ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి జన్ ఆందోళన్ అమలు గురించి చర్చించిన - డా. హర్ష వర్ధన్
Posted On:
21 OCT 2020 5:43PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్ల సమక్షంలో మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ అధికారులతో సంభాషించారు.
మధ్యప్రదేశ్ లోని కోవిడ్ పరిస్థితిని, దేశంలో ఉన్న పరిస్థితితో పోల్చి, డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, "భారతదేశం యొక్క రికవరీ రేటు ప్రస్తుతం 89 శాతం కాగా, మధ్యప్రదేశ్ రికవరీ రేటు 90.55 శాతంగా ఉంది. మధ్యప్రదేశ్ లో మరణాల రేటు జాతీయ సగటు కంటే కొంచెం ఎక్కువగా 1.73 శాతంగా ఉంది." అని తెలిపారు. కేసుల సంఖ్యలో స్థిరమైన క్షీణత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగాపాటిస్తే, కోవిడ్ వ్యాప్తిని సమర్ధంగా అదుపులోకి తీసుకురాగలమని, ఆయన తన వైఖరిని పునరుద్ఘాటించారు.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సాధారణ చేతి పరిశుభ్రత యొక్క అవసరం మరియు నియమాలకు సంబంధించి, పౌరులందరిలో అవగాహన పెంచడానికి జన్ ఆందోళన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పండుగ సీజను మరియు శీతాకాలం కలిసి వస్తున్న రాబోయే నెలల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, డాక్టర్ హర్ష వర్ధన్ రాష్ట్ర అధికారులను కోరారు.
భారతదేశంలో చికిత్స పొందుతున్న కేసుల శాతం గతంలో 10 శాతం ఉండగా, అది ఇప్పుడు కేవలం 2 శాతానికి తగ్గడానికి దోహదపడినందుకు డాక్టర్ హర్ష వర్ధన్ రాష్ట్రానికి అభినందనలు తెలియజేశారు. అయితే, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, సాగర్, ఖార్గోన్, ఉజ్జయినిలలో నెలకొన్న ఈ వ్యాధి పరిస్థితి గురించి, ఆందోళన వ్యక్తం చేస్తూ, భోపాల్ మరియు ఇండోర్ లలో రోజువారీ కేసులు 200 కన్నా ఎక్కువ ఉండగా, ఉజ్జయిని మరియు సాగర్ లలో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ సి.ఎఫ్.ఆర్. ను కలిగి ఉన్నాయని, అయన చెప్పారు. రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువ పరీక్షలు ఆర్.టి-పి.సి.ఆర్. ఆధారంగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల రేటు 6.17 శాతంగా ఉందనీ, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని మంత్రికి తెలియజేశారు.
రాబోయే నెలల్లో కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి తీసుకున్న చర్యలను రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని వినోద కార్యక్రమాల కేంద్రాలు మరియు ప్రసూతి వార్డుల కోసం ప్రామాణిక కార్యాచరణ విధానాలను విడుదల చేయడం జరిగింది. సమర్థవంతమైన నియంత్రణ కోసం ‘సార్థక్’ యాప్ ను ఉపయోగించడం జరుగుతోంది. ఉత్సవాల సందర్భంగా సామూహిక సమావేశాలు, మేళాలను అనుమతించరు. విగ్రహ నిమజ్జనంలో 10 కంటే తక్కువ మంది పాల్గొనవలసి ఉండగా, పందిరి సమావేశాలకు, కార్యక్రమాలకు 100 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదు. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలకు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా, 13 విభాగాలు మరియు 8 వర్టికిల్సు తో, "సహకారంతో సంరక్షణ" అనే ప్రచార కార్యక్రమాన్ని ఆగష్టు 15వ తేదీన ప్రారంభించడం జరిగింది.
కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా మరియు రవాణాను క్రమబద్ధీకరించడానికి తీసుకున్న చర్యలతో పాటు, ప్రభుత్వ ఖజానా నుండి ప్రైవేటు ఆస్పత్రుల ఖర్చులను భరించడం ద్వారా ప్రజల ఉపయోగం కోసం వాటిని మార్చిన మధ్యప్రదేశ్ యొక్క ప్రత్యేకమైన నమూనా ప్రయత్నాన్ని, వారు కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పరిష్కరించడానికి వారు తీసుకున్న చర్యలు, తద్వారా వారు సాధించిన విజయాల గురించి బాధిత జిల్లాల అధికారులు కేంద్ర మంత్రికి తెలియజేశారు.
జాతీయ వ్యాధి నియంత్రణా కేంద్రం (ఎన్.సి.డి.సి) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని వివరించారు, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే అంటువ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, శ్రీ రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి. ఆర్తి అహుజా తో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1666636)
Visitor Counter : 210