వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది మరియు వ్యవసాయం దాని ప్రధమ ప్రాధాన్యత - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
ఎం.ఎస్.పి. పై వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనసాగుతుంది
కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు, రైల్వేలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పంజాబ్ నుండి వచ్చిన రైతు సంస్థల ప్రతినిధులతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
Posted On:
13 NOV 2020 6:36PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్, 2020 నవంబర్, 13వ తేదీన, పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతు సంస్థల ప్రతినిధులతో, న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో సమావేశమయ్యారు.
ముందుగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, పంజాబ్ రైతు సంస్థల ప్రతినిధులకు సాదరంగా స్వాగతం పలికారు. రైతులను శక్తివంతం చేయడానికి వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేసిన సంస్కరణల గురించి వారికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి భారత ప్రభుత్వానికి వ్యవసాయం ఎల్లప్పుడూ ప్రధమ ప్రాధాన్యంగా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పై ప్రత్యేక దృష్టి సారించి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు తమ ఉత్పత్తులను పారితోషిక ధరలకు అమ్మేందుకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కల్పించడంతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడతాయని ఆయన తెలియజేశారు.

ఎం.ఎస్.పి. పై వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మండి వ్యవస్థ మునుపటిలాగే కొనసాగుతాయని కూడా, కేంద్ర మంత్రులు, రైతు సంస్థల ప్రతినిధులకు తెలియజేశారు. రైతులకు మెరుగైన సేవలను అందించడానికి వీలుగా కొత్త వ్యవసాయ చట్టం మండీ లను ప్రోత్సహిస్తుంది.
కొత్త వ్యవసాయ చట్టాలపై, రైతు సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా 10,000 రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు వంటి ఇతర కార్యక్రమాల గురించి రైతు సంస్థల ప్రతినిధులకు వివరించడం జరిగింది.
రైతు సంక్షేమానికి సంబంధించిన వివిధ సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందనీ, రైతుల సంక్షేమంపై చర్చించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందనీ ఆయన హామీ ఇచ్చారు. ఈ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి, తదుపరి చర్చలు కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
*****
(Release ID: 1672819)