పర్యటక మంత్రిత్వ శాఖ

‘బ్రిక్స్’ పర్యాటక మంత్రుల వర్చువల్ సమావేశంలో

పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
పర్యాటక రంగం ప్రస్తుత స్థితిగతులు.. సంక్షోభాన్ని
అధిగమించే దిశగా చేపట్టిన చర్యలపై చర్చించిన మంత్రి

Posted On: 28 OCT 2020 9:44PM by PIB Hyderabad

   కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ (ఇన్‌చార్జి) సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ ఇవాళ ‘బ్రిక్స్‌’ పర్యాటక శాఖ మంత్రుల వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు. బ్రిక్స్‌ కూటమిలోని ఇతర సభ్యదేశాల పర్యాటకశాఖ మంత్రులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. కోవిడ్‌-19 మహమ్మారి అన్నిరంగాల్లో వివిధ ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అన్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయంగా పర్యాటక రంగానికి అనేక సవాళ్లు విసిరిందని, భారత్‌ కూడా వీటిని ఎదుర్కొంటున్నదని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాహసోపేత, దార్శనిక నేతృత్వం వల్ల మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి బయటపడటంలో భారత్‌ విజయవంతమైందని గుర్తుచేశారు. విదేశీ మారకం ఆర్జనలో పర్యాటక రంగం కీలకమైనదని శ్రీ పటేల్‌ చెప్పారు. అంతేగాక దేశ ఆర్థిక వ్యవస్థలో జీడీపీతోపాటు ఉపాధి కల్పనపరంగానూ గణనీయ వాటా ఈ రంగానిదేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశ పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ భారత ప్రభుత్వం అనేక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిందని తెలిపారు. దీంతోపాటు వ్యాపార మనుగడ, ఉద్యోగుల కొనసాగింపుసహా ఈ రంగం పునరుజ్జీవం దిశగా అనేక ఇతర ఆర్థిక, సహాయ చర్యలు కూడా చేపట్టిందని వివరించారు. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాపారానికి మద్దతుగా ఇదేరకమైన చర్యలు తీసుకున్నాయని చెప్పారు.

   భారత పర్యాటక, ప్రయాణ-ఆతిథ్య పరిశ్రమ అత్యంత వైవిధ్యంతో కూడుకున్నదని ఆయన అన్నారు. ఈ చట్రంలో సూక్ష్మ-చిన్న-మధ్యస్థ-భారీ సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్లు చెప్పారు. “స్వయం సమృద్ధ భారతం” సాధన కోసం మన ప్రధానమంత్రి ఒక స్పష్టమైన దృక్కోణాన్ని ఆవిష్కరించారని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా సంక్షోభ పరిష్కారంసహా భారత పర్యాటక రంగంతోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ‘ఎంఎస్‌ఎంఈ’లకు హామీరహిత రుణాలను స్వయంచలితంగా పొందే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. వివిధ సమస్యల పరిష్కారాలపై చర్చించడం కోసం పర్యాటక, ఆతిథ్య పరిశ్రమ భాగస్వాములతో కేంద్ర పర్యాటకశాఖ నిరంతరం సంప్రదింపుస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ మేరకు పర్యాటకులలో విశ్వాసం, నమ్మకం పెంచేందుకు దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ డిమాండ్‌ పునరుద్ధరణద్వారా పర్యాటక ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి కృషి చేస్తున్నదని వివరించారు.

   సందర్శకులకు ఆహ్వానం పలుకుతూ భారత్‌ క్రమక్రమంగా చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. తదనుగుణంగా 18 దేశాలతో ‘పరస్పర విమానయాన ఒప్పందాలు’ కుదుర్చుకున్నదని చెప్పారు. అలాగే వ్యాపారం, సమావేశం, ఉపాధి, అధ్యయనాలు, పరిశోధన, వైద్యపరమైన అవసరాల కోసం ఇప్పటికే జారీచేసిన వీసాలను కూడా భారత్‌  పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రపంచ పర్యాటకరంగ పునరుజ్జీవనం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులు, విమానయాన సిబ్బందికి కోవిడ్‌-19నుంచి భద్రత కోసం చేపట్టిన చర్యలను కూడా ఆయన వివరించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖతో సంయుక్తంగా పర్యాటకశాఖ ఆరోగ్యపరమైన విధాన ప్రక్రియలతోపాటు ప్రయాణ-ఆతిథ్య రంగంలోని అన్ని సేవాప్రదాన సంస్థలకు వర్తించే కార్యాచరణ మార్గదర్శకాలను నిర్దేశించిందని వెల్లడించారు. అంతేకాకుండా కోవిడ్‌-19 నుంచి భద్రతపై సంసిద్ధత దిశగా ఆతిథ్య పరిశ్రమ సామర్థ్యం పెంపు-నిర్మాణంలో తోడ్పాటు కోసం మంత్రిత్వశాఖ ఇటీవల “సాథి” (సిస్టమ్ ఫర్ అసెస్‌మెంట్, అవేర్‌నెస్ అండ్‌ ట్రైనింగ్ ఫర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

   దేశంలో సుశిక్షిత, వృత్తిగత పర్యాటక సేవాప్రదాతల సమూహాన్ని సృష్టించే లక్ష్యంతో పర్యాటక మంత్రిత్వశాఖ చేపట్టిన చర్యలను శ్రీ పటేల్‌ వివరించారు. ఈ మేరకు “ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేటర్” (ఐఐటీఎఫ్) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇది ఆన్‌లైన్ శిక్షణ వేదిక ఏర్పాటు దిశగా చేపట్టిన డిజిటల్ చర్యగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు దేశీయ పర్యాటక రంగానికి ప్రోత్సాహం, స్థానిక ఆర్థిక వ్యవస్థల ముందడుగుకు తోడ్పడే దిశగా మరిన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగా “మన దేశాన్ని సందర్శిద్దాం” (దేఖో అప్నాదేశ్‌) ఇతివృత్తంతో పలు వెబినార్లను పర్యాటక శాఖ నిర్వహించిందని తెలిపారు. తదనుగుణంగా దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అసాధారణ దృక్కోణంతోపాటు ఇప్పటిదాకా ఎవరికీ తెలియని అద్భుత ప్రదేశాలు, వైవిధ్యభరిత సంస్కృతి-వారసత్వం తదితరాల గురించి వివరించినట్లు పేర్కొన్నారు.

   పర్యాటక రంగంలో డిజిటలీకరణ, వినూత్న చర్యలు ఈ రంగం అభివృద్ధికి దోహదం చేస్తాయి.  పర్యాటక గమ్యాలతోపాటు ఇతర కార్యకలాపాల గురించి విస్తృత ప్రచారం, అవగాహన కల్పన, ప్రోత్సాహం కోసం డిజిటల్‌ మాధ్యమాన్ని పర్యాటక శాఖ విస్తృతంగా వాడుకుంటున్నదని మంత్రి తెలిపారు. డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడానికి పరిశ్రమతో కలసి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో తన ప్రసంగాన్ని ముగిస్తూ- ప్రస్తుత విపత్కర సమయంలో ‘బ్రిక్స్’ కూటమి అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిందంటూ రష్యా సమాఖ్యను మంత్రి అభినందించారు. అలాగే 2021లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న భారతదేశం సభ్య దేశాలతో కలసి పనిచేయడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నదని, అందుకు తగిన అవకాశాలు లభించగలవని ఆశిస్తున్నదని చెప్పారు.

***



(Release ID: 1668344) Visitor Counter : 102