ఆర్థిక మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్లీనరీ సమావేశం, ఐఎంఎఫ్ ఫైనాన్షియల్ కమిటీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 15 OCT 2020 8:27PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఫైనాన్షియల్ కమిటీ (ఐఎంఎఫ్ సి), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐంఎఎఫ్) మంత్రుల స్థాయి కమిటీ  సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. 

ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్  ప్రపంచ పాలసీ అజెండా కింద “స్థిరమైన రికవరీకి బాటలు” పేరిట నిర్వహించిన సమావేశంలో భాగంగా ఈ చర్చ చోటు చేసుకుంది. కోవిడ్-19 మహమ్మారిని, దాని ప్రతికూల ప్రభావాలను దీటుగా ఎదుర్కొనేందుకు సభ్యదేశాలు తీసుకున్న చర్యలను కమిటీకి ఐఎంఎఫ్ సి నివేదించింది.

భారతదేశంలో సత్వర, విస్తృత రికవరీకి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజి కింద తీసుకున్న చర్యలను శ్రీమతి సీతారామన్ వివరించారు. తయారీ రంగం పిఎంఐ వంటి అధిక ప్రభావవంత సూచీల రికవరీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో వి షేప్ రికవరీ ఏర్పడుతున్నట్టు సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయని, 2020 సెప్టెంబర్ నెలలో ఈ సూచి ఎనిమిది సంవత్సరాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసిందని ఆమె తెలిపారు. తయారీ రంగం బలమైన రికవరీ అవకాశాలు మెండుగా ఉన్నాయనేందుకు ఇది సంకేతమని ఆమె చెప్పారు. వినియోగ వ్యయాలను పెంచడం కోసం ఇటీవల వెయ్యి కోట్ల డాలర్ల విలువ గల చర్యలను ప్రకటించినట్టు తెలిపారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటికీ చక్కని సూచనలు అందిస్తున్నందుకు ఐఎంఎఫ్ ను , సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి క్రిస్టలినా జార్జీవాను ఆమె అభినందించారు. విధానపరమైన మద్దతును ముందస్తుగా ఉపసంహరించడం వల్ల నగదు లభ్యతలో కొరత ఏర్పడడంతో పాటు దివాలాలు పెరిగిపోతాయన్న ఐఎంఎఫ్ హెచ్చరిక సరైనదేనని ఆమె అన్నారు.

పలు అల్పాదాయ, వర్థమాన దేశాలు కోట్లాది మంది పేదరికం రేఖకు దిగువకు జారుకోకుండా నివారించేందుకు, ఆ తరహా జనాభా సంరక్షణకు పోరాడుతున్నాయని ఆమె చెప్పారు.  ఆయా దేశాల్లో జరుగుతున్నరికవరీ, పునరావాస చర్యలు ఏ రకంగాను తగ్గకుండా చూడాలని ఆమె సూచించారు. 

ప్రతీ ఏడాది ఏప్రిల్ లో జరిగే ఫండ్-బ్యాంక్ వేసవి సమావేశాలు, అక్టోబర్ లో జరిగే వార్షిక సమావేశాల సందర్భంగా ఐఎంఎఫ్ సి సమావేశాలు రెండు సార్లు జరుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఉమ్మడి అంశాలపై చర్చించడంతో పాటు ఐఎంఎఫ్ పని చేయాల్సిన తీరుపై ఈ కమిటీ సలహాలు ఇస్తుంది. ఈ సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి విజృంభణ కారణంగా వేసవి, అక్టోబర్ సమావేశాలు రెండూ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో జరుగుతున్నాయి.

****
 



(Release ID: 1665099) Visitor Counter : 265