ప్రధాన మంత్రి కార్యాలయం

రాజమాత వసుంధర రాజే సింధియా శతజయంత్యుత్సవాల సందర్భంగా రూ.100 ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

Posted On: 12 OCT 2020 2:01PM by PIB Hyderabad

నమస్కారం,

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దేశవిదేశాల్లోని రాజమాత విజయరాజే సింధియా అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు, నా ప్రియ సోదర, సోదరీమణులారా,
ఈ కార్యక్రమానికి వస్తున్న సమయంలో విజయరాజే జీ జీవిత చరిత్రను ఓసారి తిరగేస్తున్న సమయంలో.. కొన్ని ఆసక్తికర పేజీలు కనిపించాయి. అందులో వారు గుజరాత్ యువతనేత నరేంద్ర మోదీ పేరుతో నా పేరును ప్రస్తావించారు.

ఇన్నేళ్ల తర్వాత అదే వారి అదే నరేంద్రమోదీ.. దేశపు ప్రధాన సేవకుడిగా వారి స్మృతిని తలుచుకుంటున్నాడు. డాక్టర్ మురళీ మనోహర్ జోషి గారి నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఓ యాత్ర జరుగుతున్న సందర్భంలో నేనే ఆ యాత్ర వ్యవస్థను చూశానన్న సంగతి మీకు తెలిసిందే.

ఈ కార్యక్రమం కోసం రాజమాత కన్యాకుమారి వచ్చారు. మేం శ్రీనగర్ వెళ్తున్నప్పుడు జమ్మూలో మాకు వీడ్కోలు పలికేందుకు కూడా వారు వచ్చారు. ప్రతి నిమిషం మాలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పుడు మా కల ఒక్కటే.. లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగరేయాలి. ఆర్టికల్ 370ని రద్దుచేయాలి. రాజమాత గారు మాకు ఈ యాత్రలో వీడ్కోలు పలికారు. అప్పటి ఆ కల ఇప్పుడు సాకారమైంది.

వారి పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఒకచోట వారు రాసిన ‘ఒకరోజు శరరీరాన్ని ఇక్కడే వదిలి పెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఆత్మ ఎక్కడినుంచి వచ్చిందో అక్కడకే వెళ్లిపోతుంది. శూన్యం నుంచి శూన్యం వరకు. నా భాగస్వామ్యం ఉన్న, నన్ను భాగస్వామిగా చేసుకున్న కార్యక్రమాల్లోని స్మృతులను ఇక్కడే వదిలి వెళ్తాను’ అని చదివాను. ఇవాళ రాజమాత ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటారు. వారి శుభాశీస్సులను మనకు అందిస్తూనే ఉంటారు. వారు భాగస్వామిగా ఉన్న కార్యక్రమాల్లో ఇక్కడున్న వారిలో కొంతమంది భాగస్వాములుగా ఉండటం ముదావహం. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇవాళ రాజమాత శతజయంత్యుత్సవాలు జరుపుకుంటుండటం సంతోషకరం.

మనలో చాలా మందికి రాజమాతతో చాలా దగ్గరగా కలిసి పనిచేసేందుకు, వారి సేవాకార్యక్రమాలను చూడటంతోపాటు వారి వాత్సల్యాన్ని పొందే సౌభాగ్యం లభించింది. చాలా మంది రాజమాత సన్నిహితులు ఈ సమావేశంలో ఉన్నారు. కానీ రాజమాతకు మాత్రం దేశప్రజలంతా వారి కుటుంబసభ్యులు. ‘నేను ఒక కొడుకుకు కాదు.. వేలమంది పుత్రులకు తల్లిని. వారి ప్రేమాభిమానాల్లో మునిగిపోయాను’ అని చాలా సందర్భాల్లో రాజమాత చెప్పేవారు. అలాంటి గొప్పవ్యక్తిత్వ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా లేకపోయి ఉన్నట్లయితే.. ఈ కార్యక్రమం ఎంత ఘనంగా ఎందరి మధ్యన జరిగుండేది. కానీ.. నాకు రాజమాత గారితో ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకుంటే.. ఈ కార్యక్రమం భవ్యంగా జరిగినా జరగకపోయినా.. దివ్యంగా మాత్రం ఉండేదని నేను విశ్వసిస్తాను.

