రైల్వే మంత్రిత్వ శాఖ

పండుగల రద్దీని ఎదుర్కోడానికి సిద్ధం అవుతున్న రైల్వేలు

ప్రయాణీకుల భద్రత, రద్దీ నివారణ, కోవిడ్ నిబంధనల అమలు, మనుషుల అక్రమ రవాణా నివారణకు ప్రాధాన్యత
ఏర్పాట్లను సమీక్షించిన రైల్వే బోర్డు

Posted On: 16 OCT 2020 7:13PM by PIB Hyderabad

పండుగల సీజన్ దగ్గర పడడంతో రైల్వే స్టేషన్లు, రైళ్లల్లో రద్దీ ఎక్కువ కానున్నది. ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గుర్తించిన రైల్వేలు దీనిని సమర్ధంగా ఎదుర్కోడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని రద్దీ నివారణ అంశానికి రైల్వేలు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో రద్దీని ఎదుర్కోడానికి తీసుకోవలసిన చర్యలపై, రైల్వే బోర్డు ( కార్యకలాపాలు మరియు వ్యాపార అభివృద్ధి),సభ్యుడు, రైల్వే భద్రతా దళం డైరెక్టర్ జనరల్ తో కలసి బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రైల్వేల జోనల్ మరియు డివిజన్ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.

            రైల్వే స్టేషన్లు,రైళ్లల్లో కరోనా వ్యాప్తి చెందకుండా చూడడానికి రూపొందించి అమలు చేస్తున్న చర్యలపై ప్రయాణీకులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.

           పండుగల సమయంలో రైళ్లు, రైల్వే స్టేషన్ లలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణీకులకు  ముఖ్యంగా మహిళా ప్రయాణీకులకు  భద్రత కల్పించడానికి అన్ని జోన్లలో చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు. మహిళా ప్రయాణీకుల  భద్రత కోసం " మీరీ సహాలి"ని కొత్తగా ప్రారంభించారు. మహిళా ప్రయాణీకులలో భద్రతా భావాన్ని పెంపొందించి వారు తమ  భద్రతకు సంబంధించి భయపడినప్పుడు తక్షణం స్పందించడానికి ప్రత్యేక చర్యలను అమలు చేయనున్నారు.

           మనుషుల అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేక చర్యలను అమలు చేయాలని సమావేశం నిర్ణయించింది. రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుంటూ మహిళలు, చిన్న పిల్లలను అక్రమంగా రవాణా చేయడానికి ముఠాలు ప్రయత్నించే ప్రమాదం వుంది. ఈ అంశాన్ని చర్చించిన అధికారులు అక్రమ రవాణాదారులను గుర్తించి అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేక చర్యలను తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

           రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్లలో అక్రమాలకు పాల్పడుతున్న దళారీల నివారణకు అమలు చేస్తున్న చర్యలను కొనసాగించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. పండుగల సమయంలో అవసరమయిన ఎక్కువ ధరలకు అక్రమంగా టిక్కెట్లను విక్రయించకుండా చర్యలను తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

***

 



(Release ID: 1665372) Visitor Counter : 87