ఆర్థిక మంత్రిత్వ శాఖ
దిల్లీ, ఎన్‌సీఆర్, హర్యానాలో ఆదాయపన్ను విభాగం సోదాలు
Posted On:
15 OCT 2020 7:34PM by PIB Hyderabad
డబ్బులు తీసుకుని మధ్యవర్తిత్వం చేసి రాజీలు కుదిర్చే ఓ ప్రముఖ న్యాయవాది కేసులో, ఆదాయపన్ను విభాగం సోదాలు చేపట్టింది. రాజీలు కుదిర్చి, క్లయింట్ల నుంచి అతను భారీగా డబ్బులు తీసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. దిల్లీ, ఎన్‌సీఆర్, హర్యానాలోని 38 చోట్ల తనిఖీలు జరిగాయి.
సోదాల్లో, అధికారులు రూ.5.5 కోట్లను స్వాధీనం చేసుకుని, 10 లాకర్లు జప్తు చేశారు. గత కొన్నేళ్లుగా లెక్కల్లో చూపని డబ్బు అక్రమ లావాదేవీలు, పెట్టుబడుల పత్రాలు లభించాయి. అతని సహచరులైన ఫైనాన్సర్లు, బిల్డర్లకు చెందిన అక్రమ లావాదేవీల డిజిటల్ సమాచారం కూడా భారీగానే దొరికింది.
ఒక కేసులో, నిందితుడు తన క్లయింట్ నుంచి రూ.117 కోట్లను నగదు రూపంలో తీసుకున్నట్లు సోదాల్లో తేలింది. అయితే తాను రూ.21 కోట్లను చెక్ రూపంలో పొందినట్లు అతను లెక్కల్లో చూపాడు. మరో కేసులో, ఓ మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ సంస్థ నుంచి నిందితుడు రూ.100 కోట్లకుపైగా తీసుకున్నాడు. ఓ ప్రభుత్వ రంగ సంస్థతో సదరు సంస్థకున్న వివాదానికి సంబంధించిన కేసులో ఈ మొత్తం పొందాడు.
నివాస, వాణిజ్య ఆస్తుల కొనుగోళ్లు, పాఠశాలల ట్రస్టుల స్వాధీనానికి ఈ అక్రమ నగదును నిందితుడు పెట్టుబడిగా పెట్టాడు. గత రెండేళ్లలో ఖరీదైన ప్రాంతాల్లోని వివిధ ఆస్తుల్లో 100 కోట్ల రూపాయలకు మించి నగదు రూపంలో పెట్టుబడిగా పెట్టినట్లు ఆధారాలు లభించాయి. నిందితుడితోపాటు అతని సహచరులు కూడా వివిధ పాఠశాలలు, ఆస్తులు కొన్నట్లు, ఇందుకోసం 100 కోట్ల రూపాయలకుపైగా నగదు రూపంలో చెల్లించినట్లు తేలింది. కొన్ని కోట్ల రూపాయలను చిన్న మొత్తాల రూపంలోనూ నిందితుడు తీసుకున్నాడు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది.
****
(Release ID: 1664944)
Visitor Counter : 226