మిత్రులారా, గత శతాబ్దంలో భారతదేశ దిశను మార్చిన కొందరు వ్యక్తుల్లో రాజమాత విజయరాజే సింధియా ఒకరు. రాజమాత కేవలం వాత్సల్యమూర్తి మాత్రమే కాదు. వారు గొప్ప నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం, సుపరిపాలనను ప్రజలకు అందించిన పాలకురాలు. స్వాతంత్ర్య సంగ్రామం నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈ 70 ఏళ్ల వరకు భారతీయ రాజకీయ వేదికపై ప్రతి అడుగునకు వారు సాక్షిగా ఉన్నారు. విదేశీ వస్తువుల బహిష్కారం నుంచి రామమందిర నిర్మాణ ఉద్యమం వరకు రాజమాత గారి విస్తృతానుభవం అందరికీ తెలిసిందే.

రాజమాతతో కలిసి పనిచేసిన వారు, సన్నిహితులకు వారి గురించి చాలా బాగా తెలుసు. వారికి సంబంధించిన అంశాలు కూడా వారి బాగా తెలుసు. రాజమాత జీవితయాత్రను, వారి జీవన సందేశాన్ని నేటికీ దేశం చదువుకుంటోంది. వాటినుంచి ప్రేరణ పొందుతోంది. చాలా విషయాలు నేర్చుకుంటోంది. వారి అనుభవాలను పదేపదే గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది. ఇటీవలి మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ వారి ప్రేమ, ఆప్యాయతల గురించి విస్తారంగా వెల్లడించాను.

వివాహానికి ముందు రాజమాతకు ఏ రాజ కుటుంబంతోనూ సంబంధం లేదు. వారు ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. కానీ వివాహం తర్వాత రాజ కుటుంబంలోకి రాగానే అందరి అభిమానాన్నీ చూరగొన్నారు. అంతేకాదు. ప్రజాసేవ, రాజకీయ బాధ్యతలను నిర్వర్తించేందుకు రాజకుటుంబంలోనే పుట్టాల్సిన అవసరం లేదని కూడా వారు నేర్పించారు. యోగ్యత, ప్రతిభ, దేశం పట్ల ఓ మంచి భావన ఉన్నటువంటి సాధారణ వ్యక్తులెవరైనా ఈ ప్రజాస్వామ్య దేశంలో సేవ చేసేందుకు ముందుకు రావొచ్చని నిరూపించారు. అధికారం ఉండి, అపారమైన సంపదలుండి, సామర్థ్యం ఉండి, వీటన్నింటికీ మించి రాజమాత అనే హోదా ఉన్నప్పటికీ.. తానుమాత్రం.. సంస్కారాన్ని, సేవను, స్నేహగుణాన్ని తన గుర్తింపుగా మార్చుకున్నారు.

ఈ ఆలోచన, ఈ ఆదర్శాలను వారి ప్రతి అడుగులోనూ గుర్తించవచ్చు. గొప్పింటి నాయకురాలిగా వారి వద్ద వేల మంది పనివాళ్లు, సేవికలు, అన్ని సౌకర్యాలున్నప్పటికీ.. వారు మాత్రం సాధారణ జీవితాన్నే గడిపారు. పేదలు, గ్రామీణ ప్రజలతోకలిసి జీవించారు. వారి కోసమే తన జీవితాన్ని అర్పించారు. జనప్రాతినిధ్యం కోసం రాజ్యాధికారమే కాదు.. ప్రజాసేవే కీలకమని వారు నిరూపించారు. ఓ రాజకుటుంబంలోని మహరాణి అయినా.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే వారి తపనఅన్నీ ఉన్నా జైలు జీవితం గడపడం వారిని మహోన్నత వ్యక్తిగా నిలబెట్టింది.

