రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

విధులకు సిద్ధమైన నౌకాదళ మొదటి బ్యాచ్‌ మహిళా పైలెట్లు

Posted On: 22 OCT 2020 7:30PM by PIB Hyderabad

కోచిలోని దక్షిణ నౌకాదళ స్థావరం(ఎస్‌ఎన్‌సీ) ద్వారా డోర్నియర్‌ విమానంపై శిక్షణ పొందిన నౌకాదళ మొదటి బ్యాచ్‌ మహిళా పైలెట్లు విధులకు సిద్ధమయ్యారు. ఆరుగురు సభ్యులున్న 27వ 'డోర్నియర్‌ ఆపరేషనల్‌ ఫ్లైయింగ్‌ ట్రైనింగ్‌' (డోఫ్ట్‌) బ్యాచ్‌లో ఈ ముగ్గురు భాగం. కోచిలో ఈనెల 22న జరిగిన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ద్వారా 'ఫుల్లీ ఆపరేషనల్‌ మారీటైమ్‌ రికనైజన్స్ పైలెట్స్‌' (ఎంఆర్‌)గా వీరంతా ఉత్తీర్ణులయ్యారు.

    రియర్‌ అడ్మిరల్‌, ఎన్‌ఎస్‌సీ చీఫ్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ (శిక్షణ) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని రకాల మిషన్ల కోసం డోర్నియర్‌ విమానాన్ని నడిపేందుకు పూర్తి అర్హత సాధించిన పైలెట్లకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ ముగ్గురు మహిళలు.. లెఫ్టినెంట్‌ దివ్య శర్మ (దిల్లీ), లెఫ్టినెంట్‌ శుభాంగి స్వరూప్‌ (ఉత్తరప్రదేశ్‌), లెఫ్టినెంట్‌ శివాంగి (బిహార్‌). డోఫ్ట్‌ కోర్సుకు ముందు; వైమానికి దళం, నావికాదళంలో ప్రాథమిక పైలెట్‌ శిక్షణను వీరు పొందారు. వీరు ముగ్గురు ఎంఆర్‌గా అర్హత సాధించినా, లెఫ్టినెంట్‌ శివాంగి గతేడాది డిసెంబర్‌ 2వ తేదీనే ఉత్తీర్ణురాలై, నౌకదాళ తొలి మహిళా పైలెట్‌గా గుర్తింపు పొందారు.

    డోఫ్ట్‌ కోర్సులో భాగంగా ఎస్‌ఎన్‌సీకి చెందిన వివిధ వృత్తి నైపుణ్య పాఠశాలల్లో ఒక నెల క్షేత్రస్థాయి శిక్షణ, డోర్నియర్‌ దళంలో ఎనిమిది నెలలు ఆకాశయాన శిక్షణ ఇచ్చారు. లెఫ్టినెంట్‌ దివ్య శర్మ, లెఫ్టినెంట్‌ శివమ్‌ పాండే వరుసగా 'ఫస్ట్‌ ఇన్‌ ఫ్లైయింగ్‌', 'ఫస్ట్‌ ఇన్‌ గ్రౌండ్‌' పురస్కారాలు సాధించారు. 'మోస్ట్‌ స్ఫిరిటెడ్‌ ట్రైనీ' పురస్కారాన్ని లెఫ్టినెంట్‌ కుమార్‌ విక్రమ్‌ దక్కించుకున్నారు. విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్‌ సైమన్‌ జార్జ్‌ ఫినోమూతిల్‌ జ్ఞాపకార్థం, 2019 జూన్‌లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు.

***
 


(Release ID: 1666892) Visitor Counter : 217