ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తమిళనాడులో కోవిడ్ అనుగుణ ప్రవర్తన చర్యలు, సంసిద్ధత దిశగా కోవిడ్-19పై సమీక్షించిన డాక్టర్ హర్షవర్ధన్

“సాధారణ ముందుజాగ్రత్తలుసహా, కోవిడ్ సముచిత ప్రవర్తను
పాటించడమే కరోనా వ్యాప్తి నిరోధానికి సమర్థ ఉపకరణాలు”

Posted On: 28 OCT 2020 7:39PM by PIB Hyderabad

   తమిళనాడులో కోవిడ్‌ అనుగుణ ప్రవర్తన చర్యలు, సంసిద్ధత దిశగా కేంద్ర ఆరోగ్య-కుటుంబశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా కోవిడ్‌-19పై సమీక్షించారు. రాష్ట్ర ఆరోగ్య-వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సి.విజయభాస్కర్‌తోపాటు పలువురు సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్‌పై ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘ప్రజా ఉద్యమం’ గురించి ఈ సందర్భంగా డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రస్తావించారు. ఆ మేరకు “మాస్కులు/ముఖరక్షణ వస్త్రాల వినియోగం, భౌతికదూరంతోపాటు క్రమబద్ధ చేతి పరిశుభ్రతవంటి ఉత్తమపద్ధతులు పాటించాల్సిన అవసరంపై పౌరులలో అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు. అలాగే “కోవిడ్‌-19పై ఇప్పటిదాకా సాగించిన పోరుద్వారా సాధించిన ఫలితాలకు రానున్న సుదీర్ఘ పండుగ వేడుకల ముప్పు ఉంటుంది. అందువల్ల రాబోయే మూడు నెలలపాటు మనమంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ దిశగా కరోనా వ్యాప్తి సమర్థ నిరోధం కోసం కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనను తప్పక అనుసరించాలి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం మేరకు మాస్కు ధారణ/ముఖరక్షణ వస్త్రాల వినియోగం, భౌతికదూరంతోపాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవడంవంటి పద్ధతులను దేశంలోని పౌరులు ప్రతి ఒక్కరూ అనుసరించాలి” అని ఆయన వివరించారు.

   “కోవిడ్‌ పారామితులకు సంబంధించి మన దేశం గణనీయమైన ప్రగతిని నమోదు చేసింది. ఆ మేరకు నమోదయ్యే కేసులు, మరణాల తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా కొత్త కేసుల నమోదు గణనీయంగా దిగివచ్చింది. ప్రస్తుతం దేశంలో చురుకైన కేసుల సంఖ్య 6,10,803 మాత్రమే కావడం ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా కోలుకునేవారి సగటు ప్రపంచంలోనే అత్యధికంగా 90.85 శాతంగా ఉంది. ప్రతి పది లక్షల జనాభాకు మరణాల సగటు కూడా అత్యల్పంగా 1.50 శాతం మాత్రమే. ఇక కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణకోసం నేడు దేశవ్యాప్తంగా 2000 ప్రయోగశాలలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి” అని డాక్టర్‌ హర్షవర్ధన్‌ గుర్తుచేశారు. అదే సమయంతో దేశంలోన నమోదైన కోవిడ్‌ పారామితులను తమిళనాడులోని పరిస్థితులతో పోలుస్తూ- “తమిళనాడులో కోలుకునేవారి సగటు జాతీయస్థాయికి మించి 94.6 శాతంగా ఉంది. మొత్తం నమోదైన కేసులలో మరణాల సగటు కూడా దాదాపు జాతీయ సగటుతో సమానంగా కేవలం 1.54 శాతమే కావడం విశేషం” అని డాక్టర్ హర్షవర్ధన్‌ అన్నారు.

   తమిళనాడులో కోవిడ్‌ ముప్పు తీవ్రత అధికంగాగల ప్రాంతాలను గుర్తించడంలో రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్యసేతు, ఇతిహాస్‌’ యాప్‌లను చురుగ్గా వినియోగించడాన్ని డాక్టర్‌ వర్ధన్‌ ప్రశంసించారు. దేశంలో చురుకైన కేసులలో రాష్ట్ర వాటాను తగ్గించడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడారు. అయితే చెన్నై, చెంగల్పట్టు, కోయంబత్తూర్‌, తిరవళ్లూర్‌, సేలం, కాంచీపురం, కడలూర్‌ జిల్లాల్లో కోవిడ్‌ అధిక వ్యాప్తిపై డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆందోళన వెలిబుచ్చారు. కేసులతోపాటు మరణాలు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో పరిస్థితులపై అక్కడి అధికారులతోనూ డాక్టర్‌ హర్షవర్ధన్‌ సమీక్షించారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యల గురించి ఆరోగ్యశాఖ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. దేశంలోనే రాష్ట్రంలోనూ లేనివిధంగా తమిళనాడులో 2 లక్షల దూరవాణి-వైద్య సంప్రదింపులు నిర్వహించినట్లు వారు తెలిపారు. తమిళనాడులో ఇప్పటిదాకా 96,60,430 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వాటిలో 98.99 శాతం ఆర్టీ-పీసీఆర్‌ విధానంలో నిర్వహించినవేనని తెలిపారు. పరీక్షల సంఖ్యను పెంచడం కోసం తనిఖీ కేంద్రాలు, ప్రత్యేక పరీక్ష శిబిరాలు తదితరాలను నిర్వహించామన్నారు. అలాగే మరణాలకు సంబంధించిన గణాంకాలను వారానికి మూడుసార్లు నమోదు చేసినట్లు చెప్పారు. మెరుగైన ఆక్సిజన్‌ సదుపాయాలతో కూడిన కోవిడ్‌ ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రత్యేక నిఘా వేదిక (స్టాప్‌ కరోనా పోర్టల్‌)ను, జ్వర చికిత్స వైద్యశాలు ఇందుకు కొన్ని ఉదాహరణలని చెప్పారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘ప్రజా ఉద్యమం’ వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వారు తెలియజేశారు.

   రాష్ట్రంలో 41-60 ఏళ్ల మధ్య వయస్కులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్‌ భూషణ్‌ గుర్తుచేశారు. తమిళనాడులో మరణాల సగటు దాదాపు 30 శాతం ఉన్న నేపథ్యంలో ఈ వయోవర్గంలోని వ్యక్తులలో ఇతరత్రా అనారోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆ మేరకు ఇతరత్రా అనారోగ్యాల విషయంలో శ్రద్ధ చూపాలని, కోవిడ్‌ చికిత్స విధానాలను ఇటువంటి అధికముప్పుగల వారికీ వర్తింపజేయాలని కూడా ఆయన కోరారు. ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి ఆహుజా, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ సుజత్‌ కె.సింగ్‌ కూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్‌ అధికారులు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఇందులో పాలుపంచుకున్నారు.

***



(Release ID: 1668260) Visitor Counter : 144