అత్యయిక పరిస్థితి సందర్భంగా వారు అనుభవించిన బాధలకు మనలో చాలా మందికి సాక్షులుగా ఉన్నాం. ఎమర్జెన్సీ సందర్భంగా తిహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న సమయంలో వారి కూతుళ్లకు లేఖలు రాశారు. ఉషారాజే, వసుంధరా రాజే, యశోధరా రాజేలకు ఈ లేఖలు ఇంకా గుర్తుండే ఉంటాయనుకుంటున్నాను. రాజమాత రాసిన లేఖల్లో ఎన్నో కొత్త విషయాలు, పాఠాలు ఉండేవి. ఓ లేఖలో వారు ‘భవిష్యత్ తరాలు ధైర్యంగా ముందుకెళ్లేందుకు అవసరమైన ప్రేరణ లభించాలి. ఈ ఆలోచన ద్వారా నేటి ఈ విపత్కర పరిస్థితులను మనం ధైర్యంగా ఎదుర్కొనాలి’ అని రాశారు.

దేశ భవిష్యత్తుకోసం రాజమాత తన వర్తమానాన్ని త్యాగం చేశారు. దేశ భవిష్యత్ తరాలకోసం తన సర్వసుఖాలను త్యజించారు. తన పదవి, హోదాకోసం వారెప్పుడూ పనిచేయలేదు. రాజకీయ మార్గాన్ని కూడా ఎంచుకోలేదు. ఎన్నో హోదాలు వారిని గౌరవిస్తూ అవకాశాలుగా వచ్చాయి. కానీ వారు సున్నితంగా, వినయంగానే వాటిని తిరస్కరించారు. ఓ సందర్భంలో జన్ సంఘ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని వాజ్ పేయిజీ, లాల్ కృష్ణ అద్వానీజీ కలిసి రాజమాతను కోరారు. ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వారు మాత్రం ఓ కార్యకర్తగానే జనసంఘ్ కు సేవలందించారు.

ఒకవేళ రాజమాత కోరుకుని ఉంటే.. ఎన్నో ఉన్నతమైన పదవులు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ వారు మాత్రం ప్రజల మధ్యలో ఉంటూనే పేదలు, గ్రామీణులు సేవ చేస్తూ ఉండటానికే ఇష్టపడ్డారు. రాజమాత జీవితంలోని ప్రతి ఘట్టం మనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తుంది. వారితో కలిసి జీవించిన వారెందరో ఇలాంటి ఆసక్తికర, స్ఫూర్తిదాయక ఘట్టాలను మనకు చెపుతారు. ఏకతాయాత్ర సందర్భంగా వారు జమ్మూలో ఉన్నప్పుడు వారితోపాటు ఇద్దరు కొత్త కార్యకర్తలు, సహాయకులు వారితో ఉన్నారు. రాజమాత రెండో వ్యక్తి పేరును తరచూ మరిచిపోయేవారు. అప్పుడు మొదటి వ్యక్తితో నీ పేరు గోలూ కదా.. ఇంకో వ్యక్తిపేరేంటి అని అడిగేవారు. చిన్న చిన్న కార్యకర్తలను కూడా పేరుపెట్టి పలకరించేందుకు ఇష్టపడేవారు. పక్కనున్నవారు.. రాజమాత మీరు పేరు విషయంలో ఇంత చింత ఎందుకు చేస్తారని అడిగేవారు. అప్పుడు వారు.. ‘నా కార్యకర్తలు నాకు సహాయం చేస్తున్నారు. అలాంటి వారిని నేను గుర్తుపెట్టుకోకపోతే అది సరైన పద్ధతి కాదు కదా’ అని అనేవారు.

ఒకవేళ మీరు ప్రజాజీవితంలో ఉన్నట్లయితే.. మీరు ఏ భావజాలం వారైనా, ఏ రాజకీయ పార్టీవారయినా.. సామాన్య కార్యకర్తను కూడా ఇలా పేరుతో పిలవాలనే భావన మనందరిలో కలగాలి. అభిమానం కాదిది.. ఆ కార్యకర్తకు గౌరవభావం కలిగిస్తుంది. ఈ మూలమంత్రాన్ని రాజమాత స్వీయానుభవం ద్వారా తెలిపారు. మిత్రులారా, రాజమాత వారి జీవితంలో ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. సాధన, ఉపాసన, భక్తి కలిగి ఉండేవారు. వారు దైవోపాసన చేస్తున్నపుడు వారి పూజామందిరంలో భారతమాత చిత్రపటం కూడా ఉండేది. భారతమాత ఉపాసన కూడా వారికి ఎంతో విలువైనది.

