శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దెబ్బతిన్న విద్యుత్ ప్రసరణ పునరుద్ధరణకు

స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త వ్యవస్థ

ఇ.ఆర్.ఎస్.ను రూపొందించిన సి.ఎస్.ఐ.ఆర్.-ఎస్.ఇ.ఆర్.సి.

Posted On: 14 NOV 2020 12:18PM by PIB Hyderabad

విద్యుత్ లైన్ల టవర్లలో ప్రసార వైఫల్యం జరిగినపుడు వెంటనే ప్రసారాన్ని పునరుద్ధరించే అత్యవసర పునరుద్ధరణ వ్యవస్థ (ఇ.ఆర్.ఎస్.) అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థను, వైజ్ఞానిక శాస్త్రీయ, పారిశ్రామిక మండలి (సి.ఎస్.ఐ.ఆర్.) అంతర్భాగమైన స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ పరిశోధనా కేంద్రం (ఎస్.ఇ.ఆర్.సి.) రూపొందించింది. చెన్నైకి చెందిన ఎస్.ఇ.ఆర్.సి. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను రూపొందించింది.  ఇ.ఆర్.ఎస్. సాంకేతిక పరిజ్ఞానం లైసెన్సింగ్ కు అనుమతి ఇస్తూ అహ్మదాబాద్ కు చెందిన మెసర్స్ అద్వైత్ ఇన్.ఫ్రాటెక్ సంస్థతో సి.ఎస్.ఐ.ఆర్.-ఎస్.ఇ.ఆర్.సి. ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

  విద్యుత్ ప్రసరణ పునరుద్ధరణకు కావలసిన ఇ.ఆర్ఎస్.ను ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి వ్యవస్థ తయారీ సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయి. వ్యవస్థ ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. తాజాగా రూపుదిద్దుకున్న ఇ,ఆర్.ఎస్. వ్యవస్థను తొలిసారిగా భారతదేశంలో తయారుచేసే అవకాశం ఇపుడు ఏర్పడింది. ఇప్పటివరకూ దిగుమతి చేసుకుంటున్న వ్యవస్థకు ఇది సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే వ్యవస్థకు అయ్యే వ్యయంలో 40శాతంతో స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త ఇ.ఆర్.ఎస్.ను తయారు చేసుకోవచ్చు. తాజాగా రూపొందిన ఇ.ఆర్.ఎస్. వ్యవస్థ మార్కెటింగ్ కు దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, దక్షిణాసియా ప్రాంతీయ సంఘం (సార్క్) సభ్య దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో కూడా  ఇ.ఆర్.ఎస్.కోసం మార్కెటింగ్ చెసుకోవచ్చు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇ.ఆర్.ఎస్. వ్యవస్థ రూపుదిద్దుకోవడం ప్రశంసనీయం. ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా నినాదాలను సాకారం చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది.

   ఇ.ఆర్.ఎస్. ఒక తేలికైన మాడ్యులర్ వ్యవస్థ. తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు, లేదా మానవ ప్రమేయంతో కూడిన ప్రమాదాలతో విద్యుత్ ప్రసారం దెబ్బతిన్నపుడు వెనువెంటనే, అప్పటికప్పుడు  ప్రసారాన్ని పునరుద్ధరించేందుకు ఈ వ్యవస్థ ఉపయుక్తంగా ఉంటుంది. దుర్ఘటన జరిగిన చోట వివిధ విడిభాగాలతో ఇ.ఆర్.ఎస్. వ్యవస్థను రూపొందించడానికి రెండు లేక 3 రోజులకంటే వ్యవధి పట్టదు. ఇలాంటపుడు శాశ్వత పునరుద్ధరణ వ్యవస్థ విద్యుత్ ప్రసారాన్ని పునరుద్ధరించాలంటే అనేక వారాలు పడుతుంది. విద్యుత్ ప్రసారం దెబ్బతిన్నపుడల్లా సామాన్య ప్రజల జీవితాలపై అది ప్రతికూల ప్రభావం చూపడం, విద్యుత్ కంపెనీలకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త ఇ.ఆర్.ఎస్. వ్యవస్థ రూపుదిద్దుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విద్యుత్ ప్రసారం ఆగిపోయిన సమయంలో క్రమంగా పెరిగిపోయే నష్టాన్ని పరిశీలించినపుడు దెబ్బతిన్న విద్యుత్ ప్రసరణ వ్యవస్థను తక్షణం పునరుద్ధరించడం అత్యంత అవసరమని మనకు అర్థమవుతుంది.

  నిర్మాణపరంగా ఎంతో స్థిరత్వంతో కూడిన బాక్స్ సెక్షన్లతో తయారైన ఇ.ఆర్.ఎస్. వ్యవస్థ ఎంతో తేలికైన, మాడ్యులర్ పద్ధతిలో, పునర్వినియోగానికి కూడా అనువుగా ఉంటుంది. సమస్యకు  ఇది పూర్తిస్థాయి పరిష్కారాన్ని అందిస్తుంది. పైగా, ఈ వ్యవస్థ పనితీరు అనేక సార్లు పరీక్షల ద్వారా ధ్రువీకరణ జరిగింది. ఏదైనా ప్రకృతి వైపరీత్యం, దుర్ఘటన కారణంగా విద్యుత్ ప్రసారం దెబ్బతిన్న చోట విడిభాగాలను ఇ.ఆర్.ఎస్.ను అమర్చడం చాలా సులభం. ఇందుకు కేవలం ప్రాథమిక స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక స్థాయి పరికరాలు ఉంటే సరిపోతుంది. వివిధ రకాల వోల్టేజీల విద్యుత్ ప్రసరణ వ్యవస్థలకు తగినట్టుగా ఆయా ఏర్పాట్లతో ఈ వ్యవస్థను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. వినియోగానికి ఎంతో అనువైన ఈ వ్యవస్థ, అమర్చిన వెంటనే పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తుంది. 33కె.వి. నుంచి 800 కె.వి. సామర్థ్యం గల విద్యుత్ ప్రసరణ వ్యవస్థలకు తగిట్టుగా సమర్థంగా ఈ వ్యవస్థను రూపొందించారు.

  ఇ.ఆర్.ఎస్. వ్యవస్థ లైసెన్సింగ్ ఒప్పందంపై చెన్నైలోని సి.ఎస్.ఐ.ఆర్.-ఎస్.ఇ.ఆర్.సి. డైరెక్టర్ ప్రొఫెసర్ కపూరియా, న్యూఢిల్లీకి చెందిన కేంద్రీయ విద్యుత్ సంస్థ చీఫ్ ఇంజినీర్ ఎస్.కె. రే మహాపాత్ర సమక్షంలో సంతకాలు జరిగాయి.

ఫోటో క్యాప్షన్:

  ఇ.ఆర్.ఎస్. టెక్నాలజీ లైసెన్సింగ్ పై సి.ఎస్.ఐ.ఆర్.-ఎస్.ఇ.ఆర్.సి. సంస్థ,..అహ్మదాబాద్ కు చెందిన మెసర్స్ అద్వైత్ ఇన్ఫ్రాటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న దృశ్యం. చెన్నైలోని సి.ఎస్.ఐ.ఆర్.-ఎస్.ఇ.ఆర్.సి. డైరెక్టర్ ప్రొఫెసర్ కపూరియా, న్యూఢిల్లీకి చెందిన కేంద్రీయ విద్యుత్ సంస్థ చీఫ్ ఇంజినీర్ ఎస్.కె. రే మహాపాత్ర సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

 

**********



(Release ID: 1672924) Visitor Counter : 173