ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మీద పోరులో భారత్ అనుభవాలను

బ్రిక్స్ సహచరులతో పంచుకున్న డాక్టర్ హర్షవర్ధన్

ఏకీకృత వ్యవస్థ, వికేంద్రీకృత ద్వారా

ఆరోగ్యరక్షణకు కోవిడ్ వ్యూహం అమలు

Posted On: 11 NOV 2020 5:12PM by PIB Hyderabad

ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల డిజిటల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ పాల్గొన్నారు.

ఆయన అధికార ప్రకటన ఇలా ఉంది:

మహాశయులారా,

ఆధునిక ప్రపంచం ఎదుర్కున్న కోవిడ్ లాంటి అతిపెద్ద ఆరోగ్య ఉపద్రవాన్ని చవి చూసిన తరువాత మళ్లీ ఇప్పుడు కోలుకుంటున్న సమయంలో మనం వర్చువల్ పద్ధతిలో కలుసుకుంటున్నాం.  నా ప్రసంగం ప్రారంభించటానికి ముందు ఆరోగ్య రంగ కార్యకర్తలకు, సిబ్బందికి, పరిశోధకులకు, విధాన రూపకర్తలకు, మరెందరో త్యాగధనులకు నా ధన్యవాదాలు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ యాత్రను ముందుకు నడిపించారు వారు.

అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం మీద అవగాహన పెంచుకుంటూ అత్యవసర పరిస్థితికి తగినట్టుగా సిద్ధమైతే మనం మరింత బలంగా తయారవుతామన్నది నా నమ్మకం.  మన ప్రజలందరికీ సురక్షిత ఆరోగ్యం అందుబాటులో ఉండేలా జరుగుతున్న కృషిలో భాగమవుతున్నందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నా.

ప్రపంచ జనాభాలో 40% ఉండి అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో కీలకంగా ఉన్న బ్రిక్స్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య పరిస్థితిని ప్రభావితం చేయటంలో బృహత్తర పాత్ర పోషిస్తున్నది. ఈ ఐదు దేశాలు – బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా – ఉమ్మడి ఆరోగ్య సవాళ్లను అధిగమించటానికి కృషి చేస్తున్నాయి. అందులో అంటు వ్యాధులు, ఆరోగ్య సేవల అందుబాటులో అసమానతలు, పెరుగుతున్న వైద్య రంగ వ్యయాలు, ఇప్పటి కోవిడ్ లాంతిఉ సవాళ్ళు ఉన్నాయి.  అయితే కొన్ని సంవత్సరాలుగా బ్రిక్స్ దేశాలు తగిన సంస్కరణలు చేపడుతూ మెరుగైన ఆరోగ్య సేవలు, ఆర్థిక రక్షణ పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

మహాశయులారా,

మానవ సమాజం ఎలాంటి పరిస్థితులకు తట్టుకోవాల్సి ఉంటుందో ఈ కరోనా సంక్షోభం తెలియజెప్పింది.  మన వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని మనం గ్రహించేలా చేసింది. భారత్ లో కరోనా సంక్షోభం మొదలై విస్తరిస్తున్నప్పుడు సంస్థాగతంగా స్పందించిన తీరు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వ తీరును ప్రతిబింబించింది.  

కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక ఉద్యమ తరహాలో ముందుకు నడుపుతూ, అదే పనిగా పర్యవేక్షిస్తూ రాష్ట్రాలకు అందగా నిలబడి ఈ సంక్షోభాన్ని సంపూర్ణంగా పరిష్కరించటానికి కృషి చేసింది. ఆయా రాష్ట ప్రభుత్వాలు కూడా వేరు వేరు విశిష్ట వ్యూహాలు అనుసరిస్తూ తమ ప్రతిస్పందనను అప్రమత్తంగా కొనసాగించారు. ఏకీకృత వ్యవస్థ, వికేంద్రీకృత అమలు ద్వారా కోవిడ్ మీద పోరు సాగించింది. దీనివలన విశ్వజనీనంగా అందరికీ సమానంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ మీద పోరులో మా స్పందనకు ప్రేరణ ఇచ్చింది ఇదే.