వారికి సంబంధించిన ఓ విషయాన్ని కొందరు సన్నిహితులు నాకు చెప్పారు. ఆ మాటను నేనెప్పుడూ గుర్తుచేసుకుంటుంటాను. ఆ విషయాన్ని మీకు ఇప్పుడు చెబుతున్నాను. ఓసారి వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మధురా వెళ్లారు. సహజంగానే అక్కడ వారు బాంకేబిహారీ జీ దర్శనానికి వెళ్లారు. అక్కడ బాంకే బిహారీ దర్శనం సందర్భంగా వారు కోరుకున్న కోరికలోని మర్మాన్ని తెలుసుకోవడం చాలా ఆవశ్యకం.

కృష్ణ భగవానుడితో రాజమాత ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థించారో తెలుసుకోవడం రాజమాత గురించి తెలుసుకునేందుకు చాలా ఉపయుక్తమవుతుంది. కృష్ణుడి విగ్రహం ముందు ఆధ్యాత్మిక భావం, భక్తిభావనలతో నిలబడి ‘హే! కృష్ణభగవానుడా.. నీవు వాయించే మురళీనాదంతో దేశంలోని స్త్రీ-పురుషులందరిలో చైతన్యం కలగాలి’ అని ప్రార్థించారు. తనకోసం ఏమీ అడగని గొప్ప వ్యక్తిత్వం వారిది. వారి ఆలోచనప్పుడూ దేశం, ధర్మం గురించే దేశ ప్రజల్లో మంచిగురించి చైతన్యం కలగాలనే వారిప్రార్థన. నిద్రాణస్థితినుంచి బయటకు వచ్చి చైతన్యాన్ని పొందిన పౌరుడు దేశం కోసం ఏమైనా చేయగలడు అని వారు మనస్ఫూర్తిగా విశ్వసించేవారు.

ఇవాళ మనం రాజమాత శతజయంత్యుత్సవాలను జరుపుకుంటున్నాం. ప్రజలను చైతన్యవంతులను చేయాలని.. బాంకేబిహారీ జీకి వారు చేసుకున్న ప్రార్థన ఫలితంగానే ప్రజల్లో కాస్త మార్పు కనిపిస్తోందని నేను భావిస్తున్నాను. కొన్నేళ్లుగా దేశంలో వస్తున్న మార్పులు వచ్చాయి. ఎన్నో పథకాలు విజయవంతం అవుతున్నాయి. ఇదంతా ప్రజల్లో వస్తున్న చైతన్యానికి, ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనం. రాజమాత వారి ఆశీస్సులతోనే దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. గ్రామాలు, పేదలు, పీడిత, వంచిత, శోషిత వర్గాల ఉద్ధరణే మా ప్రాథమిక లక్ష్యం.

మహిళాశక్తి విషయంలో ‘పిల్లలను పెంచేందుకు ఊయల ఊపే చేయి.. ప్రపంచాన్ని పాలించగలదు’ అని వారు చాలా స్పష్టంగా చెప్పేవారు. నేడు దేశపు ఈ మహిళా శక్తే.. దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. నేడు భరతమాత ముద్దుబిడ్డలు ఫైటర్ జెట్స్ నడుపుతున్నారు. నేవీతోపాటు యుద్ద క్షేత్రాల్లో తమ సత్తాచాటుతున్నారు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్లుకు చట్టరూపం ఇవ్వడం ద్వారా రాజమాత ఆలోచనలను సాకారం చేస్తూ.. నారీ సశక్తీకరణను మరింత ముందుకు తీసుకెళ్తున్నాం.

