విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఇంధన పరిరక్షణ చట్టం, 2001 పరిధిలోకి డిస్కంలు ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన మంత్రిత్వశాఖ

Posted On: 09 NOV 2020 6:29PM by PIB Hyderabad

విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కంలు) లను ఇంధన పరిరక్షణ చట్టం పరిధిలోనికి తీసుకుని వస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2020 సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అయిన నోటిఫికేషన్ ఎస్.ఓ 3445(ఈ) ప్రకారం విద్యుత్ చట్టం 2003 ( 2003లో 36) కింద రాష్ట్ర / సంయుక్త విద్యుత్ నియంత్రణ కమిషన్ నుంచి పంపిణి కోసం లైసెన్సులు పొందిన అన్ని సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. బ్యూరో అఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బిఈఈ)తో సంప్రదించి ఇంధన మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం విద్యుత్ పంపిణీ కంపెనీలను గుర్తించిన వినియోదారులుగా (డీసీ) పరిగణిస్తారు. విద్యుత్ పంపిణీ కంపెనీల నష్టాలను తగ్గించి వాటి లాభాలను ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో జారీ అయిన ఈ ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ చట్టం పరిధిలోకి వచ్చే విద్యుత్ పంపిణీ కంపెనీల సంఖ్య 44 నుంచి 102కి పెరుగుతుంది. ఇంతవరకు చట్ట పరిధిలోకి వార్షిక ఇంధన నష్టాలు 1000 లేదా అంతకు మించి ఉన్న డిస్కంలు మాత్రమే వచ్చేవి. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం విద్యుత్ చట్ట నిబంధనల ప్రకారం ఇంధన నిర్వహణ మేనేజర్ల నియామకం, ఎనర్జీ అకౌంటింగ్, ఆడిటింగ్, తరగతుల వారీగా ఇంధన నష్టాలను గుర్తించడం, ఇంధన పరిరక్షణ, సామర్ధ్య పెంపుదల లాంటి అంశాల నిబంధనలు డిస్కంలకు వర్తిస్తాయి. వృత్తిపరమైన నైపుణ్యతతో డిస్కంలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి, పంపిణీలో పారదర్శకతను తీసుకుని రాడానికి నిర్ణయం ఉపకరిస్తుంది. విద్యుత్ పంపిణీ నష్టాలను గుర్తించి వాటిని తగ్గించుకోడానికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, అమలుకు ఈ నిర్ణయం సహాయపడుతుంది. ఈ చర్యల వల్ల డిస్కంలు ఆర్ధికంగా బలోపేతమవుతాయి. డిస్కంల సమాచారాన్ని మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షించి సమర్ధతను పెంపొందించుకోవడానికి, ఇంధన నష్టాలను తగ్గించు కోవడానికి అమలు చేయవలసిని చర్యలను సూచించడం జరుగుతుంది. వినియోగదారులకు కూడా ఈ చర్యల వల్ల ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.

బ్యూరో అఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ :

కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలో పెనిచేస్తున్న బ్యూరో అఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు అయ్యింది. భారత ఆర్ధిక వ్యవస్థపై ఇంధనరంగం ఎక్కువ భారాన్ని మోపకుండా చూడడానికి అమలు చేయవలసిన చర్యలను, ప్రణాళికలను బ్యూరో అఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ సూచిస్తుంది. అందుబాటులో ఉన్న సౌకర్యాలు,వనరులు, మౌలిక సదుపాయాలను సమర్ధంగా వినియోగించుకోవడానికి గుర్తించిన వినియోగదారులు, సంస్థలతో బ్యూరో అఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ సమన్వయంతో పనిచేస్తున్నది.

***



(Release ID: 1671663) Visitor Counter : 180