ముందుజాగ్రత్తతో, చురుగ్గా వ్యవహరించటమే భారత్ కోవిడ్ పట్ల స్పందించిన తీరుకు నిదర్శనం. తొలిదశలోనే పరీక్షించటం, ప్రయాణీకులను దూరంగా ఉంచటం, లాక్ డౌన్ విధించటం, కంటెయిన్మెంట్ జోన్లను సృష్టించటం ద్వారా వ్యాప్తి నిరోధించటం సాధ్యమైంది. దీనివలన ఆరోగ్య సదుపాయాలమీద, సిబ్బంది మీద మితిమీరిన భారం పడకుండా చూడగలిగాం. ప్రవర్తనాపరంగా వచ్చే మార్పులను సాధించగలిగాం. చివరికి అంతిమంగా ఆర్థిక వ్యవస్థను దశలవారీగా, అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా పునఃప్రారంభించక తప్పదనే అభిప్రాయానికొచ్చాం. భారతదేశం తన భారీ జనాభాను దృష్టిలోపెట్టుకొని తగిన విధంగా స్పందించింది.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో అనేక సాంకేతిక నవకల్పనలు కూడా సహకరించాయి. అరోగ్య సేతు లాంటి యాప్, సోకినవారి ఆనవాళ్ళు గుర్తించటంలో ఇతిహాస్ పాత్ర, నిఘా వ్యవస్థ, చురుకైన కోవిడ్ ఇండియా పోర్టల్  వలన పర్యవేక్షణ చాలా సులువుగా తయారైంది.  ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్ లైన్ ట్రెయినింగ్ (ఐగాట్) పోర్టల్ ద్వారా కోవిడ్ మీద పోరాడే ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వటం సాధ్యమైంది.

స్వదేశీ ఉత్పత్తి పెంచటానికి మేం రేయింబవళ్ళూ పనిచేశాం. ఆరోగ్య సిబ్బందిని విస్తరించాం. దానివలన  పరీక్షించే కిట్స్, పిపిఇలు, వెంటిలేటర్లు లాంటివాటి విషయంలో డిమాండ్, సప్లై మధ్య అంతరాన్ని పూడ్చగలిగాం.  అదే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమం వలన ఇప్పుడు  మనం అన్ని విధాలుగా స్వయం సమృద్ధం కావటానికి వీలు కలిగింది.

మహాశయులారా,

మన దేశాలకు ఉమ్మడిగా అనేక మహమ్మారి వ్యాధులను ఎదుర్కోవటంలో చేసిన  విజయవంతమైన గత చరిత్ర  ఉంది.  2015 నాటి బ్రిక్స్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా మనందరం మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించటానికి మనం కృషి చేయాలి. మన విజ్ఞానాన్ని పంచుకోవటంలో, విజయవంతమైన భాగస్వామ్యాలను పెంచుకోవటంలోను సంఘీభావంతో పరస్పర లబ్ధి కలిగేలా అరమరికలు లేని విధంగా ముందడుగు వేయాలి.    

మహాశయులారా,

కోట్లాది విశ్వజనుల భద్రతలు ముప్పుగా మారే  ప్రస్తుత, భవిష్యత్ రిస్క్ లను తగ్గించుకోవటానికి మనలో మనం సంఘీభావంతో మెలగాల్సిన అవసరముంది. ఈ విషయంలో చాలా చురుగ్గా వ్యవహరించటం అనివార్యం. విశ్వసనీయమైన, సరైన దత్తాంశాన్ని , సంక్షోభాన్ని నివారించే క్రమంలో నేర్చుకున్న పాఠాలను పంచుకోవటం, తద్వారా భవిష్యత్తులో ఏదైనా మహమ్మారి ముంచుకొచ్చినప్పుడు ఆరోగ్య రంగంలో ఉమ్మడిగా జరగాల్సిన కృషికి పునాదులు వేయటం అవసరం.

గడిచిన కొద్ది నెలల్లో మనం ఎంతో ముందడుగు వేశాం. కోవిడ్ సంక్షోభ ప్రభావం నుంచి బైటపడి మన దేశాలు మరింత బలంగా పునరుత్తేజితమవుతాయన్న నమ్మకం నాకుంది. భవిష్యత్తులో ఇలాంటివి ఎదురైనా ఎదుర్కోగల సత్తా సమకూర్చుకున్నామన్న నమ్మకమూ కలిగింది. మనమధ్య మరింత సహకారం కోరుకుంటున్నాను.

 

****


(Release ID: 1672087) Visitor Counter : 164