భారతదేశ అఖండత, ఐకమత్యం కోసం వారు చేసిన కృషి, సంఘర్షణ ప్రభావం నేడు స్పష్టంగా కనబడుతోంది. ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా వారికల సాకారమైంది. అంతేకాదు.. రామజన్మభూమి మందిర నిర్మాణం కోసం వారు చేసిన సంఘర్షణకు.. ఫలితం వారి శతజయంతి సందర్భంగా పూర్తికావడం వారెక్కడున్నా సంతోషించే విషయం. రామజన్మభూమి అంశం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి.. ఇక్కడో విషయం గుర్తుచేయాలి. సోమనాథ్ నుంచి అద్వానీ గారు అయోధ్య యాత్ర ప్రారంభిస్తున్నప్పుడు.. మా అందరికీ రాజమాత వస్తే బాగుంటుందని అనుకున్నాం. రాజమాత కూడా ఇంతటి గొప్ప కార్యక్రమంలో తను కూడా భాగస్వామ్యం కావాలనుకున్నారు. కానీ ఓ సమస్య ఎదురైంది. అదేంటంటే.. అది నవరాత్రుల సమయం. నవరాత్రుల్లో రాజమాత అనుష్ఠానం చేస్తారు. ఆ సమయంలో వారు ఎక్కడైతే అనుష్ఠానం ప్రారంభిస్తారో నవరాత్రులు అక్కడినుంచి కదలరు. కానీ రాజమాత మనసులో మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఉంది. అప్పుడు నేను రాజమాతతో మాట్లాడుతున్నారు. వారు.. చూడు సోదరా.. నేను రాలేను. కానీ నేను రావడం తప్పనిసరి అన్నారు. మరి ఏంచేద్దామో చెప్పండని అడిగాను. ప్రతిసారి గ్వాలియర్లో నవరాత్రులు జరుపుకుంటాను. కానీ ఈసారి సోమనాథ్ నవరాత్రులు జరుపుకోవాలనుకుంటున్నాను. అక్కడే నవరాత్రులు ఉంటాను కాబట్టి రథయాత్ర ప్రారంభానికి నేను హాజరయ్యేందుకు వీలుంటుందన్నారు.

రాజమాత ఉపవాసం చాలా కఠినంగా ఉంటుంది. అప్పుడే నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. ఓ కార్యకర్తగా వ్యవస్థ, ఏర్పాట్లు చూసేవాడిని. ఆ సమయంలో నేను రాజమాత సోమనాథ్ ఏర్పాట్లు చూసుకున్నాను. ఈ సమయంలో రాజమాత సాహెబ్ ను చాలా దగ్గర్నుంచి చూసే అవకాశం దక్కింది. ఈ సమయంలో వారి పూజ, నవరాత్రి అనుష్ఠానం ఎంత కఠినంగా ఉంటుందో గమనించాను. అయోధ్య రథయాత్రకు, రామమందిర నిర్మాణానికి వారి పూజను, అనుష్ఠానాన్ని అంకితం చేశారు. ఇవన్నీ నేను నా కళ్లతో  చూడటం.

మిత్రులారా, రాజమాత విజయరాజే సిందియా గారి కలలను సాకారం చేసేందుకు మనమంతా కలిసి ముందుకెళ్లాల్సిన అవసరముంది. సశక్త, సురక్షిత, సమృద్ధ భారత నిర్మాణం వారి కల. ఆత్మనిర్భర భారత నిర్మాణం ద్వారా వారి కలలను మనం సాకారం చేద్దాం. వారి స్ఫూర్తి, వారి ఆశీర్వాదం ఎప్పుడూ మనతోనే ఉంటాయి.

ఈ శుభాకాంక్షలతో నేను మీ అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. వారి జీవితం ఎంత విలక్షణమైనదంటే.. ఇవాళ ఓ తహసీల్ అధ్యక్షుడి మానస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించండి. కానీ రాజమాత ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినా.. అధికారం చేతిలో ఉన్నా.. అపారమైన ఆస్తిపాస్తులు, సంపదలున్నా అదే వినయం, వివేకం, సంస్కారంతో జీవించారు. వారి నిరాడంబర జీవితమే మనందరికీ పేర్రణ.

రండి, మన కొత్త తరానికి ఈ అంశాలపై చర్చించేందుకు అవకాశమిద్దాం. ఇదో రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. మన భవిష్యత్ తరాలకు సంబంధించినది. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ నాణేన్ని దేశానికి అంకితం చేయడం మా ప్రభుత్వానికి దక్కిన గొప్ప సౌభాగ్యంగా భావిస్తున్నాను.

మరొక్కసారి రాజమాతకు వినయపూర్వకంగా నమస్కరిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

ధన్యవాదములు.

***



(Release ID: 1663942) Visitor Counter : 195