ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యుటివ్ బోర్డ్
సమావేశానికి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత
వైద్య వ్యవస్థల బలోపేతానికి అంతర్జాతీయ భాగస్వామ్యం,
పెట్టుబడి ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన భారత్
అందరికీ ఆరోగ్యం సాధించకపోతే మెరుగైన
భవిష్యత్ అసాధ్యం: డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
16 NOV 2020 3:23PM by PIB Hyderabad
ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యుటివ్ బోర్డ్ సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత వహించారు. ఆయన ప్రారంభోపన్యాసం ఇలా సాగింది:
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యుటివ్ బోర్డు గౌరవ సభ్యులకు, మంత్రులకు, ఇతర సభ్య దేశాల ప్రతినిధులకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ కు, ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్లకు, ఇతరప్రాంతాల ప్రాంతీయ డైరెక్టర్లకు, ఇక్యరాజ్య సమితి సంస్థల అధిపతులు, ప్రతినిధులకు, భాగస్వామ్య సంస్థలకు, సోదర సోదరీమణులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి నా హృదయపూర్వక స్వాగతాభివందనాలు!
పునఃప్రారంభమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ 147వ ఎగ్జిక్యుటివ్ బోర్డ్ సమావేశంలో మనం ఈరోజు మరోమారు వర్చువల్ గా కలుసుకుంటున్నాం. ఈ అనూహ్య సమయంలో కలుసుకున్న మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఏమైనా, 2020 మన మధ్య ఉమ్మడి సహకారానికి ప్రతిరూపమైన సంవత్సరం.
మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పేదరికం, ఆకలి, అసమానత, వాతావరణ మార్పులు, కాలుష్యం, హింస, యుద్ధం, వ్యాధులు లాంటి అనేక సవాళ్లను ఇప్పటికే ఎదుర్కుంటున్నాం, పోరాడుతున్నాం. ఇప్పుడు ముంచుకొచ్చిన మహమ్మారి మనల్ని కదిలించి వేసింది. కానీ దీనికి భయపడకుండా ప్రపంచ దేశాలుగా మనమంతా కలసి పోరాటానికే దిగాం.
మనం ఆశావహంగా ఉంటూ సాధించే దాకా పోరాడాలనే నిర్ణయించుకున్నాం. మెరుగైన భవిష్యత్ మన లక్ష్యం. అందరికీ ఆరోగ్యం సాధించకపోతే మనకు మెరుగైన భవిష్యత్ ఉండదు. మనకు తెలిసిన పాఠాన్నే మనం మళ్ళీ నేర్చుకున్నాం.
భారత్ లో మేం పరస్పరం “ఆయుష్మాన్ భవ” అని ఆశీర్వదించుకుంటాం. మీకు దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలి అని ఎదుటి వాళ్లగురించి కోరుకోవటం. నిజానికి అదే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశయం కూడా. ఇది మనందరినీ కలసికట్టుగా ఉంచుతుంది కాబట్టే మనమంతా ఈ రోజు ఇక్కడ ఉన్నాం.
సంస్థ సభ్య దేశాలన్నీ ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి. అన్నిటికంటే ఆరోగ్యానికే పెద్దపీట వేస్తాయి. అత్యంత తీవ్రమైన సంక్షోభసమయాల్లో మానవాళి పరస్పరసహకారంతో వనరులను కలబోసుకుంటూ ఉమ్మడి కృషితో ముందుకువెళ్ళే లక్ష్య సాధనలో సభ్యదేశాలన్నీ నాతో అంగీకరిస్తాయనుకుంటున్నా.
జాతి, మత, రాజకీయ విశ్వాసాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి మానవుడి ప్రాథమిక హక్కు అయిన అత్యున్నత ఆరోగ్య ప్రమాణాలు అనుభవించటమన్న సూత్రం ఈ సంస్థలో మనమంతా నమ్మేదే. అందుకే సభ్య దేశాలన్నీ అంకిత భావంతో కలసి కృషి చేద్దాం. ప్రజారోగ్యం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతోబాటు యావత్ మానవాళి సమర్థంగా బాధ్యతలు నెరవేరుద్దాం.
ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని, నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే సమస్యలను మనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేట్టు చెసింది ఈ కోవిడ్ మహమ్మారి. ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభ సమయంలో రిస్క్ తగ్గించుకోవటం, రిస్క్ ను అధిగమించటం రెండూ అవసరమే. అప్పుడే ప్రపంచ భాగస్వామ్యం బలపడుతుంది. ప్రపంచ ప్రజారోగ్య వ్యవస్థలో పెట్టుబడికి ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ప్రతి సభ్యదేశంతో మన అనుబంధం, భాగస్వాములతో పరస్పర కలయిక వలన సంస్కరణలు బలోపేతం అవుతాయి. ఇవి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశలో వేగవంతం కావటానికి, వనరులను సమర్థంగా వాడుకుంటూ విశ్వమంతటా ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తాయని నా ప్రగాఢ విశ్వాసం
భారతదేశపు ఆరోగ్యశాఖామంత్రిగా ఉండటం వలన నేనొక విషయం చెప్పదలచుకున్నా. ఆరోగ్య సేవలను, వాటి అందుబాటున, పంపిణీని, నాణ్యతను పెంచటానికి ఆగ్నేయాసియా ప్రాంతం, భారతదేశం విశేషంగా కృషి చేస్తున్నాయి. సహకారం ద్వారా ప్రాంతీయ ప్రాధాన్యాలలో విజయం చవిచూశాం. వైద్య సేవల అందుబాటును మెరుగుపరచటం, అందుబాటు ధరల్లో అందించటం, నాణ్యమైన అత్యవసర ఔషధాలు సమకూర్చటానికి వీలుగా ఈ విధమైన సాంకేతిక సహకారం, పరిశోధన, నవకల్పనలు, డిజిటల్ ఆరోగ్యం, భాగస్వామ్యాలు లక్ష్యంగా చేసుకొని పనిచేద్దాం.
మహాశయులారా,
ఈ కోవిడ్ మహమ్మారి 13 లక్షలకు పైగా విలువైన ప్రాణాలను హరించింది. మరెన్నో లక్షలమందికి సోకింది. కొట్లాది అంది జీవన అవకాశాలను దెబ్బతీసింది. ఈ భయంకర వ్యాధికారణంగా తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
ఈ సందర్భంగా కోవిడ్ మీద పోరాటానికి అహోరాత్రులు శ్రమించి నిస్వార్థ సేవలంచించిన డాక్టర్లకు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు వినమంగా నమస్కరిస్తున్నా. వాళ్ళందరినీ అభినందించటంలో మీరంతా నాతో గొంతు కలుపుతారని ఆశిస్తున్నా.
మహాశయులారా, గౌరవ ప్రతినిధులారా,
ఈ మహమ్మారి ప్రభావం చూపిన గడిచిన 10 నెలలకాలంలో ఆరోగ్యం విషయంలో నాయకత్వ స్థానంలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటినుంచీ సభ్య దేశాలన్నిటినీ కలుపుకుపోతూ చాలా గొప్ప సేవలందించింది. అవసరమైన సాంకేతిక సాయం అందిస్తూ వైద్య సేవలు అందించటంలో ఎంతగానో కృషి చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోబాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని సభ్య దేశాలు ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఆరోగ్య సంబంధమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవటానికి, మళ్లీ పాత పరిస్థితి పునరుద్ధరణకు అంకిత భావంతో కృషి చేస్తున్నాయి.
ప్రస్తుత సంక్షోభం నుంచి మనం నేర్చుకున్న పాఠాలను గుర్తించి వ్యవహరించటం ద్వారా మనం మరింత మెరుగైన పునరుద్ధరణ వ్యవస్థను రూపొందించుకోగలుగుతాం. ఆర్థికంగా కోలుకోవటానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు అది ఉపయోగపడుతుంది.
ఈ సంక్షోభం మొదలైనప్పటినుంచి సభ్యదేశాలన్నీ వేగంగా స్పందించాయి. వ్యాధి వ్యాప్తి నిరోధంలో సంఘీభావం ప్రకటించుకున్నాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యంగా పెట్తుకున్నాయి. మన మధ్య సహకారం పెంచుకోవాల్సిన సరైన సమయమిది. సభ్యదేశాలన్నీ ఐకమత్యంగా ఉంటూ ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేయాల్సి ఉంది. అప్పుడే లక్ష్యసాధన సాధ్యమవుతుంది.
మహాశయులారా,
ఈ రోజు మనం చాలా విస్తృతమైన ఎజెండా చేపట్టాం. ఇటీవల ముగిసిన 73వ ప్రపంచ ఆరోగ్య సమావేశం పునరుద్ధరణ గురించి. ఎగ్జిక్యుటివ్ బోర్డ్ బడ్జెట్ గురించి చర్చించుకుంటున్నాం. మీరంతా చురుగ్గా పాల్గొని దీన్ని ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నా. నామీద మీరుంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ముందు ముందు మరింత సహకారాన్ని మీ నుంచి కోరుకుంటున్నా. గడిచిన ఏడు దశాబ్దాలకాలంలో ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కున్నట్టే ఇకముందు కూడా పోరాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.
***
(Release ID: 1673239)
Visitor Counter : 264