భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వస్తూత్పత్తి రంగం పటిష్టత లక్ష్యంగా మంత్రిత్వ శాఖల కమిటీ ఏర్పాటు

Posted On: 11 NOV 2020 6:11PM by PIB Hyderabad

    ఉత్పాదక వస్తువుల రంగాన్ని బలోపేతం చేయడానికి 22మంది ప్రతినిధులతో వివిధ మంత్రిత్వశాఖల మధ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక ప్రగతిని 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి చేర్చాలన్న లక్ష్య సాధనలో భాగంగా, తయారీ రంగాన్ని ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్లేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 

   22మంది సభ్యులతో మంత్రిత్వ శాఖల స్థాయి కమిటీ ఏర్పాటుపై కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక ప్రకటన చేశారు. కమిటీ ఏర్పాటుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చారు. వస్తూత్పత్తి రంగాన్ని ప్రపంచస్థాయి పోటీతత్వంతో తీర్చిదిద్దేందుకు తీసుకోవలసిన చర్యలను, అనుసరించవలసిన మార్గాలను సిఫార్సు చేయడానికి ఈ కమిటీ కృషి చేస్తుందని మంత్రి జవదేకర్ ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. తయారీ రంగానికి ప్రపంచ కేంద్రంగా భారత దేశాన్ని రూపొందించడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు.

  వస్తూత్పత్తి రంగం బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలంటే, సంబంధిత మంత్రిత్వ శాఖల, విభాగాల మధ్య క్రమం తప్పకుండా చర్చలు, సంప్రదింపులు జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలనే,.. మంత్రిత్వశాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. వస్తూత్పత్తి రంగంతో సంబంధం ఉన్న అన్ని మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటవుతోంది. వస్తూత్పత్తి రంగానికి చెందిన పరిపాలనా యంత్రాంగం క్రమం తప్పకుండా సమావేశాలు జరిపేందుకు ఈ కమిటీ దోహదపడుతుంది. వస్తూత్పత్తి  అంశాలపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పూర్తిస్థాయి పరిశీలన జరిపేందుకు కూడా ఇది దోహదపడుతుంది.

    సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, మాతృ సాంకేతికత రూపకల్పన, ప్రపంచ విలువల వ్యవస్థ, నస్తువులపై పరీక్ష, నైపుణ్యాల్లో శిక్షణ, ప్రపంచ ప్రమాణాలు, కస్టమ్స్ సుంకాలు,  తదితర అంశాలతోపాటుగా, వస్తూత్పత్తి రంగానికి సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ విస్తృతంగా పరిశీలన, అధ్యనం జరుపుతుంది. వస్తూత్పత్తి రంగంతో ప్రమేయం ఉన్న ఎలాంటి  ఇతర అంశాన్ని అయినా, అధ్యక్షుడి ముందస్తు అనుమతితో కమిటీ దృష్టికి తీసుకెళ్లవచ్చు.

  కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి అధ్యక్షతలో ఈ మంత్రిత్వ శాఖల సమన్వయ కమిటీ పనిచేస్తుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రాతినిధ్యంతో ఈ కమిటీ 3 నెలలకు ఒక సారి సమావేశం జరుపుతుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలకు, విభాగాల్లో  తగిన సీనియారిటీ ఉన్న అధికారులకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. అవసరాన్ని బట్టి ఏదైనా ఇతర శాఖను, లేదా నిపుణులను కూడా అధ్యక్షుడు సమావేశానికి ఆహ్వానించవచ్చు.

****



(Release ID: 1672086) Visitor Counter : 228