశంలోని అనేక సమస్యలకు కొత్త పరిష్కారాలు లభిస్తాయని, చివరి లబ్దిదారుడికి ప్రయోజనాన్ని అందించడంతో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు పంపిణీకి సహాయపడతాయని చెప్పారు. 130 కోట్లమంది భారతీయులకు సరైన కోవిడ్ చికిత్స అందించేందుకు తాము ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నామన్నారు. భవిష్యత్తులో చేయబోయే యుద్దాలకు ఇది సహకరిస్తుందని ఆయన అన్నారు. తక్కువ అభివృద్ధి చెందిన దేశాలతో పాటు పేదలకు అందుబాటు ధరకు టీకాలు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను శ్రీ గోయల్ నొక్కిచెప్పారు. అది మనందరికీ సమిష్టి బాధ్యత అని అన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం తక్కువ ఖర్చు మరియు వినూత్న ఆరోగ్య విధానాలను చేపట్టడంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

టీకా కనుగొనే ఈ ప్రయత్నం మనందరినీ ఒకచోటకు చేర్చిందని శ్రీ పియూష్ గోయల్ అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మహమ్మారి సమస్యను అధిగమించడానికి, నిలవడానికి, స్వీకరించడానికి ఇది ఎంతగానే సహాయపడుతుందన్నారు. ప్రపంచాన్ని, మానవత్వాన్ని కొవిడ్ ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందని..ఉమ్మడి ప్రయోజనం కోసం నేడు ప్రపంచం ఒక్కటై పోరాడుతోందని అన్నారు.

***


(Release ID: 1674575) Visitor Counter : 171