మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జెఎన్ యు నాలుగో వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి వీడియో సందేశం
Posted On:
18 NOV 2020 7:21PM by PIB Hyderabad
దేశంలోని పలుప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులెందరో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు. విభిన్నమైన కెరీర్లలో స్థిరపడడం కోసం జెఎన్ యు విశ్వవిద్యాలయ విద్యార్థులు శ్రమిస్తుంటారు. వైవిధ్యత,ప్రతిభ, అన్ని వర్గాలకు చెందిన విద్యార్థుల కలయికకు విశ్వవిద్యాలయం ప్రాతినిధ్యంవహిస్తోందని రాష్ట్రపతి శ్రీ రామ్ దాధ్ కోవింద్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. నవంబర్ 18న జరిగిన జెన్ యు నాలుగో వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా ఆయన తన వీడియో సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతిలోని అన్ని ఛాయలు జెన్ యు లో ప్రతిఫలిస్తుంటాయని రాష్ట్రపతి అన్నారు. క్యాంపస్సులో పలు నిర్మాణాలకు పెట్టిన పేర్లకు భారతీయ వారసత్వమే మూలమని అన్నారు. జెన్ యు వారసత్వంలో భారతీయత దాగి వుందని ఆయన పేర్కొన్నారు.
జెఎన్ యులో అత్యుత్తమ స్థాయి గురువులు చదువులు చెబుతున్నారని, స్వేచ్ఛాపూరిత చర్చలకు నెలవుగా వుందని రాష్ట్రపతి అన్నారు. ఇక్కడి అధ్యాపకులు తమ విద్యార్థులను విద్యార్జనలో భాగస్వాములుగా పరిగణిస్తారని అన్నారు. యూనివర్సిటీ తరగతి గదుల్లోను, విశ్వవిద్యాలయ ఆవరణలోను నిత్యం ఉత్తమ చర్చలు నిర్వహిస్తుంటారని పేర్కొన్నారు.
విద్యాబోధనలోను, పరిశోధనల్లోను భారతదేశానికి ఎంతో గొప్ప చరిత్ర వుందని అన్నారు. గతంలో దేశంలో ఉన్నతస్థాయిలో విలసిల్లిన తక్షశిల, నలందా, విక్రమశిల, వల్లభి విశ్వవిద్యాలయాలనుంచి నేటి విద్యార్థులు స్ఫూర్తి పొందవచ్చని, తద్వారా సవాళ్లను అధిగమించవచ్చని రాష్ట్రపతి అన్నారు. భారతదేశ పురాతన విశ్వవిద్యాలయాలనుంచి చరక, ఆర్యభట్ట, చాణక్య, పాణిని, పతంజలి, గార్గి, మైత్రేయి, తిరువల్లువర్ మొదలైన మేధావులు తయారయ్యారని రాష్ట్రపతి గుర్తు చేశారు. పలు రంగాల్లో వారు ఎంతో గొప్ప కృషి చేశారని, భారతీయ పండితులు, మేధావులు సృష్టించిన జ్ఞానసంపద ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించిందని అన్నారు. ఉన్నత విద్యాబోధనలో జెఎన్ యూ కూడా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిందని, ప్రపంచస్థాయిలో పోల్చదగ్గ ప్రతిభాస్థాయికి చేరుకుంటుందని అన్నారు.
కరోనా మహమ్మారి గురించి మాట్లాడిన రాష్ట్రపతి దీని కారణంగా ప్రపంచం సంక్షోభంలో వుందని అన్నారు. అంటువ్యాధులు, మహమ్మారి వ్యాధుల నేపథ్యంలో వాటికి సంబంధించిన అన్ని రకాల రోగాలు, నివారణ, చికిత్సలపైన ఉన్నత విద్యాసంస్థలు పరిశోధన చేయాలని జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంటున్నదని రాష్ట్రపతి అన్నారు. తద్వారా వచ్చే సామాజిక సమస్యలను అధ్యయనం చేయాలని ఆయన కోరారు. ఈ పనిలో భాగంగా జెఎన్ యూ లాంటి విశ్వవిద్యాలయాలు ముందు భాగాన నిలిచి విద్యాలోకంలో ఆవిష్కరణలను ప్రోత్సహించాలని అన్నారు.
పిహెచ్ డి పట్టాలు పొందుతున్న విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ అభినందనలు తెలిపారు. విద్యార్థులు భారతీయ విలువలను పాటిస్తూ మిగతావారికి ఆదర్శంగా నిలిచి, జాతీయ నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ విద్యావిధానం -2020 ప్రాధాన్యతను వివరించారు. ఎన్ ఆర్ ఎఫ్ ర్యాంకును క్రమం తప్పకుండా సాధిస్తున్నందుకు జెన్ యును ఆయన అభినందించారు. హెచ్ ఇ ఎఫ్ ఏ నిధిని పొందినందుకుగాను విశ్వవిద్యాలయాన్ని అబినందించారు. అటల్ ఇన్నోవేషన్ సెంటర్, ఇంకా ఇతర స్టార్టప్ లను జెఎన్ యు ఏర్పాటు చేసినందుకుగాను ప్రశసించారు. వాటి ద్వారా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడం జరుగుతుందని అన్నారు. మహిళా ప్రగతిని ఆకాంక్షిస్తూ వారికోసం ఎన్ సిసి ప్రోగ్రామ్ ప్రారంభించినందుకుగాను జెన్ యు కృషిని ప్రశసించారు.
జె ఎన్ యు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సాధించిన విజయాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన నివేదికను సమర్పించారు. నూతన విద్యాకేంద్రాల స్థాపన, ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు ద్వారా జరుగుతున్న కృషిని తెలిపారు. విశ్వవిద్యాలయ ఉత్పత్తుల గురించి వివరించారు. జాతీయ విద్యావిధానం ప్రకారం సమన్వయం చేసుకుంటూ ఉన్నత విద్యారంగంలో ఉన్నతిని సాధించడానికిగాను జెఎన్ యు కృషి చేస్తోందని అన్నారు. స్వామి వివేకానందుల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని ఇది విద్యార్థులకు తగిన స్ఫూర్తిని అందిస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వి.కె.సారస్వత్ పరిశోధన పట్టాలు పొందిన విద్యార్థులను అభినందించారు. జాతి నిర్మాణంలో విద్యార్థులు తమ పాత్రను పోషించాలని కోరారు. ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కోసం అవసరమైన అంశాల్లో విద్యార్థులు కృషి చేయాలని దేశం భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. విద్యార్థులు పలు రంగాల్లో నిర్మాణాత్మకంగా పని చేసి సేవలందించాలని అన్నారు. జెఎన్ యులాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు తర్వాతి దశల్లో రెండు మూడు స్థాయిల్లో వున్న నగరాల్లో ఉద్యోగ ఉపాధి కల్పన చేయగలిగే సామర్థ్యం కలిగి వున్నారని ఆయన అన్నారు.
జెన్ యు కు సంబంధించి వివిధ విభాగాలకు చెందిన 603 మంది విద్యార్థులు పిహెచ్ డి పట్టాలు పొందారు. కోవిడ్ -19 మహమ్మారి సమస్య వున్నప్పటికీ తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ జెన్ యు పరిశోధక విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించడం జరిగింది.
.....
(Release ID: 1673935)
Visitor Counter : 156