మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

తిరుచురాపల్లి ఎన్ఐటీ కెమికల్ ఇంజనీరింగ్ భవనాన్ని ప్రారంభించిన

కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్

Posted On: 20 OCT 2020 7:28PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి  రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’  తిరుచురాపల్లి ఎన్ఐటీలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం గోల్డెన్ జూబ్లీ భవనాన్ని నేడు ప్రారంభించారు.  ఎన్ఐటీ, బీఓజీ ఛైర్‌పర్సన్ భాస్కర్ భట్,  సంస్థ డైరెక్టర్ డాక్టర్   మినీ షాజీ థామస్,  ఎన్ఐటీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి మీరా షెరీఫా బేగం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్థ ఇటీవల సాధించిన ర్యాంకింగులను,   విజయాలను అభినందించారు.  చదువు పూర్తిచేసుకొని సమాజానికి సందేశాన్ని తీసుకెళ్తూ బాధ్యతగా వ్యవహరించే విద్యార్థులు ప్రతి  విద్యాసంస్థకు  గర్వకారణమని వ్యాఖ్యానించారు.  ఎన్ఐటీ-టి  పూర్వ విద్యార్థుల గురించి  పోఖ్రియాల్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ చదువు తరువాత ఉద్యోగాల్లో చేరి సమాజానికి ఉపయోగపడుతున్నారని అన్నారు.  ఇటీవలి సంవత్సరాలలో పేటెంట్లు,  అవార్డులు పెరిగాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దీనిని బట్టి చూస్తే ఈ విద్యాసంస్థ నవకల్పనలు,  స్టార్టప్‌ల దిశలో పయనిస్తున్నట్టు అర్థమవుతుందని,  విద్యార్థులు ఉద్యోగాల కోసం వేటాడటం మాని వ్యవస్థాపకులుగా అవతరిస్తారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్, ఉన్నత్ భారత్, మొదలైన కార్యక్రమాలలో ఎన్ఐటి-టి భాగం కావాలని ఆయన కోరారు. ఉన్నత్ భారత్ అభియాన్ ప్రాజెక్ట్ కింద గ్రామాలను దత్తత తీసుకున్నందుకు ఎన్ఐటి-టిని  పోఖ్రియాల్ అభినందించారు  జేఈఈ పరీక్షను ఛేదించి ఎన్ఐటిటిలో ప్రవేశం పొందిన గ్రామీణ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. ప్రతి విద్యార్థి ఒక గ్రామీణ విద్యార్థిని దత్తత తీసుకుని వారికి విద్యను అందిస్తే, రాబోయే సంవత్సరాల్లో మన దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం, క్యాంపస్ సురక్షితంగా ఉండేలా చూడటమే గాక సమాజానికి తోడ్పాటును ఇచ్చిందంటూ ఎన్ఐఐటీని మంత్రి ప్రశంసించారు.

స్వర్ణిమ్ భారత్ ప్రాజెక్టుకు కెమికల్ ఇంజనీరింగ్  గోల్డెన్ జూబ్లీ భవనం పునాది రాయి అని  పోఖ్రియాల్ అన్నారు. సుమారు 7.65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త గోల్డెన్ జూబ్లీ భవనంలో సెమినార్ హాల్, మోడలింగ్  సిమ్యులేషన్ లాబొరేటరీలు, ఫ్యాకల్టీ రూమ్లు, నెట్వర్కింగ్ సదుపాయం కలిగిన 13 పరిశోధనశాలలు,  రెండు విశ్లేషణాత్మక ప్రయోగశాలలు ఉన్నాయని అన్నారు. ఇందులో 10 అత్యధిక ఎనలిటికల్ పరికరాలను జనరేటర్తోపాటు ఉంచవచ్చని చెప్పారు.

డాక్టర్ మినీ షాజీ థామస్ మాట్లాడుతూ తిరుచురాపల్లి ఎన్ఐటీ పిఎమ్ఆర్ఎఫ్, ఎన్ఐఆర్ఎఫ్ తొమ్మిదో ర్యాంకును సాధించడాన్ని ప్రస్తావించారు. మొత్తం 20 మందికి జేఈఈ కోసం శిక్షణ ఇవ్వగా ఇద్దరికి ఎన్ఐటీలో ప్రవేశం లభించిందని వెల్లడించారు ఎన్ఐటీ-టికి అపార సామర్థ్యం ఉందని, దానిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని మినీ అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను మంత్రిత్వ శాఖ సహాయంతో ఎన్ఐటీ-టి సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు.

 

తిరుచురాపల్లి ఎన్ఐబీ బీఓజీ భాస్కర్ భట్ అధ్యక్ష ప్రసంగం చేశారు. ఈ కీలక సమయంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన కెమికల్ ఇంజనీరింగ్ భవనాన్ని ప్రారంభించడం  సంతోషంగా ఉందని తెలియజేశారు.  కేంద్ర ప్రభుత్వంతోపాటు మంత్రి పోఖ్రియాల్ నూతన విద్యావిధానానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన తమ విద్యాసంస్థను ప్రశంసించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన నూతన విద్యావిధానం భారత్ విద్యకు కేంద్రమనే సందేశాన్ని పంపిందని వ్యాఖ్యానించారు. దీనివల్ల ఎన్ఐటీ మరిన్ని శిఖరాలను అధిరోహించవచ్చని, తన లక్ష్యాలను సాధించుకోవచ్చని భట్ వివరించారు. ఈ విద్యా విధానం, శక్తివంతమైనదని,  స్థిరమైనదని, జ్ఞానవంతమైన సమాజాన్ని సృష్టిస్తుందని చెప్పారు. అందరికీ అధిక నాణ్యత గల విద్యను ఇస్తుందని స్పష్టం చేశారు.  ఎన్ఐటీల కోసం మల్టీడిసిప్లినరీ ఫోరమ్‌ను సృష్టిస్తుందని అన్నారు. తమ సంస్థ ఎదుగుదల కోసం ప్రశంసనీయమైన కృషి చేశారంటూ ఎన్ఐటీ డైరెక్టర్, డిపార్ట్మెంట్ హెడ్, డీన్ (పి అండ్ డి) ను  ప్రశంసించారు. ఈ భవనం తమ సంస్థ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కెమికల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ మీరా షెరీఫా బేగం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కెమికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని విద్యా మంత్రి ప్రారంభించడం ఒక విశేషమంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

  తిరుచురాపల్లి ఎన్ఐటీ భారతదేశంలో కెమికల్ ఇంజనీరింగ్కు  ప్రధాన కేంద్రాలలో ఒకటి. ఈ విభాగం 1967 లో ప్రారంభమైంది.  డాక్టర్ ఎస్. హెచ్. ఇబ్రహీం వ్యవస్థాపక-అధిపతిగా సంస్థ ఎదుగుదలకు కృషి చేశారు. నాణ్యమైన యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లను అందించే ప్రధాన సంస్థలలో ఒకటిగా ఎన్ఐటీని మార్చడానికి కృషి చేశారు. ఈ విభాగం ఇప్పటివరకు 80 కి పైగా డాక్టరేట్లను, ఐదుగురు ఎం.ఎస్లను, 1200 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు,  2500 మందికి పైగా గ్రాడ్యుయేట్లను తయారు చేసింది.

***



(Release ID: 1666286) Visitor Counter : 102