ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

జలసంరక్షణపై యుద్ధప్రాతిపదికన చర్యలు అవసరం: ఉపరాష్ట్రపతి

- లేదంటే తాగునీటికి తీవ్రమైన కొరత తప్పదని హితవు
- నీరు పరిమిత వనరు అనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
- ప్రతి ఒక్కరి జీవితంలో జలసంరక్షణ భాగం కావాలి.. జీవనశైలిలో మార్పు రావాలని పిలుపు
- ప్రతి నూతన భవనానికి ఇంకుడు గుంతను తప్పనిసరి చేయాలి
- మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన
- అప్పుడే భవిష్యత్ తరాలకు నీటిని అందించగలం
- 2వ జాతీయ జల అవార్డుల కార్యక్రమాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
- విజేతలకు అభినందనలు.. ఇతరుల్లోనూ స్ఫూర్తి నింపాలని సూచన

Posted On: 11 NOV 2020 1:26PM by PIB Hyderabad

జలసంరక్షణ అంశంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. అలా చేయని పక్షంలో భవిష్యత్తులో తాగునీటికీ తీవ్రమైన కొరత తప్పదని ఆయన హితవు పలికారు. జల వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగించడం, శుద్ధిచేసి వినియోగించుకోవడంపై మరింత దృష్టిపెట్టాలని.. ఈ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
బుధవారం, 2వ జాతీయ జల అవార్డుల కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి అంతర్జాలం ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నీరు అపరిమిత వనరు కాదు. భూమిపై జలం పరిమితమే’ అనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. ప్రతి నీటి చుక్కను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ.. పెద్ద ఎత్తున గ్రామాలు, పట్టణాల్లో దీనిపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సామాజిక కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, స్థానిక సంస్థలు ఈ అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో కీలక భాగస్వామ్యం పోషించాలన్నారు.
భూ మండలంలో అందుబాటులో ఉన్న నీటిలో కేవలం 3శాతం మాత్రమే స్వచ్ఛమైనదని,  అందులో 0.5శాతం మాత్రమే తాగేందుకు వీలైనదని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, అలాంటి విలువైన తాగునీటి వనరులను సంరక్షించుకోవడం తద్వారా భవిష్యత్తులో నీటి కొరత రాకుండా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని సూచించారు. ‘ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకోవడంతోపాటు, నీటి వనరులను కాపాడుకోవడం తక్షణావసరం’ అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం భారతదేశానికి ఏడాదికి 1100 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి.. 2050 నాటికి ఇది 1447 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరవచ్చని నిపుణులు చెబుతున్నారన్నారు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ కార్యక్రమాల విస్తరణ కారణంగా నీటి వినియోగ అవసరం రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
నీటి వినియోగాన్ని తగ్గించి.. అవసరం మేరకే వాడటం వల్ల జల సంరక్షణ దిశగా తొలి అడుగు వేయొచ్చన్న ఉపరాష్ట్రపతి, తద్వారా నీటిని తోడటంతోపాటు ఇళ్లకు, కార్యాలయాలకు, వ్యవసాయ అవసరాలకు నీటిని సరఫరా చేయడంలోనూ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీని ద్వారా కాలుష్యం కూడా తగ్గుతుందన్న విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు.
దేశంలో సమర్థవంతంగా జలవనరుల నిర్వహణకు సంబంధించి ‘జాతీయ జల విధానాన్ని’ సమీక్షిస్తూ.. సమగ్రమైన, దృఢమైన విధానానికి రూపకల్పన చేసే దిశగా జరుగుతున్న పాలనాపరమైన నిర్ణయాలపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. 2014 నుంచి దేశాభివృద్ధి అజెండాలో.. జల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ నమామి గంగేతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. జల సంరక్షణకు ప్రజాఉద్యమంగా మార్చే లక్ష్యంతో జల్ శక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
జాతీయ జల అవార్డులను గెలుచుకున్న తమిళనాడు (మొదటిస్థానం), మహారాష్ట్ర (రెండోస్థానం), రాజస్థాన్ (మూడోస్థానం) రాష్ట్రాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. అవార్డులు ఆయా రాష్ట్రాలు జలసంరక్షణకు చేసిన కృషికి గుర్తింపుగా సత్కరించడంతోపాటు.. ఈ రంగంలో కృషిచేస్తున్న రాష్ట్రాలు, వివిధ విభాగాలకు ప్రేరణ కలిగిస్తాయని ఆయన అన్నారు. ఈ దిశగా జిల్లా, పంచాయతీ అధికారులు చేసిన కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. సహజవనరుల సంరక్షణ దిశగా స్థానిక సంస్థలు చేస్తున్న కృషికి ఈ అవార్డులే నిదర్శనమన్నారు. వీటి స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు.. ఇకపై జరిగే నిర్మాణాలకు ఇంకుడుగుంతలను తప్పనిసరి చేయాలని సూచించారు.
జలవనరుల అభివృద్ధి, నిర్వహణ కార్యక్రమాలను మరింత ప్రోత్సహించడం, బిందుసేద్యం, తుంపరసేద్యం వంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చన్న ఉపరాష్ట్రపతి, ‘అనవసర నీటి వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగం, శుద్ధిచేసి వినియోగించడం’ మంత్రమే భవిష్యత్ తరాలకు సుస్థిరమైన, జీవనానుకూల పరిస్థితులను అందించగలదన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్  షెకావత్, సహాయమంత్రి శ్రీ రతన్‌లాల్ కటారియా, మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యూపీ సింగ్, పర్యావరణ వేత్త డాక్టర్ అనిల్ జోషి, స్వచ్ఛగంగ జాతీయ మిషన్ డీజీ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, అవార్డులు అందుకున్న రాష్ట్రాల ప్రతినిధులు, జల సంరక్షణపై పనిచేస్తున్న పలు సంస్థలు తదితరులు అంతర్జాల వేదిక ద్వారా హాజరయ్యారు.

***



(Release ID: 1671869) Visitor Counter : 179