ఆర్థిక మంత్రిత్వ శాఖ
మేఘాలయ సమీకృత రవాణా ప్రాజెక్ట్ (ఎంఐటీపీ) అమలుకు భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య 120 మిలియన్ డాలర్ల ఒప్పందం
Posted On:
19 NOV 2020 6:48PM by PIB Hyderabad
మేఘాలయ రాష్ట్ర రవాణా రంగాన్ని మరింత మెరుగుపరచడానికి, మేటిగా ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం, మేఘాలయ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ ఈ రోజు 120 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుపై సంతకం చేశాయి. అధిక విలువ కలిగిన వ్యవసాయ, పర్యాటక రంగం కోసం మేఘాలయ యొక్క విస్తారమైన వృద్ధి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మేఘాలయ సమీకృత రవాణా ప్రాజెక్ట్ (ఎంఐటీపీ) సహాయపడుతుంది. వినూత్న, వాతావరణ స్థితిస్థాపకత, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ఉపయోగించడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌లో సుమారు 300 కిలో మీటర్ల వ్యూహాత్మక రహదారులను, స్వతంత్ర వంతెనలను మరింతగా మెరుగుపరుస్తారు. నిర్మాణ సమయం మరియు ఖర్చు రెండింటినీ తగ్గించడానికి ప్రీకాస్ట్ వంతెనలు వంటి వినూత్న పరిష్కారాలకు ఈ ప్రాజెక్ట్ మద్దతు ఇస్తుంది.
ఈ సందర్భంగా ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ సి.ఎస్. మోహపాత్రా మాట్లాడుతూ ఏ ప్రాంతం యొక్క ఆర్ధిక అభివృద్ధయినా.. అక్కడి రహదారి మౌలిక వసతులతో దగ్గర సంబంధం ఉంటుందన్నారు. మేఘాలయ
రాష్ట్రం, ఇక్కడి ప్రజల ఆర్థిక అభివృద్ధికి కీలకమైన నమ్మకమైన, వాతావరణ స్థితిస్థాపకత మరియు సురక్షితమైన రహదారులను అభివృద్ధి చేయడానికి గాను ఎంఐటీపీ ఎంతగానో సహాయపడుతుందని వివరించారు. ఈ రుణ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరపున డాక్టర్ సి.ఎస్. మోహపాత్రాతో పాటు ప్రపంచ బ్యాంక్ తరపున ప్రపంచ బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ (ఇండియా) శ్రీ హిడేకి మోరి సంతకాలు చేశారు. కాగా, ఈ ప్రాజెక్టు ఒప్పందంపై మేఘాలయ ప్రభుత్వం తరపున కమిషనర్, ప్లానింగ్ విభాగ కార్యదర్శి డాక్టర్ డి.విజయ్ కుమార్ ప్రపంచ బ్యాంక్ తరపున ప్రపంచ బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ (ఇండియా) శ్రీ హిడేకి మోరి సంతకం చేశారు. కఠినతరమైన కొండలతో కూడిన భూభాగం మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు మేఘాలయ రవాణాకు సవాళ్లను విసురుతూ
ఇక్కడ రహదారుల వ్యవస్థను ముఖ్యంగా క్లిష్టతరం చేస్తోంది. నేటి వరకు ఈ రాష్ట్రంలోని 5,362 ఆవాసాలలో సగం వాటికి రవాణా అనుసంధానతయే లేదు.
ఈ ప్రాజెక్ట్ మేఘాలయ రాష్ట్ర వృద్ధి సామర్థ్యాన్ని రెండు విధాలుగా దోహదం చేయగలదని శ్రీ మోరి నొక్కి చెప్పారు. రాష్ట్రంలో చాలా అవసరమైన రవాణా కనెక్టివిటీని ఇది అందిస్తుందని తెలిపారు. ఇది బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా మరియు నేపాల్ కారిడార్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మేఘాలయను ప్రధాన అనుసంధానపు కేంద్రంగా మార్చుతుందని వివరించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభావితమైన అభివృద్ధి కార్యకలాపాలను మళ్లీ తిరిగి ప్రారంభించేందుకు మరియు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క “రిస్టార్ట్ మేఘాలయ మిషన్"కు ఈ ఆపరేషన్ మద్దతు ఇస్తుంది. ఇది రవాణా సేవలను పునరుద్ధరించడానికి మరియు సుమారు 8 మిలియన్ల పని దినాలతో ప్రత్యక్ష ఉపాధిని కల్పించడానికి దోహదం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) నుండి దాదాపుగా 120 మిలియన్ డాలర్ల రుణం 14 సంవత్సరాల మెచ్యూరిటీతో లభించనుంది. దీనికి 6 ఏండ్ల గ్రేస్ పీరియాడ్ కూడా ఉంది.
***
(Release ID: 1674218)
Visitor Counter : 128